కర్నూలు(సెంట్రల్): కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్‌కుమార్(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం మూడో సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత మెడికల్ కాలేజీ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరించి సమాచారం ఇచ్చింది.
జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వినయ్ కుటుంబ సభ్యులు
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఎన్నో ఆశలతో ఉన్నత చదువు కోసం కజకిస్తాన్ వెళ్లిన వినయ్‌కుమార్ మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకొని విలపిస్తున్న తల్లిని నిలువరించడం బంధుమిత్రులకు సాధ్యం కావడంలేదు. కడసారి చూపుకోసం తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించాలని ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
విదేశాంగ శాఖతో మాట్లాడిన కలెక్టర్...
ఎంతో భవిష్యత్ ఉన్న పి.వినయ్‌కుమార్ కజకిస్తాన్ లో చనిపోవడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే అతడి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. విదేశాంగ శాఖ అధికారులు, ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కజకిస్తాన్‌లోని ఎంబసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. వినయ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment