పెళ్లా? తొందరేంటి! | Titan Raga urges women to get married for the right reason: 'when someone deserves your time' | Sakshi
Sakshi News home page

పెళ్లా? తొందరేంటి!

Published Wed, May 27 2015 11:35 PM | Last Updated on Mon, Jul 29 2019 7:32 PM

పెళ్లా? తొందరేంటి! - Sakshi

పెళ్లా? తొందరేంటి!

పదిహేనేళ్ల క్రితం అమెరికాలో ఈ ధోరణి మీద ఏకంగా సినిమాయే వచ్చింది, జూలియా రాబర్ట్స్ నటించిన రనవే బ్రైడ్. పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లిరోజు పారిపోతుంది. పెళ్లంటే అంత కన్ఫ్యూజన్ హీరోయిన్‌కి. ఇప్పుడు మనమ్మాయిలు కూడా, ‘పెళ్లిలో ఏముంది.. స్వేచ్ఛను పోగొట్టుకోవడమూ, టెన్షనూ తప్ప’ అని పెళ్లిని ఆమడదూరంలో ఉంచుతున్నారు. షి హాజ్ మూవ్డ్ ఫార్ అహెడ్. ఒకప్పుడు అమ్మాయి సెటిల్ అవడం అంటే ఒక అయ్య చేతిలో పడడం.

ఇవాళ అమ్మాయి సెటిల్ అవడం అంటే కెరీర్‌లో మగవాడికి దీటుగా లేదా బెటర్‌గా నిలవడం. అలాంటప్పుడు పెళ్లికి వాటిజ్ ద హర్రీ అనుకుంటున్న అమ్మాయిలకు ఇది క్లారిటీయా... కన్ఫ్యూజనా తెలుసుకుందామని...

 
‘వెన్ ఈజ్ ది రైట్ టైమ్ టు గెట్ మ్యారీడ్?’ అంటూ కొత్త ప్రశ్నను లేవదీసింది  ‘టైటాన్ రాగా’ వాచ్ యాడ్ !
 ‘ఫ్రెండ్స్‌కి పెళ్లి అయిపోయిందని, చుట్టపక్కాలు అడుగుతున్నారని,  వాలంటైన్స్‌డే రోజు ఒంటరిగా గడపాల్సి వస్తుందని, చెల్లెలు పెళ్లికి లైన్లో ఉందని, మాతృత్వపు ఘడియలు మించిపోతున్నాయని... పెళ్లి చేసుకోకు... యు ఫైండ్ ఎ  మ్యాన్ హూ డిజర్వ్స్ యువర్ టైమ్... అప్పుడే పెళ్లి చేసుకో’ అంటూ కత్రినాకైఫ్‌తో చెప్పించింది.
 
టైటాన్ లాంటి  కంపెనీ, కత్రినా కైఫ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకొని ఈ యాడ్‌ని తయారుచేసిందంటే అంత ఆషామాషీ వ్యవహారం అయ్యుండదు. ఎందుకంటే పెద్ద కంపెనీలు యాడ్ చేసేముందు మార్కెట్ రీసెర్చ్‌ను నిర్వహిస్తాయి. అంటే పెళ్లికి కరెక్ట్ టైమ్ ఏదీ అని చెప్పించే ముందు టైటాన్ కూడా అలాంటి రీసెర్చ్‌ను చేసే ఉంటుంది. అంటే టైటాన్ రాగా యాడ్‌లో కత్రినా చెప్పిన అభిప్రాయం టైటాన్ కంపెనీ చేసిన మార్కెట్ రీసెర్చ్‌కి అద్దం.

‘పెళ్లి బంధంలో ఉన్న అమ్మానాన్నలు హ్యాపీగా ఉన్నారా? తనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వాళ్లకున్నాయా? పెళ్లి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నప్పుడు మూడుముళ్ల కోసం తొందరపడ్డమెందుకు? మనసును అర్థం  చేసుకున్న వాడు దొరికే దాకా ఆగుదాం’.. అనుకుంటున్న అమ్మాయిల భావమే ఆ యాడ్ అయి ఉండొచ్చు! ఈ నేపథ్యంలో అమ్మాయి పెళ్లికి ఏది సరైన సమయం అంటూ సాక్షి ఫ్యామిలీ కొందరిని అడిగింది.. వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి...
- సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
తొందరపాటు తగదు

ఏ విషయంలో తొందరపడినా సరిదిద్దుకోవచ్చేమోగానీ పెళ్లి విషయంలో తొందరపడితే మాత్రం సరిదిద్దుకోలేం. భర్త చెడు అలవాట్లు ఉన్నవాడు కావొచ్చు. ‘గే’గా రుజువు కావొచ్చు. కట్నం కోసం వేధించేవాడు కావొచ్చు. కాబట్టి మనసుకు నచ్చగానే పెళ్లి చేసేసుకోకూడదు. ఆ వ్యక్తి తగినవాడేనా అని బాగా ఆలోచించాలి. ఆ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిన టైమే పెళ్లికి రైట్ టైమ్.
- జయసుధ, నటి
 
రూలేం లేదు
పెళ్లనేది వయసుతో కాదు మనసుతో ముడి పడినదని నా ఫీలింగ్. ఫలానా వయసులోనే పెళ్లాడాలని రూలేం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు తారసపడితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 18ఏళ్ల వయసులోనే మంచి జీవిత భాగస్వామి దొరికితే చేసుకోవచ్చు. 70 ఏళ్ల తర్వాత దొరికినా చేసుకోవచ్చు. నా మటుకు నాకు రైట్ పర్సన్ దొరికినప్పుడే పెళ్లికి రైట్ టైమ్.
- దీక్షా సేథ్, నటి
 
ఏళ్లు వచ్చాయని పెళ్లి చేసేసుకోవాలా?
పెళ్లనేది అంత సులభంగా తీసుకొనే నిర్ణయం కాదు. పదేళ్లుగా సినీ రంగంలో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ఇక్కడ నుంచి మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతా. ఈ పరిస్థితుల్లో ప్రేమ, పెళ్లి అంటూ ఇప్పటికిప్పుడు దీన్ని వదులుకోదల్చుకోలేదు.
- కంగనా రనౌత్, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘క్వీన్’ చిత్రాల హీరోయిన్
 
అప్పుడు పిల్లల్ని కనొద్దు
అబ్బాయి కన్నా అమ్మాయి త్వరగా పరిణతి చెందుతుంది. కాబట్టి  డిగ్రీ లేదా పీజీ అవగానే అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయ్యాలి. లేట్ అయితే అనారోగ్యంగా ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది.  ఒకవేళ ఉద్యోగం చేస్తూ  పదేళ్లు ఎంజాయ్ చేశాకే పెళ్లి అనుకుంటే మాత్రం  పిల్లల్ని కనకూడదు. సరికదా, అసలు పెళ్లి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
- స్వాతి సోమనాథ్, నృత్యకళాకారిణి
 
నిర్ణయించుకునే శక్తి ఉండాలి
తన జీవితానికి సంబంధించి తనే నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి అమ్మాయికి ఉన్నప్పుడే పెళ్లీడు వచ్చినట్టు. ఈ స్వయం నిర్ణయాధికారం ఎప్పుడు ఉంటుంది? ఆమె ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయినప్పుడే కదా!  
- సి. వనజ, సీనియర్ జర్నలిస్ట్
 
పద్దెనిమిదే కరెక్ట్
నాకు 32 ఏళ్లు.  వాళ్ల కన్నా నా శాలరీ తక్కువని, నేను పనిచేసే  కంపెనీ చిన్నదని.. ఇలాంటి సిల్లీ రీజన్స్‌తో అమ్మాయిలు  నన్ను రిజెక్ట్ చేశారు. ఈ ఎక్స్‌పీరియెన్స్ నాకో సత్యాన్ని తెలిపింది. అమ్మాయిలను ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివించకూడదు. ఇదివరకటిలాగే పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేయ్యాలి. ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ గర్ల్స్.
- ఎన్. అరవింద్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
 
మనసుకు నచ్చినప్పుడే...
పెళ్లికి ఫలానా ఏజ్ అనేది ప్రాతిపదిక కాదు. అలాగే తల్లి కావడానికి బయోలాజికల్ క్లాక్‌నూనేను విశ్వసించను. ఈ రెండిటి ప్రాతిపదికగా పెళ్లి చేసుకొని తర్వాత నేనెందుకు ఈ పనిచేశానని బాధపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు.  కాబట్టి  వ్యక్తిని కలిసినప్పుడు.. ఈ వ్యక్తితో జీవితం పంచుకుంటే బాగుండు అని అనిపించినప్పుడే పెళ్లి వయసు వచ్చినట్టు.
- ఉమా సుధీర్, ఎన్‌డీటీవీ కరెస్పాండెంట్
 
మెచ్యూరిటీ వచ్చాకే...
మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధమున్న అంశం కాదు.. రెండు కుటుంబాలతోనూ ముడిపడ్డ తంతు. కాబట్టి ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఆడపిల్లకి ఆ ఆడపిల్ల.. ఏ జంటకు ఆ జంట  యూనిక్. దీన్నర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్ అంటాన్నేను.
- మాధవీలత గంజి, ఫ్యామిలీ కౌన్సెలర్, సోషల్ యాక్టివిస్ట్.
 
 
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్
ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్.. ఈ రెండూ అమ్మాయికి తప్పనిసరి. వీటితో పాటు ఫిజికల్‌గా, మెంటల్‌గా మెచ్యురిటీ రావాలి. లైఫ్‌లో సెటిల్ అయ్యాను.. జీవితాన్ని పంచుకోవడానికి ఓ తోడు కావాలని అమ్మాయికి అనిపించినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్. ఆ తోడును సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా అమ్మాయికే ఉండాలి.   
- బిందు నాయుడు, టీవీ సీరియల్ రచయిత్రి
 
సపోర్ట్ చేస్తా...
నేనైతే టైటాన్ రాగా యాడ్‌లోని కత్రినా ఒపీనియన్‌ని సపోర్ట్ చేస్తా.   నేను రెండేళ్లుగా గూగుల్‌లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే తెలుస్తోంది. ఆస్వాదిస్తున్నాను. ఇంకో టూ ఇయర్స్ వరకు  పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నా. నా పెళ్లికి అదే రైట్ టైమ్. అయితే పెళ్లి కొడుకును వెదికే బాధ్యత పేరెంట్స్‌దే. వాళ్లు చూసిన సంబంధాల్లో నాకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటా!
- సుధా సురక్షిత రాణి, సాఫ్ట్‌వేర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement