అది జడ కాదు.. ఉరితాడు | Horror Story By Saraswathi Rama | Sakshi
Sakshi News home page

అది జడ కాదు.. ఉరితాడు

Published Sun, Aug 4 2019 10:35 AM | Last Updated on Sun, Aug 4 2019 10:35 AM

Horror Story By Saraswathi Rama - Sakshi

‘‘వావ్‌... వండర్‌ఫుల్‌.. వాట్‌ ఏ  ప్లేస్‌!’’  అన్నాడు ధర్మసాగర్‌.. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆహ్వానిస్తున్నట్టుగా రెండు చేతులూ గాల్లో చాపి.. గుండె నిండా గాలిపీల్చుకొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ .
 ఏటవాలు ప్రాంతం పక్కనే నది.. మూడు పాయలుగా చీలిపోతూ.. మళ్లీ కలుస్తూ జడలా! చుట్టు పక్కల పచ్చని చెట్లు.. కనుచూపు మేరలో ఉత్తర దిక్కున కొండలు.. అద్భుతం! ఆ చోటుకి ఆయన రావడం అయిదోసారి అతను ఇండియాకు వచ్చిన ఈ ముప్పై రోజుల్లో. 
‘‘ఇన్నాళ్లూ ఈ చోటు నా కంట పడకుండా ఎలా ఉంది  అవినాశ్‌?’’  ఆశ్చర్యపోతూ ధర్మసాగర్‌. 
‘‘కొండల్లో దాక్కొని సర్‌’’  వెటకారంగా అవినాశ్‌. 
ఆ వెటకారాన్ని గ్రహించే స్థితిలో లేడు ధర్మసాగర్‌. తన మనసులోని పథకం పేపర్‌ మీద బ్లూప్రింట్‌గా మారిన తీరును.... తెల్లవారి అదే ప్లేస్‌లో తన ఫ్యాక్టరీకి జరగబోయే శంకుస్థాపనను తలుచుకుంటున్నాడు. ఉప్పొంగుతోంది సంతోషం! 
అతని యాటిట్యూడ్‌ చిరాగ్గా ఉంది అవినాశ్‌కు. ఆ అబ్బాయి తండ్రి, తాతకు ధర్మసాగర్‌ వాళ్ల కుటుంబంతో అనుబంధం ఉంది. ధర్మసాగర్‌ వాళ్ల పొలాలను అవినాశ్‌ తాత, తండ్రే చూసేవారు. ఆ స్నేహంతోనే ఇప్పుడు తనతో ఈ అన్యాయాన్ని చేయిస్తున్నారనే కోపం, బా«ధను వెటకారంగా బయటపెడ్తున్నాడు అవినాశ్‌.

‘‘ఇంత వేగంగా.. ఇంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు తెల్సా?’’ ధర్మసాగర్‌ మాటతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు అవినాశ్‌. 
‘‘సర్‌... ’’ అన్నాడు రెండు దవడలూ నొక్కిపడుతూ.
‘‘ఇదే అమెరికాలో, యూరప్‌లో అయితే ఎన్వారాన్‌మెంట్‌కి హార్మ్, ఇన్‌హ్యూమన్‌థింగ్‌ అంటూ సవాలక్ష ఆంక్షలు.. వేలకోటి పర్మిషన్ల హార్డిల్స్‌తో మొండిచెయ్యి చూపించేశాళ్లు’’ ధర్మసాగర్‌. 
‘‘ఇక్కడైతే  డబ్బు పడేస్తే చాలు పర్మిషన్లు వచ్చిపడ్డాయ్‌ కదా సర్‌’’ వెటకారంగానే అవినాశ్‌. ఎప్పటిలాగే పట్టించుకోలేదు ధర్మాసాగర్‌. 
‘‘అవును.. నేనుకున్నదానికంటే కూడా తక్కువ ఖర్చులో నా ఫ్యాక్టరీకి పర్మిషన్‌ వచ్చింది’’ అని ముక్తాయింపు ఇచ్చి.. ‘‘అవినాశ్‌...’’పిలిచాడు. 
‘‘సర్‌.. ’’ అయిష్టం «ధ్వనించింది ఆ  స్వరంలో. అక్కడ ఏ కొత్త మనిషి ఉన్నా  దాన్ని పసిగట్టేవాడే. కాని ధర్మాసాగర్‌కే పట్టడంలేదు.

‘‘అదిగో.. అక్కడ.. జలవిహార్‌ లాంటిది ప్లాన్‌ చేస్తా భారీ ఎత్తున. ఇదిగో ఇటు వైపు రిసార్ట్స్‌.. ’’ అంటూ  నది మూడు పాయల తీరాలను చూపిస్తూ ధర్మాసాగర్‌ చెప్తూంటే  అతణ్ణే తీక్షణంగా చూడసాగాడు అవినాశ్‌. 
‘‘ఒరేయ్‌.. తెలియకుండానే మన కుటుంబానికి అంతోఇంతో సాయం చేశాడు ఆయన. నీ చదువుకీ కాస్తోకూస్తో ఆయన పరపతిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు నువ్వు మొండికేసినా... అతను ఆ ప్రాజెక్ట్‌ ఆపడు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్లయినా తెచ్చుకోగలడు. వాళ్లంతా  కూడితే అరాచకమేరా!  ఆ ఊరివాళ్లు మరింత ఇబ్బంది పడ్తారు. నేను చెప్పేది చెప్పా.. ఆనక నీ ఇష్టం’’ అంటూ పెద్ద బండను తన నెత్తిమీద పెట్టాడు తండ్రి. 
నిదానంగా విశ్లేషించుకున్న అవినాశ్‌కు తండ్రి చెప్పిందీ కరెక్టే అనిపించింది. తను కాదంటే ఇంకా పై స్థాయికి వెళ్లి మరింత నాశనం చేస్తాడు ఆ ఊరిని. తన పరిధిలోనే కానిస్తే పోతుంది అని వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ఆ ఫ్యాక్టరీ ప్లాన్‌ను తయారు చేయించాడు. అయినా జరగబోయేది మామూలు నాశనం కాదు.. గలగలపారే ఆ నది విషం అయిపోతుంది.  పండే పంటలు,  ఆ పరిసరాల్లోని గాలి, చెట్టు, చేమ.. గొడ్డు, గోద.. మనుషులు అన్నీ.. అంతా.. అందరూ విషమే! 
అవినాశ్‌ కళ్లల్లో నీళ్లు.. అటు తిరిగి తన రెండు చేతులను చూసుకున్నాడు. ‘‘ఛీ.. ఈ చేతులతోనా ఈ పని చేస్తోంది’’ అనుకుంటూ తలకొట్టుకోబోతుంటే.. ఓ మెరుపు... ఎదురుగా.. నదిలో!
భ్రాంతా? నిజమా? అనుకుంటూ కళ్లు నులుముకొని మళ్లీ చూశాడు.

నిజమే. నదిలో అమ్మాయి..  కాదు.. నదే.. కాదు అమ్మాయి..  అవును.. కాదు.. అవును .. కాదు.. అయోమయం.. విస్మయం అవినాశ్‌లో! అర్థంకాక మళ్లీ పరీక్షగా చూశాడు. ఏమీలేదు అక్కడ. అంతా మామూలుగానే ఉంది. 
పాపం.. వెర్రితల్లికి  జరగబోయే విపత్తేం తెలుసు?  అమాయకంగా.. ప్రశాంతంగా ఎలా ప్రవహిస్తుందో?’’ బాధగా మూలిగింది అవినాశ్‌ మనసు! మళ్లీ ఇటు వైపు తిరిగి ధర్మసాగర్‌ను చూశాడు. అతని లోకంలో అతను ఉన్నాడు. 
సూర్యాస్తమయం అయింది. పక్షులన్నీ గోల చేస్తూ  గూళ్లకు చేరుతున్నాయి. 
పడమటి ఎర్రటి కాంతి నీళ్లల్లో ప్రతిబింబిస్తోంది. అదోరకంగా మారిపోయింది వాతావరణం. 
అక్కడ ఉండాలనిపించలేదు అవినాశ్‌కు. 
‘‘పొద్దు పోయింది.. వెళదాం సర్‌.. చిట్టడవే అయినా.. చీకటి పడితే  ప్రమాదమే’’ అంటూ జీప్‌ వైపు నడిచాడు అవినాశ్‌. 
కదల్లేక కదల్లేక కదులుతూ అవినాశ్‌ను అనుసరించాడు ధర్మసాగర్‌.
చిట్టడవి దాటగానే.. ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ధర్మసాగర్‌ బస. తన రూమ్‌ కిటికీలోంచి చూస్తే.. నది కనిపిస్తుంది. వెన్నెల్లో మెరిసే దాని సోయగాన్ని కళ్లల్లో నింపుకోవచ్చు. ధర్మసాగర్‌ను ఆ గెస్ట్‌హౌస్‌లో దింపేసి ఊళ్లోకి వెళ్లిపోయాడు అవినాశ్‌. 
రాత్రి..
భోజనాలయ్యాక.. కిటికీ దగ్గరున్న స్టడీ టేబుల్‌ ముందు కుర్చీ లాక్కొని  కూర్చున్నాడు. తన బ్లూ ప్రింట్‌ను టేబుల్‌ మీద పరిచి అంగుళం అంగుళం తడిమిచూసుకున్నాడు. కళ్లద్దాలు ముక్కు మీదకు జారుతోంటే పైకి తోసుకుంటూ ప్రతి చిన్న డీటైల్‌నూ మళ్లీ మళ్లీ సమీక్షించుకున్నాడు.  ‘‘పర్‌ఫెక్ట్‌’’ అనుకుంటూ  నిద్రకుపక్రమించాడు.

హోరు.. గర్జించట్లేదు.. రొద పెడ్తోంది. మెదడును డిస్టర్బ్‌చేసే రొద! 
చలి.. శరీరాన్ని గడ్డకట్టించే చలి!  అంతకంతకూ ఎక్కువై.. ధర్మసాగర్‌ను నిద్రలేపింది. 
కళ్లు తెరిచి చూశాడు.. ఏమీ అర్థం కాలేదు. లేచినిలబడ్డాడు. ఎక్కడో ఆరుబయట ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.. వెన్నెల వెలుతురును బట్టి. చుట్టూ పరికించాడు. 
‘‘అర్రే.. తను ఫ్యాక్టరీ కట్టే స్థలం..!’’ అనుకుంటూ  ఎదురుగా చూశాడు. నది లేదు. కళ్లు చిట్లించి మరీ  చూశాడు. ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడే లేదు. చుట్టురా తిరిగాడు. చెట్టు, చేమ, కొండలు, గుట్టలు.. అన్నీ అలాగే ఉన్నాయ్‌. నది.. దాని మూడు పాయలు తప్ప!
 ఎవరో తోసేసినట్టు దబ్బున కిందపడ్డాడు ‘‘అబ్బా.. అని నడుం పట్టుకుంటూ తలెత్తాడు.. షాక్‌!
అంటే.. అంటే.. తను ఇప్పటిదాకా.. నోరు తెరిచాడు.. మాట పడిపోయింది. 
తెల్లని చీరలో ప్రశాంత వదనంతో ఓ స్త్రీ మూర్తి... నదిని మూడు పాయలుగా చేసి అల్లిన జడతో!

ధర్మాసాగర్‌ కిందపడేదాకా ఆ జడలోనే ఉన్నాడు. ఇక్కడికి అతణ్ణి తీసుకొచ్చిందీ ఆ జడే! 
ఆ స్త్రీ.. ఒక్కసారిగా వెనకనున్న జడను ముందుకు వేసింది తలను కాస్త కదిపి.. 
అంతే ఆ ఇసుకతెన్నెలను మీంచి పరవళ్లు తొక్కుతూ  ఆ చెట్టూచేమా పాదాలను తాకుతూ..  ఉప్పెనై  ముందుకొచ్చింది.. చెవులు చిల్లులు పడే ఘోషతో !
ధర్మసాగర్‌... వణికిపోతున్నాడు. 
ఆమె మొహంలో చిరునవ్వు చెదరలేదు. నవ్వుతూనే ఆ ఏటవాలు ప్రాంతాన్ని.. దాని మీదున్న ఫ్యాక్టరీ కట్టే స్థలాన్నీ.. అక్కడ నిలబడి ఉన్న ధర్మసాగర్‌నూ ఆ జడలో చుట్టేసింది. ఊపిరి ఆడలేదు ధర్మసారగ్‌కు. 
వెళ్లి.. తనెప్పుడూ పరుగులుపెట్టే చోట ఆ జడను విప్పేసింది ఆ స్త్రీ మూర్తి. 
తెల్లవారింది.. ఎప్పటిలా మూడు పాయలుగా ప్రశాంతంగా సాగిపోతోంది ఆ నది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement