రావిచెట్టుకు రక్తం కారుతోంది..! | Horror Story On Funday 14th July 2019 | Sakshi
Sakshi News home page

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

Published Sun, Jul 14 2019 8:41 AM | Last Updated on Sun, Jul 14 2019 8:41 AM

Horror Story On Funday 14th July 2019 - Sakshi

‘‘శాంతమ్మా.... శాంతమ్మా....’’  పిలుస్తూ గేట్‌ తోసుకుని లోపలికి వచ్చేశాడు లింబాద్రి వగరుస్తూ!
ఆ గాబరా.. తొందర చూసి.. ‘‘ఏమైందీ’’ అంటూ వసారాలోకి వచ్చింది శాంతమ్మ. 
‘‘బయట ఉన్న రావి చెట్టును కొట్టేస్తారట’’చెప్పాడు అదే గాబరాతో. 
‘‘ఎవరూ’’ అంతే నింపాదిగా ఆమె. 
‘‘రోడ్డేదో పెద్దగ చేస్తారట.. ఆ ఆఫీసర్లు కొలతలు తీసుకుంటూ మాట్లాడుకుంటూంటే విన్నా అమ్మా.. ’’ ఇంకా గాబరాపాటు పోలేదు అతని గొంతులో. 
ఆమె గుండెలో రాయిపడ్డట్టయింది. మెడ కాస్త పైకెత్తి వీధిలోకి చూసింది. లింబాద్రి చెప్పినట్టుగానే బయటేదో హడావిడిగా ఉంది.

నిజానికి ఓ నెల కిందటి నుంచి అంటున్నారు వీధిలో వాళ్లు... ఆ రోడ్డును వెడల్పు చేస్తారట అని. కాని ఆ చెట్టు మీదకు ఎవరి దృష్టీ పోలేదు. కాళ్లూచేతులూ ఆడ్డం లేదు శాంతమ్మకు. తన మామగారు నాటిన మొక్క. ఇప్పుడు వృక్షమైంది. తను పెళ్లిచేసుకొని వచ్చిన కొత్తలో ఆ పరిసరాలు ఇప్పటిలా లేవు. చాలా నిర్మానుష్యంగా ఉండేవి. అసలది అప్పుడు ఓ కాలనీయే కాదు. అక్కడో ఇల్లు.. ఇక్కడో ఇల్లు విసిరేసినట్టుగా ఉండేవి. తనే ఆ ఇంటి ఆఖరి కోడలు. తన  తర్వాతే తన ఆడపడచు పెళ్లి అయింది. ఇంట్లో పనంతా చేసుకొని సాయంకాలం పూట ఆ చెట్టు కిందే కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్లు తోడికోడళ్లు.. ఆడపడచు. తెల్లవారికి కూరలు తరుక్కోవడమూ అక్కడే. ఆ ఇంట్లోని పిల్లల హోంవర్క్, చదువు, ఆటలు, పాటలు అన్నీ ఆ చెట్టు నీడలోనే. ఆ చెట్టుతో తన అనుబంధం మరింత ప్రత్యేకమైనది.

శాంతమ్మ భర్త సంజీవ్‌ దుబాయ్‌లో పనిచేసేవాడు. ఎప్పుడో యేడాదికి ఒక్కసారి వచ్చి పదిహేను రోజులుండిపోయేవాడు. అతను దుబాయ్‌లో ఉన్నప్పుడు పంపిన ఉత్తరాలను ఆ చెట్టుకిందే ఏకాంతంగా కూర్చొని చదువుకునేది. తిరిగి జాబు అక్కడే రాసేది. పిల్లాడు పుట్టాక.. ఆ చెట్టు కిందే ఆడిస్తూ అన్నం తినిపించేది. పాటలు, పద్యాలు.. అన్నీ ఆ చెట్టు సాక్షిగానే సాగాయి. ఇంట్లో అత్త, మామలతో మాట పట్టింపు వచ్చినా.. ఆ చెట్టుతోనే చెప్పుకొని ఏడ్చేది. పుట్టింట్లో అన్నా, వదిన మర్యాద తక్కువైనా చెప్పుకోవడానికి ఆ చెట్టే దిక్కు. అన్నదమ్ములంతా ఆస్తిని పంచుకోవాలనుకున్నప్పుడు .. కేవలం ఆ చెట్టు కోసమే మిగిలిన వాటా డబ్బులు చెల్లించి ఆ ఇంటిని తీసుకొమ్మని భర్తను పోరింది శాంతమ్మ. ‘‘ఈ పాతిల్లు ఎందుకు? వేరే చోట చక్కగా కట్టుకుందామని భర్త చెప్పినా వినకుండా. శాంతమ్మ కొడుక్కి అప్పటికి పందొమ్మిదేళ్లు.. వాడూ ఆ ఇల్లే కావాలని పట్టుపట్టాడు. దాంతో సంజీవ్‌ కాదనలేక పోయాడు.

గతంలోంచి బయటకు వచ్చి వడివడిగా.. వీధిలోకి వెళ్లింది శాంతమ్మ. తలుపులు గడియ వేసి ఆమె వెనకే వెళ్లాడు లింబాద్రి. అతను శాంతమ్మకు తోబుట్టువు కంటే ఎక్కువ.
‘‘ఏంటండీ.. రావి చెట్టును కొట్టేస్తున్నారా?’’ అడిగింది అక్కడున్న ఆర్‌ అండ్‌ బీ వర్కర్స్‌ను. 
‘‘అవును మేడం.. వైడెనింగ్‌లో తప్పేట్టు లేదు’’ చెప్పాడు సూపర్‌వైజర్‌. 
‘‘ఇది ఏళ్ల నాటి చెట్టండి.. అలా ఎలా కొట్టేస్తారు?’’ వాదనకు దిగింది శాంతమ్మ. 
‘‘తప్పదు.. ’’ అంటూ రోడ్డు మీద పెట్టిన కెమెరా ట్రైపాడ్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను. మిగిలిన వాళ్లూ ఎవరిపనుల్లో వాళ్లు పడ్డారు. 
శాంతమ్మ ఏదో చెప్తున్నా వినిపించుకోలేదు వాళ్లు. దిగులుగా ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్లింది. ఒక్కసారిగా చెట్టు తలూపినట్టు కొమ్మలన్నీ కదిలాయి సన్నగా సవ్వడి చేస్తూ! అక్కడున్న అందరి అటెన్షనూ చెదిరింది వర్కర్స్‌ సహా. చెట్టు వైపు చూశారు. 
అది తన కొమ్మలన్నిటినీ వంచి శాంతమ్మతో ఏదో చెప్పుకుంటున్నట్టు అనిపించింది వాళ్లకు. 
శాంతమ్మా.. ఆ చెట్టుతో మాట్లాడుతోంది... ‘‘నీకేం కాదు.. నేనున్నాగా! కాపాడుకుంటా’’  అంటూ. 
విస్తుపోయారంతా.  
ఆ చెట్టు కాండాన్ని కాసేపు నిమిరి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ వెనకే లింబాద్రి వెళ్లబోతుంటే... అక్కడున్న వాళ్లంతా  ఆపారు.
‘‘ఏంది సామీ.. ఆయమ్మ.. ఆ చెట్టుతో ఏందో మాట్లాడుతాంది?’’ అని. 
వాళ్లందరినీ గంభీరంగా ఓ చూపు చూసి.. ఏమీ జవాబు చెప్పకుండా  మౌనంగా శాంతమ్మ వాళ్లింట్లోకి వెళ్లిపోయాడు.

రాత్రి.. 
శాంతమ్మను ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. అలాగే పడుకుండిపోయింది. బాధతో లింబాద్రీ ఏమీ తినలేదు. వాకిట్లోకి వచ్చాడు.
వీధిలైట్‌ వెలుగులో.. ఎదురుగా రావి చెట్టు.. దీనంగా.. కనపడింది లింబాద్రికి. గేట్‌ మీద రెండు చేతులు పెట్టి ఆ చేతులకు తన చుబుకం ఆనించి రావిచెట్టునే చూడసాగాడు. 
ఆ రోజు బాగా గుర్తు... 
ప్రత్యూష్‌  పందొమ్మిదో పుట్టనరోజు..  సంజీవ్‌ సర్‌  బండీ కొనిపెట్టాడు. ఆ సంతోషం ఆ పిల్లాడి కళ్లల్లో మెరుస్తూ ఉంది. ఫ్రెండ్స్‌కి చూపిస్తానని వెళ్లాడు. జీవంతో రాలేదు. యాక్సిడెంట్‌లో పోయాడు. తీసుకొచ్చి ఈ చెట్టుకిందే పడుకోబెట్టారు. చిత్రంగా ఆ రోజు నుంచి ఆ చెట్టు తీరు మారిపోయింది. ఓ మనిషి పూనినట్టు.. ఇంకా చెప్పాలంటే అచ్చంగా ప్రత్యూష్‌లా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాన్ని ముందు కనిపెట్టింది తనే! పిల్లాడి శవం ఇంకా తీయకముందే శోకదేవతలా ఉన్న శాంతమ్మ చెవిలో చెప్పాడు చిన్నగా. శాంతమ్మ కొడుకును చూడ్డం మానేసి చెట్టును చూడ్డం స్టార్ట్‌ చేసింది. నిజంగా తన కొడుకులాగే అనిపించింది ఆ రావి చెట్టు. పిల్లాడి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే.. ఏడుస్తూ వెంట పరిగెత్తబోయిన శాంతమ్మను ఈ చెట్టు కొమ్మలు వెనక్కి లాగినట్టు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌లో ఉందేమోనని అనుకున్నారు. 
ఆ రోజు ఆ చెట్టు చెప్పింది ఆమెతో.. ‘‘అమ్మా.. నేనక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నా.. నీతోనే ఉంటా.. నేనే ప్రత్యూష్‌ని’’ అని.  ఆ మాటలు లింబాద్రికీ వినపడ్డాయి. 
మూడో రోజు ప్రత్యూష్‌కి ఇష్టమైన వంటకాలను చేసి చెట్టు మొదట్లో పెట్టింది. మరుక్షణమే ఆ విస్తరి ఖాళీ అయింది. అప్పుడు..  ఆ చెట్టు మీద ప్రత్యూష్‌ ఉన్నాడని శాంతమ్మ రూఢి చేసుకుంది. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా.. దాన్ని కన్న బిడ్డకంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. చెట్టంత కొడుకు పోయాడన్న దిగులుతో మంచం పట్టిన శాంతమ్మ భర్త యేడాదికే తుది శ్వాస విడిచాడు. అయినా అంతగా బాధపడలేదు ఆమె. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్థం చేసుకోగలిగిన వాళ్లు కొడుకు పోయిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని సమాధానపడ్డారు. 
‘‘మామా...’’పిలిచినట్టయింది. గేట్‌ తీసుకొని చెట్టు దగ్గరకు వెళ్లాడు లింబాద్రి. 
‘‘చెప్పు బాబూ..’’ లింబాద్రి. 
‘‘అమ్మ భోంచేయలేదు కదూ..’’ 
‘‘ఉహూ.. నీ మీదే దిగులుతో ఉంది’’ చెప్పాడు లింబాద్రి. 
‘‘నా గురించి చింత వద్దు.. అమ్మను జాగ్రత్తగా చూసుకో’’
వెళ్లి చెట్టును హత్తుకున్నాడు లింబాద్రి. అతని కళ్లల్లో నీళ్లు.

‘‘సార్‌.. అది చెట్టు కాదు సార్‌.. దయ్యం’’ భయంతో పారిపోతూ చెప్పారు చెట్టును నరికేయడానికి వచ్చిన కూలీలు. 
‘‘ఏమైంది.. ఆ చెమటలేంటి? ఆ కంగారేంటీ?’’ సూపర్‌వైజర్‌  అయోమయంగా. 
‘‘గొడ్డలితో వేటు వేసిన చోటల్లా రక్తం వస్తోంది సార్‌.. పొయ్యి చూడండి.. వరద కట్టింది రక్తం. మావల్ల కాదు.. మేం పోతున్నాం.. ’’ అంటూ పరిగెత్తారు ఆ కూలీలు. 
ఏమీ అర్థంకాని సూపర్‌వైజర్‌.. చెట్టు దగ్గరకు వెళ్లి చూశాడు. నిజంగానే రక్తం.. కాలువై పారుతుంది. అక్కడున్న జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. 
నిశ్చేష్టుడైపోయాడు సూపర్‌వైజర్‌.

- సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement