హారిక రిషికుమార్‌ల పెళ్లి ఫొటో (ఫైల్)
♦ హారిక మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు
♦ పోలీసుల అదుపులో నిందితులు
నాగోలు : ఎంబీబీఎస్‌లో సీటు రాలేదని, ఎంసెట్ కోచింగ్ కోసం పెట్టిన డబ్బును తీసుకురావాలని తమ కూతురిని అల్లుడే కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేశాడని హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన హారిక (20)తో 2015 సంవత్సరంలో అదే జిల్లాకు చెందిన రిషికుమార్‌తో పెళ్లి జరిగింది. కట్నం కింద రిషికుమార్‌కు రెండెకరాల భూమి, రూ. ఐదు లక్షల కట్నం ఇచ్చారు. వివాహం అయిన తరువాత ఎంసెట్ శిక్షణ కోసం హారిక కొంతకాలం ప్రైవేటు హాస్టల్‌లో ఉండి కోచింగ్ తీసుకుంది. అయితే ఎంసెట్‌లో సీటు రాలేదు.
బీడీఎస్ కోర్సులో సీటు రావడంతో నగరంలోని రాక్‌టౌన్‌లో నివాసముంటున్నారు. రిషికుమార్ కొత్తపేటలోని ఐటీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్‌సీటు రాకపోవడంతో హారికను భర్త మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశాడు. కోచింగ్ కోసం అయిన ఖర్చు ఐదు లక్షల రూపాయలను పుట్టింటి నుంచి తీసుకురమ్మని వేధిస్తున్నాడు. రిషి తల్లిదండ్రులు హరిచంద్, అరుణలు కూడా హారికను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కిరోసిన్ పోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు సోమవారం ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు రిషికుమార్, అతని తల్లితండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా హారికను భర్త రిషికుమార్ హత్య చేసి కిరోసిన్ పోసుకుని అంటించి.. తనకు తానుగానే ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హారిక మృతి చెందిన ప్రమాద స్థలాన్ని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్‌భగవత్ సోమవారం పరిశీలించారు.