యకీన్ కా ధోఖా... | Yakeen dhokha C ... | Sakshi
Sakshi News home page

యకీన్ కా ధోఖా...

Published Sun, Feb 15 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

యకీన్ కా ధోఖా...

యకీన్ కా ధోఖా...

ఇది కంచే చేను మేసే సామెతను తలపించే సంఘటన.. బాల్యం చేదు జ్ఞాపకంగా మిగిలినా ముందున్న జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటున్న బాలిక కథ! ఆమె పేరు రష్మీ (పేరు మార్చాం). వయసు పదమూడేళ్లు!
 ..:: సరస్వతి రమ
 
సబిత, మోహన్ (పేర్లు మార్చాం)లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. స్వస్థలం ఒడిశా. పెద్ద కూతురికి ఎనిమిదేళ్లకే పెళ్లి చేశారు. ఆ పిల్ల అత్తగారి కుటుంబంతో కలసి వలస కూలీగా దేశమంతా తిరుగుతోంది (ఇంతకుమించిన వివరాలేమీ చెప్పలేదు సబిత). రెండో సంతానం కొడుకు. చదువు కోసం ఆ పిల్లాడిని తన తల్లి దగ్గరుంచి ఇటుక బట్టీ కూలీగా ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ నిజామాబాద్ చేరాడు మోహన్ చిన్న బిడ్డ రష్మీని, సబితను వెంటబెట్టుకొని. ఇది ఆరేళ్ల నాటి సంగతి. అప్పుడు రష్మీకి ఏడేళ్లు. ఆ చిట్టిచేతులూ ఇటుకలు మోసి కాయలు కాశాయి. అక్కడ కొన్నాళ్లున్నాక హైదరాబాద్ బయలుదేరింది ఆ కుటుంబం.
 
ఇక్కడ..

తెలిసినవాళ్ల ద్వారా పాతబస్తీలో మకాం పెట్టారు. పక్కనే ఉన్న ముస్లిం పిల్లలతో పాటు రష్మీ గోట్లు (లక్కగాజులు) తయారుచేసే కార్ఖానాలో పనికి వెళ్లేది. ఆ బస్తీలోనే ఉన్న రెండు మార్వాడీ ఇళ్లల్లో పనిచేసి తనూ అదే కార్ఖానాలో పని చూసుకుంది సబిత. మొదట్లో ఏదో ఒక పని చేసే మోహన్ తర్వాతర్వాత తాగుడుకు బానిసయ్యాడు. కొన్నిరోజులకి నల్లమందూ అతని ఒంటికి పట్టింది. ఆ మత్తు విచక్షణను మింగేసింది. ఉదయం ఏడింటికి వెళ్లి మధ్యాహ్నం మూడింటికల్లా ఇంటికి వచ్చేది రష్మీ. సబితేమో ఆరుగంటలకల్లా వచ్చి మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పనికి వెళ్లేది. తల్లి ఇంటికొచ్చేదాకా నిద్రపోయేది ఆ పిల్ల.
 
ఒకరోజు..

కార్ఖానా నుంచి బాగా అలసిపోయి వచ్చిందో ఏమో ఆదమరిచి నిద్రపోయింది రష్మీ. మత్తు నెత్తికెక్కిన మోహన్‌కి రష్మీ కూతురులా కనిపించలేదు. గాఢనిద్రలో పీడకల వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచిన రష్మీ.. తండ్రి రూపం చూసి భయంతో కేకలేసింది. గింజుకుంది, పారిపోయే ప్రయత్నం చేసింది. శక్తి చాలలేదు.
 
రెండేళ్లు..

సబిత ఇంటికి వచ్చేటప్పటికి వాతావరణంలో తేడా కనిపించింది. బిడ్డ ఒంటిమీది బట్టలు చెదిరి సొమ్మసిల్లి పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసి నెత్తిపట్టుకొని ఏడ్చింది. బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తోడు కావాలని భర్తకోసం చూసింది. కనపడలేదు. పక్కింటి వాళ్ల సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లింది. స్పృహలోకొచ్చిన రష్మీ మగమనిషిని చూస్తేనే వణికిపోసాగింది. ఈ లోకంలోకి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పుడు చెప్పింది జరిగిన విషయం.. తల్లి గుండెలో తలపెట్టి ఆమె పైటచెంగును గట్టిగా పిడికిలిలో బిగిస్తూ! ఇంటికి తీసుకొచ్చాక ఆ ఇంట్లో క్షణం కూడా ఉండలేకపోయిందా పిల్ల. తల్లిని వదిలితే ఒట్టు. బిడ్డ పరిస్థితి చూసి పక్కనే ఉన్న బ్యాంక్‌కాలనీలోని సునీత అనే టీచర్ సబితకు నచ్చచెప్పి రష్మీని తనింటికి తీసుకెళ్లింది. రష్మీని మామూలు మనిషిని చేయడానికి సునీతకి రెండేళ్లు పట్టింది.
 
ఇప్పుడు..

రష్మీ 5వ తరగతి చదువుతోంది. సునీత దగ్గరే ఉంటోంది. ఓ ఏడాదిన్నర కిందట సబితకు మోహన్ జాడ తెలిసినా ఎవరకీ చెప్పలేదు.. అలాగని తనింటికి రానివ్వనూ లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డ క్షేమమే ముఖ్యం. ఆ బిడ్డకు చదువే లక్ష్యం. పాతగాయం.. అప్పుడప్పుడూ కలవరపెట్టినా భయపడట్లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. జిజియాబాయి, ఝాన్సీబాయిల కథలు ఇష్టంగా చదువుతుంది. ఎక్కువగా మాట్లాడదు.. పెదవులపై చిరునవ్వు చెరగనీయదు. ‘బాగా చదువుకోవాలి.. సావిత్రిబాయి పూలేలా మంచి టీచర్ కావాలి’ అంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement