మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం! | Today womens day | Sakshi
Sakshi News home page

మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!

Published Sun, Mar 8 2015 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!

మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!

కవర్ స్టోరీ
ప్రతిరోజూ మహిళలది కావాలిగానీ, ఈ ఒక్కరోజును ప్రత్యేకంగా మహిళా దినోత్సవం అనడంలో ఔచిత్యం ఏమిటి? ఎందుకంటే, జనాభాలో దాదాపు సగభాగమున్న మహిళలు, అవకాశాల్లో మాత్రం సమభాగాన్ని నేటికీ అందుకోలేకపోతున్నారు కనుక. వెనుకబడిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మాత్రమే కాదు, ఘనత వహించిన అగ్రరాజ్యాల్లోనూ మహిళలకు సమప్రాతినిధ్యం కరువే.

అయినా ఏటా మహిళా దినోత్సవం రోజున మాత్రం మన పాలకులు మహిళల విజయగాథలను మననం చేసుకుని ఆనంద పరవశులైపోతారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను తలచుకుని ఆగ్రహం చెందుతారు. ఆ రోజు గడచిపోయాక ఇక అంతా మామూలే. కనీసమైన హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి మహిళలకు నేటికీ తప్పడం లేదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

 
ఒక్క మహిళా దినోత్సవం నాడే కాదు
 
పురుషులు పాల్గొంటే మేలు...
మహిళాదినోత్సవం గత కొన్నేళ్లుగా ఎలా జరుగుతోందో మనందరికీ తెలుసు. కొన్ని ఉపన్యాసాలు, కొన్ని సన్మానాలు, ఆ ఒక్కరోజుకూ అందరు మహిళలకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు; వారి ‘దినం’ మీద కొందరు పురుషోత్తముల ఛలోక్తులు; టీవీ ఛానెళ్లలో చర్చలు; దినపత్రికల్లో పేజీల కేటాయింపులు; పార్టీ కార్యాలయాల్లో మహిళా సభ్యులకు సన్మానాలు; కొన్ని దుకాణాల్లో డిస్కవుంట్లు - చెప్పిన కథలే చెప్పుకోవడాలు; విన్న సందేశాలే వినడాలు.
 
ఈ మాటల వల్ల, సన్మానాల వల్ల ఫలితం ఏమిటి? ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి ఏం సాధిస్తున్నాం? ఉన్నతోద్యోగాలలో మహిళల సంఖ్య పెరిగింది. సంపన్నుల జాబితాలో వాళ్లకూ   చోటు దక్కుతోంది. నిజమే, కానీ మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లేదు. మహిళలపై హింస (అత్యాచారాలు, హత్యలు, మానసిక హింసలు) ఏ మాత్రం తగ్గలేదు; బాలికల అక్షరాస్యత పెరగలేదు; స్త్రీలకు కుటుంబ భారం ఏ మాత్రం తగ్గలేదు; వరకట్న చావులు అంతరించలేదు. లైంగిక వేధింపులూ అదే స్థాయిలో ఉన్నాయి.
 
మహిళాదినోత్సవం నాడు మళ్లీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఆవేశపడతాం; ఆనందపడతాం. చాలా సభల్లో మాట్లాడేవాళ్లూ, వినేవాళ్లూ ఆడవాళ్లే. రోలూ, మద్దెల మాట్లాడుకున్నట్టు. దానికంటే ఎవరిలోనైతే మార్పు రావాలో వారి చేత మాట్లాడించి, వాళ్లను శ్రోతలుగా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. స్త్రీల పట్ల గౌరవం చూపే, స్త్రీల సమస్యలపై కృషి చేసే పురుషులను మహిళా దినోత్సవంలో పాత్రధారులను చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. టీవీలో వచ్చే ప్రభుత్వ ప్రకటనలోలా, ‘‘మగపిల్లలను ఆడపిల్లలా ఏడవొద్దని చెప్తాం. ఆడపిల్లలను ఏడిపించవద్దని ఎందుకు చెప్పం?’’ బహుశా మహిళాదినోత్సవాన్ని పురుషులు ఎక్కువగా జరిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నేననుకుంటాను.
 - సి.మృణాళిని, కాలమిస్ట్, రచయిత్రి
 
ముందడుగు వేయాలనే తపన ఉండాలి!
మనకు అన్ని రంగాల్లోనూ అవకాశాలుంటాయి. వాటిని ఉపయోగించుకోవడానికి చొరవ చూపాల్సింది మనమే. ఉదాహరణకు స్పోర్ట్స్ రంగంలోకి రావడానికి చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ క్రీడల వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఉన్నత చదువులు చదువుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో సీటు తెచ్చుకోవచ్చు. క్రీడారంగంలోని వారికి ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. వృత్తి ప్రవృత్తి రెండింటిలోనూ రాణించవచ్చు. ముందడుగు వేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు.
 - నైనా జైస్వాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి
 
కొత్త స్ట్రాటజీ కావాలి
విమెన్స్ మూవ్‌మెంట్ వల్ల మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు, కొత్త చూపు వచ్చాయి. ఆచరణకు మాత్రం ఆమడదూరంలోనే ఉన్నాయి. నేడు విమెన్స్‌డేగా మనం జరుపుకుంటున్న నాటి పోరాటం వల్ల మహిళల సమస్యలను విశ్లేషించడం మొదలైంది. ఆ సమస్యలను గుర్తించడానికి మెథడాలజిస్ వచ్చాయి. బాగుంది... కానీ ఆ మూవ్‌మెంట్ డిఫరెంట్ లేయర్స్‌లోకి వెళ్లలేదు. ఇన్నేళ్లయినా మహిళలకు ఈక్వల్ రైట్స్ రాలేదు. తన జీవితానికి  సంబంధించి ఆమె నిర్ణయాధికారం పొందలేదు. ఇప్పటికీ మహిళ పట్ల పరాధీన, సెక్సువల్ ఆబ్టెక్ట్ ధోరణే అమలవుతోంది.

ఇది ఒక్క భారతదేశంలోనేకాదు, ఎంతో అభివృద్ధి చెందినవని చెప్పుకుంటున్న యూరోపియన్ కంట్రీస్‌లోనూ అంతే! స్త్రీ ఎదుర్కొంటున్న రేప్, డ్రెస్‌కోడ్ నిర్ణయించడం, కాప్ పంచాయితీలు వంటి బయటి హింస గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇంట్లో హింసను చెప్పుకోవడంలేదు. కాబట్టి విమెన్స్ డేను ఒక ఉత్సవంగా జరుపుకొంటూనే వివిధ వర్గాల్లోని మహిళల సమస్యలను గుర్తించి, వాటిలో కామన్‌గా ఉన్న సమస్యలకు ఒక ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగించాలి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు వచ్చిన కదలిక మిగిలిన సమస్యల మీదా రావాలి. ప్రభుత్వ పాలసీల్లో మార్పు తీసుకురాగలగాలి. దానికోసం ఓ కొత్త స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాలి!
- విమల, కవి, రచయిత
 
ఏం దినోత్సవమో ఏమో!
ఏం మహిళా దినోత్సవమో ఏమో... ఇత్తులేసే దగ్గర నుంచి మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకునేవరకూ అన్నీ నేనే చేసుకోవాలే. ఇదే మా దినం. ఇదితప్ప నాకేం తెల్వదు. బిడ్డలుంటే ఏంది? ఎవరి తిప్పలు వాళ్లకుంటయి కదా! వికారాబాద్ దగ్గర చెంచల్‌పేట ఊరు మాది. రెండెకరాల పొలముంది. నా భర్తకు యాక్సిడెంట్ అయింది. రెండు లక్షలదాకా ఖర్చుపెట్టి వైద్యం చేయించిన. పొలంల అన్ని రకాల ఆకుకూరలు ఏస్త. రోజు పొద్దుగాలే ఐదింటికి బస్సెక్కి వచ్చి ఈడ సిటీల అమ్ముకుని సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి మర్రుత. మహిళారైతులకు ఆ సాయం చేస్తం, ఈ సాయం చేస్తం అని సర్కారోళ్లు చెప్తరు గాని ఏం చెయ్యరు. గిదోదో మహిళా దినముంటున్నరు కదా కనీసం ఆ రోజైనా మా రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటది.
- కసమమ్మ, మహిళా రైతు
 
నల్ని మనం విశ్లేషించుకోవచ్చు...
పరిగెడుతున్న నేటి కాలంలో అందరం బిజీ అయిపోయాం. ఎందుకలా పరిగెడుతున్నామో అర్థం కాదు. ఏదో ఒక రోజు ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవడం, తెలుసుకోవడం, ఇంతవరకు జరిగిందేమిటి అని విశ్లేషించుకోవడం... ఇవన్నీ మన మంచికే! ఇలాంటి సమయంలో సమాజంలో నేటి స్త్రీ గురించి ఆలోచనాత్మకంగా మాట్లాడే నలుగురి మాటల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. లేకపోతే జీవితం అలా గడచిపోతూనే ఉంటుంది. అలాగే ఒక వేదికమీద అన్ని వర్గాల వారు కలిసి, స్త్రీల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మనమూ ఏదైనా చేయూతనివ్వగలమా అనే దిశగా ఆలోచిస్తాం. ఆ విధంగా సమాజానికి మనమూ కొంత సేవ చేసినవారమవుతాం. సమానత్వం కోసం పోరాడే క్రమంలో ఏయే శక్తులు అవసరమో కూడా తెలుసుకొని ఉండటం మంచిదే. అందుకే మహిళా దినోత్సవం లాంటి ఒక రోజు తప్పక ఉండాలి.
- అలేఖ్య పుంజల, కూచిపూడి నృత్యకారిణి
 
ది శుభ పరిణామం
గత కొన్ని దశాబ్దాలుగా మహిళా ఉద్యమంలో యువతులు చాలా చురుగ్గా ఉన్నారు. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. మహిళా ఉద్యమం జీవితంలోనే కాదు ప్రకృతిలో కూడా అంతర్భాగమనే విషయాన్ని తెలియజేస్తోందీ పరిణామం.
- గీతా రామస్వామి ప్రచురణకర్త, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్
 
మూడు నెలల బతుకు
ఏం దినమమ్మా... మహిళా దినమా? గారోజు ఏం చేస్తరు? మాలాంటి పేద మహిళలకు ఏమన్న ఇస్తరా? మాకు మా ఊర్ల  దేవుని ఉత్సవాలు తప్ప ఇంకేదెల్వదు. మాది మెదక్ జిల్లా దగ్గర కంచెర్ల ఊరు. మేం ఏడంతా ఏదురుచూసేది ఎండకాలం కోసమే. ఈ మూడునెలలే కదా కుండలు అమ్ముడువోయేది. రోజంతా ఎండల గూసోని ఈ కుండలమ్ముకుంటేగాని మాకు బతుకు ఎల్లదు. ఎండకాలమొస్తనే నాకు చేతుల నాలుగు పైసలాడుతయి. ఆటితోనే ఏడంతా గడపాలే. పూర్వం ఊళ్ల వానాకాలం, చలికాలం పనులకు పోయేటోళ్లం. ఇప్పుడు పనులకు పోనీకి పంటలేడున్నయ్. ఈ సిటీల ఏదన్న పని చేసుకుందామంటే పని తక్కువ, మందెక్కువ. మీరంటున్న దినంనాడైనా మా పేద మహిళల కష్టాలు గుర్తుచేసుకుంటే మంచిగుంటది.
- గంగమ్మ, కుండల వ్యాపారి
 
హిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!
ఫలానా రంగాలకే పరిమితం అనే పరిధుల్ని చెరిపేసి మహిళలు ముందుకెళ్తున్నారు. నేను చిత్రరంగాన్ని, రాజకీయరంగాన్ని దగ్గరగా చూశాను. మగవాళ్లలో మహిళ ముందుకెళ్తుంటే చూసి భరించలేని తత్వమే ఎక్కువ! మహిళల మీద జరుగుతున్న దాడులను చూస్తుంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. దీనంతటికీ కారణం... ఇంట్లో పిల్లలకు మంచీచెడూ చెప్పే పరిస్థితి తగ్గింది. పైగా విద్యావ్యవస్థలోనూ నైతికత గురించి పాఠాలు ఉండటం లేదు.

మార్కెట్ ఆధారిత విద్యాంశాలకు పెద్ద పీట వేసే క్రమంలో మోరల్ ఎడ్యుకేషన్ పక్కకు తప్పుకొంది. దీనికి ఇళ్లల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటమూ ఓ కారణమే. పిల్లల్లో మార్పు వచ్చిందని తల్లిదండ్రులు గమనించే లోపే జరగాల్సిన అనర్థాలెన్నో జరిగిపోతున్నాయి. చైనాలో ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంది. ఇంటర్నెట్‌లో అభ్యంతరకరమైన సైట్లను బ్లాక్ చేసింది. అలాంటి నిర్ణయం మన ప్రభుత్వమూ తీసుకోవాలి. ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నా మహిళ సవాళ్లను ఎదుర్కొంటూ మనోనిబ్బరంతో ముందుకు సాగుతోంది. వివక్ష రహిత సమాజ స్థాపన జరిగే వరకు ఇదే ధైర్యంతో నడుచుకోవాలి.
- రోజా సెల్వమణి, నగరి ఎం.ఎల్.ఎ. (ఆంధ్రప్రదేశ్)
 
దినం చేసే సాయం ఏమిటి?
మహిళా దినోత్సవమా? మాలాంటి కూలోళ్లకు అలాంటి దినోత్సవాల గురించి ఏం తెలుస్తుంది! శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకుతెరువుకి ఐదేళ్లక్రితం నగరానికొచ్చాం. మగోడి సంపాదన కడుపు నింపడానికే సరిపోవడం లేదు. పిల్లల్ని చదివించుకోవాలంటే మాలాంటి పేదోళ్లు తట్ట ఎత్తక తప్పడం లేదు. సంటిపిల్లల్ని చంకనెత్తుకుని పనులకొస్తున్నాం. లేదంటే పస్తులే.  మాకుండే సమస్యలు, వచ్చే రోగాలు, పడే తిప్పలు ఇంట్లోవాళ్లతో చెప్పుకునే అవకాశం లేనప్పుడు పనిచేసే చోట మాతోటోళ్లతో చెప్పుకుంటాం. వాళ్లు చెప్పే ఓదార్పు మాటలు మాకు చానా సాయం చేస్తాయి. మగోడిలా కష్టపడుతున్న ఆడోళ్లకు ఈ దినం చేసే సాయమేందో మాబోటోళ్లకు తెలియదు.
- కుమారి, భవన నిర్మాణ కార్మికురాలు
 
గౌరవంగా చూసిన రోజే...
స్త్రీల వేషధారణ మీద ఇటీవల చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక ఇంట్లో అమ్మాయి జీన్స్ వేసుకోవడం సాధారణంగా కనిపిస్తే, అదే మరో ఇంట్లో అసాధారణంగా కనిపించవచ్చు. ఇది చాలా మంది ఒప్పుకోని నిజం.
 స్త్రీ వ్యక్తిత్వాన్ని చులకనగా చూసే భావం మగవారిలో పోవాలి. ప్రకృతి పరంగా స్త్రీ కన్నా పురుషుడు బలవంతుడు అయ్యి ఉండవచ్చు. కానీ, మహిళకు మగవారికన్నా శక్తియుక్తులు వెయ్యి రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రేమ, ఓర్పు, క్షమల్లో స్త్రీదే ప్రథమ పాత్ర. అంతటి శక్తిమంతురాలిని చిన్ననాటి నుంచి తల్లిదండ్రులే తమ పెంపకంలో తేడా చూపి వెనుకబాటుతనానికి లోను చేస్తుంటారు. వంట చేసే పని ఉంటే అమ్మాయిని చేయమంటారు. బయటకు వెళ్లే పని ఉంటే అబ్బాయిని పంపుతారు. ‘ఫలానా పని అమ్మాయిది, ఫలానా పని అబ్బాయిది’ అనే తేడాలు పోవాలి.
- శిల్పారెడ్డి, మోడల్, డిజైనర్
 
పెళ్లయితే ఉద్యోగం మానాలా?
మా దగ్గర బిటెక్, ఎంటెక్ చదివిన అమ్మాయిలు హఠాత్తుగా ఓ రోజు ‘పెళ్లి కుదిరింది, అత్తగారి తరఫు వాళ్లు ఉద్యోగం మానేయమంటున్నారు’ అంటుంటారు. పెళ్లయితే ఉద్యోగం మానేయడం ఎందుకు? స్థూల జాతీయోత్పత్తి పెరగాలని ప్రణాళికలు సిద్ధం చేసే పాలనా యంత్రాంగాలు సగం మానవ వనరులను నిరుపయోగంగా వదిలేసి అభివృద్ధి ఎలా సాధించగలమని ఆలోచించడం లేదు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా చూడండి... మహిళలు, మగవాళ్లు ఇద్దరూ పనిచేస్తారు. పని అంటే ఉద్యోగమే కాదు. చేతనైన పని ద్వారా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం! అదే జరిగిన రోజు భర్త చనిపోతే ఇల్లు గడవక వీధిన పడే కుటుంబాలే ఉండవు.
- సుచిత్ర ఎల్లా, మేనేజింగ్ డెరైక్టర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్
 
లాగైతే రోజూ ఉత్సవమే!
విష్ యు హ్యాపీ ఉమెన్స్‌డే. ఇది మహిళలే కాదు అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. మహిళల విజయాలు, కష్టాలు మహిళలకు మాత్రమే సంబంధించినవనుకోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. మహిళకు కష్టం వచ్చిందంటే సమాజానికి కూడా సమస్య వచ్చినట్టేనని గుర్తించాలి. స్త్రీ రక్షణ ఒక్క పోలీసులదే కాదు. మహిళలపై పెరుగుతున్న దాడుల సంఖ్య మన సమాజం పోకడని నిర్ణయిస్తుంది. మా డిపార్టుమెంట్ తరపున షీ టీమ్ చక్కగా పనిచేస్తోంది. ఇక్కడ నేను సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే... చాలామంది మగవాళ్లు ‘మేం ఏ రకంగా సహకరించగలము’ అంటూ మా షీ టీమ్‌ని సంప్రదిస్తున్నారు. ఇలాంటి మార్పు మహిళలకు రోజుకో మహిళాదినోత్సవాన్ని ఇస్తుంది.
- స్వాతి లక్రా, అడిషనల్ సిపి, క్రైమ్

రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి, సరస్వతి రమ, నిర్మలారెడ్డి, భువనేశ్వరి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement