బీ47 గదిలో ఏముంది? | Telugu Horror Story On Funday 28th July 2019 | Sakshi
Sakshi News home page

బీ47 గదిలో ఏముంది?

Published Sun, Jul 28 2019 8:28 AM | Last Updated on Sun, Jul 28 2019 8:28 AM

Telugu Horror Story On Funday 28th July 2019 - Sakshi

‘‘హాయ్‌...’’ అంటూ పక్కకు జరుగుతూ క్లాస్‌ రూమ్‌ బెంచి మీద చోటిచ్చాడు శ్రవణ్‌. 
‘‘హలో’’ అని బదులిచ్చాడు కాని ఆ అబ్బాయి పక్కన కూర్చోవడానికి సంశయపడ్డాడు చందు. వెళ్లి వెనక బెంచీలో కూర్చున్నాడు. తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు వచ్చారు.. వాళ్లెవరూ కూడా శ్రవణ్‌ కూర్చున్న బెంచీ మీద కూర్చోలేదు. చోటు లేకపోయినా మిగిలిన బెంచీల మీదే సర్దుకున్నారు. శ్రవణ్‌ తప్ప ఈ బెంచీ మీద ఎవరూ లేరు. ఎందుకో అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా? నోట్లో దుర్వాసనేమైనా వస్తోందా? అని క్లాసెస్‌ అయిపోయాక బాత్రూమ్‌లోకి వెళ్లి చూసుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే మురికిగా ఏమీ కనిపించలేదు. కొత్త బట్టలు కావు కాని.. ఇస్త్రీ బట్టలే వేసుకున్నాడు. నీట్‌గానే ఉన్నాడు. కుడి అరచేయి నోటికి అడ్డం పెట్టుకొని తన శ్వాసను చెక్‌ చేసుకున్నాడు. చక్కగా ఉంది. మరెందుకు? అని ఆలోచించుకుంటూ క్యాంటీన్‌ దగ్గరకు వెళ్లాడు.

క్లాస్‌మేట్స్‌ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్‌ను చూసి కరచాలనం చేస్తూ అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమంటూ చోటు చూపించారు. 
క్లాస్‌రూమ్‌లో వాళ్ల ప్రవర్తనకు, క్యాంటీన్‌లో వాళ్ల తీరుకు పొంతన లేదు. 
తెల్లవారి కూడా అదే పరిస్థితి. శ్రవణ్‌ పక్కన .. ఆ బెంచీమీద  ఎవరూ కూర్చోలేదు. విరామ సమయంలో క్యాంటీన్‌ దగ్గర మాత్రం ఎలాంటి అరమరికల్లేకుండా.. ఆప్యాయంగా ఉన్నారు. 
ఎంత ఆలోచించినా ఆ తేడా ఎందుకో అర్థంకాలేదు శ్రవణ్‌కు. 
ఆ రాత్రి.. హాస్టల్లో .. భోజనాల దగ్గర..
రెండు రోజుల విచిత్రమైన ఎక్స్‌పీరియెన్స్‌ నుంచి తేరుకోని శ్రవణ్‌ బెరుకు బెరుకుగానే ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్‌ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.

కెలుకుతున్నాడు కాని ముద్ద దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే ఉన్నాయి. పేద కుటుంబం. రెండు ఎకరాల పొలం, రెండు గదుల పెంకుటిల్లు తప్ప అరగజం జాగా లేదు ఇంకెక్కడా. ఆ వ్యవసాయం కూడా.. వానల్లేక కుంటు పడింది. చాలామంది లాగే అప్పుల బాధ భరించలేని తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి  కూలీగా మారింది. శ్రవణ్‌కు ఒక చెల్లి.. టీటీసీ ట్రైనింగ్‌లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్‌ హాస్టల్లో.. తను యూనివర్శిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర్నుంచి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రెన్స్‌ రాశాడు. సీట్‌ వచ్చింది. ఒక లక్ష్యంతో యూనివర్శిటీలోకి అడుగుపెట్టాడు. పూటకో అనుభవం ఎదురవుతోంది. క్లాస్‌మేట్స్‌ మంచోళ్లా? తను చెడ్డవాడా? గతం గుర్తొచ్చో.. నిస్సహాయత వల్లో తెలీదు కాని కళ్లల్లో నీళ్లు తిరిగాయి శ్రవణ్‌కి.

అటూ ఇటూ చూసి.. గబగబా కళ్లు తుడుచుకుని తినడం మొదలుపెట్టాడు. 
‘‘ఎందుకేడుస్తున్నావ్‌?’’ 
ఆ ప్రశ్న వినిపించేసరికి ఉలిక్కిపడి  పక్కకు చూశాడు శ్రవణ్‌.
ఒక అబ్బాయి... క్లాస్‌మేట్‌ అయితే కాదు. క్లాస్‌లో చూడలేదు. బహుశా.. సీనియరో.. జూనియరో..!
‘‘నేనేం ఏడ్వట్లేదు’’అన్నాడు నీళ్లు తాగుతూ శ్రవణ్‌.
‘‘క్లాస్‌రూమ్‌లో జరుగుతున్నదానికి హర్ట్‌ అయ్యావా?’’నింపాదిగా ఆ అబ్బాయి. 
‘‘నీకెందుకు?’’ అన్నట్టు అతణ్ణి చూసి అక్కడి నుంచి విసావిసా వెళ్లిపోయాడు శ్రవణ్‌. 
రాత్రి...పదకొండు..
బెడ్‌ మీద దిండుకి చేరగిల పడి పుస్తకం చదువుకుంటున్నాడు శ్రవణ్‌. ఇంతలోకే ఫోన్‌ మోగింది. ‘‘చెల్లే అయ్యుంటుంది’’ అనుకుంటూ ఫోన్‌ చూశాడు. చెల్లెలే. లిఫ్ట్‌ చేసి.. క్షేమసమాచారాలు, ఆరోజు జరిగిన విషయాలూ మాట్లాడుకొని ఫోన్‌ పెట్టేశాడు. 
ఆవులిస్తూ పుస్తకం మూసేశాడు. బెడ్‌ ల్యాంప్‌ ఆర్పేస్తూ దుప్పటి కప్పుకున్నాడు.

కాసేపటికి పక్కనుంచి గురక మొదలైంది. 
మంచి నిద్రలో ఉన్న శ్రవణ్‌కు కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించింది. అటు తిరిగి పడుకున్నాడు. 
ఈసారి ఇంకాస్త ఎక్కువైంది గురక శబ్దం. తల కిందున్న దిండును చెవులకు అడ్డంగా పెట్టుకున్నాడు. 
‘‘భయపడకు.. భయపడితే ఓడిపోతావ్‌! సాధించాలి’’అన్న మాటలు వినిపించాయి. 
దిగ్గున లేచి కూర్చున్నాడు. 
పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను ఈదురు గాలుల చలిలోనూ శ్రవణ్‌కు ముచ్చెమటలు పట్టాయి. భయపడ్తూనే బెడ్‌ల్యాంప్‌ స్విచ్‌ ఆన్‌ చేశాడు. వెలగలేదు. వణుకుతున్న కాళ్లతోనే బెడ్‌ దిగి మూలనున్న ఆ గది లైట్‌ బటన్‌ నొక్కాడు. ఒక్క వెలుగు వెలిగి ఫట్‌మని  శబ్దం చేస్తూ ఆరిపోయింది లైట్‌.
ఆ లిప్తకాలంలోనే బెడ్‌ మీద ఉన్న ఆకారం కనిపించింది. ఆ రాత్రి డైనింగ్‌ టేబుల్‌ మీద తన పక్కన కూర్చున్న అబ్బాయే. 
ఇక్కెడికెలా వచ్చాడు? 
మిగిలినవన్నీ ఫిలప్‌ అయ్యి.. ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకు ఇచ్చారు. క్లాస్‌రూమ్‌ బెంచీ లాగే ఈ గదినీ తనతో షేర్‌ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్లోని అన్ని గదులూ ఒక వరుసలో ఉంటే ఈ బీ 47 ఒక్కటే.. వాటికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. చదువుకోవడానికి ప్రైవసీ దొరుకుతుందని.. సంతోషడ్డాడు తను. ఈ గోలేంటి? భయంతో పాటు ఆలోచనలూ తీవ్రమయ్యాయి.

‘‘నేనున్న గదిలోకి వీడెక్కడి నుంచి వచ్చాడని ఆశ్చర్యపోతున్నావ్‌ కదూ? ఇది నా గదే.. నీ కన్నా ముందు!’’ అంటూ ఆ  ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్‌ ముందున్న స్టడీ టేబుల్‌ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. 
‘‘భయపడకు. నిన్నేమనను. నీకు తోడుగా ఉండడానికే వచ్చా!’’  అంది ఆ ఆకారం. 
‘‘అసలు నువ్‌వ్‌వ్‌..వ్వెవరూ...’’ భయంతో శ్రవణ్‌ మాటలు తడబడ్డాయి. 
‘‘నా పేరు అంగద్‌. ఇక్కడే ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. యూనివర్శిటీ ఫస్ట్‌ కూడా. రేపు నీ సీనియర్స్‌ను అడుగు నా గురించి. పీహెచ్‌డీకి ప్రిపేర్‌ అవుతున్నప్పుడు హాస్టల్లో గొడవలు జరిగాయి. మా క్లాస్‌మేట్స్‌ కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాతో చనువుగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకొని నా క్లాస్‌మేట్స్‌ ఆమె ఆత్మహత్యకు నేనే కారణమన్నట్టుగా ఓ సూసైడ్‌ నోట్‌ రాసి ఆమె చేతిలో పెట్టారు. అంతా నా మీదకు వచ్చింది. హెడ్స్‌ అందరికీ  నిజం తెలిసినా.. నోరు విప్పలేదు. ఈ విషయం ఊళ్లో ఉన్న మా పేరెంట్స్‌కి చేరింది.. పరువు తీశాననే బాధతో సూసైడ్‌ చేసుకున్నారు. నా మీద నిందకన్నా.. మా పేరెంట్స్‌ నన్ను నమ్మలేదనే నిజంతో చాలా హర్ట్‌ అయ్యా.. ’

‘ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేనూ ఆత్మహత్య చేసుకున్నా. ప్రాణం పోయింది కాని చదువుమీదున్న పాశం పోలేదు. అందుకే ఇక్కడే తచ్చాడుతున్నా. నువ్వు కూర్చుంటున్న బెంచి మీదే కూర్చునే వాడిని. అలవాటుగా.. ఆ బెంచి మీద కూర్చున్న వాళ్లతో స్నేహం చేద్దామని.. ఈ గదిలో ఉంటున్నా వాళ్లకు తోడుగా ఉందామని.. మాట్లాడ్డం మొదలుపెడితే... దయ్యమంటూ వెలివేశారు. ఎవరినీ నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వు ఒక్కడివే.. ధైర్యంగా ఈ గదిలోకి అడుగుపెట్టావ్‌. ఆ బెంచి మీద కూర్చుంటున్నావ్‌. భయపడకు నిన్నేం చేయను. సబ్జెక్ట్స్‌లో డౌట్స్‌ ఉంటే అడుగు.. చెప్తా.. టీచర్‌లాగా. తోడుంటా.. అన్నలాగా!’’ చెప్తోంది ఆ ఆకారం. 
క్లాస్‌మేట్స్‌ ప్రవర్తన వెనక రహస్యం తెలిసింది. బిగుసుకుపోయాడు శ్రవణ్‌.
- సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement