జమ్ముకశ్మీర్‌ను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. రాజౌరి జిల్లాలో వ్యాపించిన ఈ రహస్య వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 15కుపెరిగింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా జమ్మూలోని ఒక ఆసుపత్రిలో తొమ్మిదేళ్ల బాలిక అంతుచిక్కని రుగ్మతతో మరణించింది. దీంతో రాజౌరి జిల్లాలోని మారుమూల గ్రామమైన బాధల్‌లో గడచిన ఒకటిన్నర నెలల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగింది.
గత ఏడాది డిసెంబర్ 7 నుండి..
ఈ అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి పోలీసులు ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే బాధల్ గ్రామంలో మరణాలకు అంతుచిక్కని వ్యాధి కారణమనే వాదనను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ ఖండించారు. కాగా జమ్మూలోని ఎస్‌ఎంజీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జబీనా అనే బాలిక బుధవారం సాయంత్రం మృతిచెందిందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో ఆమె నలుగురు తోబుట్టువులు, తాత కూడా మృతిచెందాడని వారు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 నుండి కోట్రాంకా సబ్ డివిజన్‌లోని బాధల్ గ్రామంలోని మూడు కుటుంబాల్లో ఇటువంటి పరణాలు సంభవించాయని తెలుస్తోంది.
ప్రయోగశాలలకు నమూనాలు
తాజాగా ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఐదుగురు మరణించారని తెలియగానే ఆరోగ్య శాఖ ఇంటింటికీ వెళ్లి 3,500 మంది నుంచి నమూనాలను తీసుకుని, వివిధ ప్రయోగశాలలకు పరీక్ష కోసం పంపిందన్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో మరో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి సహాయం కోరామన్నారు. దీంతో పలు వైద్య బృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు.
11 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు
మరోవైపు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుధల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) వజాహత్ హుస్సేన్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు రాజౌరి ఎస్‌ఎస్‌పీ గౌరవ్ సికార్వర్ తెలిపారు. ఏదైనా వ్యాధి కారణంగా మరణాలు సంభవించినట్లయితే, అది వెంటనే వ్యాపించి ఉండేదని, అది ఆ మూడు బాధిత కుటుంబాలకే పరిమితమై ఉండేదికాదన్నారు. పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ) మైక్రోబయాలజీ విభాగం బాధితుల నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్?
Comments
Please login to add a commentAdd a comment