ఇంకెన్ని చావులు చదవాలి? | How many deaths should read..? | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని చావులు చదవాలి?

Published Mon, Jun 29 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

ఇంకెన్ని చావులు చదవాలి?

ఇంకెన్ని చావులు చదవాలి?

అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటే చావుని చప్పరిస్తున్నారు. ఊరికి మొనగాళ్లవుతారనుకుంటే ఉరికి బలైపోతున్నారు.
ప్రకాశిస్తారనుకుంటే కిరోసిన్‌లో అగ్నిస్నానాలు చేస్తున్నారు. మనకు ధైర్యమిస్తారనుకుంటే... దగా చేసి వెళ్తున్నారు. అక్షరాలపై సవారీ చేస్తారనుకుంటే... అంపశయ్యలెక్కుతున్నారు. ఆకాశాన్ని తాకుతారనుకుంటే... మట్టికరుస్తున్నారు. చదవలేక, చావుని వాళ్లు కోరుకుంటుంటే... వాళ్ల చావుల్ని చదవలేక మనం కుమిలిపోతున్నాం. చదవలేక, కక్కలేక మింగుతున్న విషానికి విరుగుడు కావాలి. ఈ కడుపుకోతను మాన్పే చదువులను కనిపెట్టాలి.

 
ఈ ఏడాది
జూన్ 26 శుక్రవారం: గుత్తి మండలం, ఎంగిలిబండ గ్రామం. దేవరాజ్, లక్ష్మీదంపతుల కొడుకు ఎ. నారాయణస్వామి. గుత్తిపట్టణంలోని మహాత్మా జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. 25వ తేదీ గురువారం రాత్రి ఇంట్లో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి శుక్రవారంనాడు ప్రాణాలు వదిలాడు.
   
జూన్ 24 బుధవారం: యాడికి మండలం పి.వెంగన్నపల్లి గ్రామం. నాగేశ్వర్, రాజా మునీశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి.. ముగ్గురూ మంచి స్నేహితులు. ఊళ్లోని జిల్లాపరిషత్ స్కూల్లో టెన్త్ చదువుతున్నారు. రాజా మునీశ్వర్‌రెడ్డికి చదువుకన్నా వ్యవసాయం అంటే ఇష్టం. నాగేశ్వరేమో ఇంటి గొడవలతో కలతచెంది ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అమాయకుడు. మునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్‌లు ఎలా చెబితే అలా! మొత్తానికి రకరకాల వ్యక్తిగత కారణాల వల్ల ముగ్గురికీ చదువంటే అనాసక్తతే. పైగా ఇప్పుడు టెన్త్‌కొచ్చారు. అది బోర్డ్ ఎగ్జామ్ అని, చాలా కష్టపడి చదివితే కానీ పాస్ అవలేమని అంతా అంటుంటే భయం పెట్టుకున్నారు. దాంతో ఇంట్లో పోరు మొదలుపెట్టారు చదువుకోకుండా వ్యవసాయం పనులు చేస్తామని. వ్యవసాయం తర్వాత చెయ్యొచ్చు. ముందు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నచ్చచెప్పి బడికి పంపారు. కానీ వాళ్లు బడికి వెళ్లినట్టే వెళ్లి వేరుశనగ విత్తనాలను నిల్వచేయడానికి ఉపయోగించే విషపు గుళికలను మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
   
జూన్ 3 బుధవారం: కర్నూలుకి చెందిన పుల్లంరాజు (బీఎస్‌ఎన్‌ఎల్‌లో అధికారి), కుమారిల కూతురు స్వర్ణకుమారి. అనంతపురం మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చేస్తోంది. సరిగ్గా చదవలేకపోతున్నాననే మానసిక ఒత్తిడికి లోనయింది. అదే విషయాన్ని ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకుంది. జూన్ మూడో తారీఖున స్వర్ణ పుట్టిన రోజు. రెండో తారీఖు అర్ధరాత్రి కేక్‌కట్ చేసి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది. ఆనందంగా గడిపింది. ఇంతలో ఏమయిందో ఏమో... హాస్టల్‌లోని తన రూమ్ 121లో.. ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరేసుకొని ఉసురు తీసుకుంది.. తండ్రికి ఉత్తరం రాసిపెట్టి మరీ. ఆ సూసైడ్ నోట్‌లో ... ‘మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నేను చదవలేకపోతున్నా. ఎంత చదువుతున్నా ఏమీ గుర్తుండట్లేదు. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతా. నా ఫెయిల్యూర్‌ని మీరు తట్టుకోలేరు! సారీ డాడీ.. సారీ మమ్మీ! లవ్ యూ బోత్! ఫర్ గివ్ చేయండి!’ అని ఉంది.
ఈ నాలుగూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే జరిగిన సంఘటనలు.
   
ఏడాది క్రిందట
ఆగస్టు 28 గురువారం:
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, తిమ్మారెడ్డిపాలెంకు చెందిన పందొమ్మిదేళ్ల సుభాషిణి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తుండేది. ఫస్టియర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పింది. దానికి సంబంధించి ఏం మథన పడిందో ఏమో... సప్లిమెంటరీ పరీక్ష రాసిన రోజే అంటే 2014, ఆగస్ట్ 28 సాయంకాలం ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకొని కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చికిత్స పొందుతూ మరణించింది.
   
అంతకుముందు ఏడాది

విశాఖపట్నం, మధురవాడలోని గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓంకార్ తన సబ్జెక్టులు అర్థం కావడం లేదని, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తరచు స్నేహితులతో అంటుండేవాడు. ఆ క్రమంలో ఓ రోజు హాస్టల్లోనే ఉండిపోయాడు. లంచ్ బ్రేక్‌లో తోటి విద్యార్థులు వచ్చి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు!
 
నిజామాబాద్ జిల్లా బడా భీమ్‌గల గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే. ఆమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చదువులో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంతా అనుకున్నారు.
 
ఒత్తిడిని తట్టుకోలేకే...
పై సంఘటనల్లోని విద్యార్థుల నేపథ్యం వేరయినప్పటికీ వారందరి ఆత్మహత్యలకు కారణం ఒక్కటే... ఒత్తిడి. అయితే ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు, ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీల మీదున్న మోజు.. సమాజం వాటికి ఇస్తున్న విలువ.. ప్రతిభను ర్యాంకుల్లో కొలిచే పద్ధతి.. ఇవన్నీ పిల్లల మీద తెలియని ఒత్తిడిని మోపుతున్నాయి. తట్టుకోలేని సున్నిత మనస్కులైన విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా సెలవు తీసుకుంటుంటే తట్టుకొని నిలబడిన పిల్లలు యంత్రాల్లా మారుతున్నారు. ఈ రెండూ దుష్పరిణామాలకు దారి తీసేవే! ఇలాంటి పరిణామాలు సంభవించకుండా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
- సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండాలి

ఇలాంటి ఘటనలను నివారించడంలో ఇటు తల్లిదండ్రుల పాత్రా, అటు టీచర్ల పాత్ర కూడా కీలకమే. ఇంట్లో పిల్లాడి ప్రవర్తనలో తేడాలొస్తే తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లను వాకబు చేయాలి. అలాగే స్కూల్లో పిల్లాడు ఎవరితో కలవకుండా ఉంటుంటే టీచర్లు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి. మొత్తంగా పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరక్కుండా ఆపొచ్చు. అలాగే పేరెంట్స్ పిల్లల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ ప్రణాళికలు వేయాలి.
- డాక్టర్ పి. వీరజారావు, సైకాలజిస్ట్ అండ్ అసిస్టెంట్‌ప్రొఫెసర్, ఉస్మానియా
 
వ్యక్తిత్వ నిర్మాణానికి చోటు ఉండాలి

చదువులు, మార్కుల విషయంలో పిల్లలపై ఒత్తిడి రావడానికి మూలకారణం వారి భావి జీవితం పట్ల పెద్దల్లో అభద్రతా భావం ఉండడమే. సమాజంలో ఏదో ఒక వృత్తి లేదా ఉపాధి  లభించి గౌరవప్రదంగా జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన విద్యా విధానం విద్యార్థులను యంత్రాలుగా తయారు చేస్తోంది తప్ప జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగిన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడడం లేదు.
- ఎస్.గోవిందరాజులు, రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement