రాత్రి తొమ్మిది గంటలు...
ఓ పదిపదిహేను మంది కల్లు ముంతలు ముందు పెట్టుకొని కూర్చుని ఉన్నారు. సాయంకాలం ఆరు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆ ఊళ్లో కాని.. ఆ ఊరికి ఉన్న నాలుగు పొలిమేరల్లో కాని ఎక్కడా ఒక్క తాటి చెట్టూ లేదు.. ఈత చెట్టూ లేదు. అయినా కుండల కొద్ది కల్లును తీసుకొచ్చి అమ్ముతున్నారు.. వీళ్లు తాగుతున్నారు.
‘‘అరేయ్.. య్యీ క్షొత్త క్షళ్లు దుక్కాణం భల్లే ఉంద్షిరా... ’’ అన్నాడు ఒకడు మాటా.. శరీరమూ తూలుతూ.
‘‘అవ్వన్రర్రేయ్‌య్‌య్... ర్రెండ్రోజ్జుల్లే అయ్యింది ఈ క్షొట్టు ప్పెట్టి.. య్యెంత్ష గ్గిర్రాక్కో షూడూ.. ’’ అన్నాడు ఇంకొకడు.. చుట్టూ ఉన్న అందరినీ చూపించడానికి గాల్లోకి ఎత్తిన చేయి.. సత్తువ లేక జారిపోతుండగా!
ఇంతలోకే అక్కడున్న ఇంకో నలుగురు ఏదో మాటా మాటా పెరిగి.. తాగిన మైకంలో కొట్టుకునే దాకా వెళ్లారు.
అలా ఓ అరగంట గడిచింది.
ఆ కల్లు రుచికి ఆ కంపౌండ్‌లోంచి కదల్లేకపోతున్నారంతా! తెచ్చిన పైకం అయిపోయింది. అప్పటిదాకా తియ్యగా మాట్లాడుతూ కల్లుతోపాటు మంచింగ్‌కి చేపల ఫ్రై, మిరపకాయ బజ్జీలూ వేడివేడిగా వడ్డించిన వాళ్లు కసురుకోసాగారు.
‘‘మ్మాద్ది.. ఇద్దే ఊ.......ర్రు కదా స్సామ్మీ... న్నమ్మండీ... ఈ అప్.. అప్.. య్యేందదీ... ఆ.. య్యీ అప్‌ప్‌పూపూ... ర్రేప్పట్టిద్ది క్షల్పి ర్రేప్పు క్కల్లు మ్ముంతలో పెట్షి త్తెస్‌స్..స్సా’’ అన్నాడు ఓ నలభై ఏళ్ల వ్యక్తి.
‘‘ ఇవ్వాళ మత్తు పీల్చుకో.. రేపు కల్లు పోస్తా.. అంటే కుదర్దు కదా సారూ. డబ్బిస్తేనే కల్లు’’ షరతు పెట్టింది కల్లుకొట్టు యజమానురాలు తన భర్తేదో మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా.
‘‘నేను మట్లాడబోతుంటే నువ్వెందుకు మధ్యలో వచ్చావ్?’’ భార్యను విసుక్కున్నాడు ఆ భర్త.
‘‘చూశాలే.. కిందటూళ్లలో ఏం మాట్లాడావో! ఇదిగో.. ఈ మాయదారిగాళ్ల మత్తు మాటలకు లొంగిపోయావో.. పాక పీకేసుకొని పోవాల్సిందే గానీ.. నువ్వు బో.. నేను మాట్లాడ్తా’’ అంటూ భర్తను అక్కడి నుంచి పంపించేసింది ఆమె.
విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు భర్త.
‘‘ఏమయ్యోయ్.. కొట్టు కట్టేస్తున్నాం గానీ యిక లేవండీ...’’ అంటూ అందరినీ అదిలించడం మొదలుపెట్టింది.
రేపు డబ్బులిస్తాం.. ఈ పూటకు ఇంకాస్త కల్లు పొయ్యండని బతిమాలుకున్నారంతా. ‘‘కుదర్దు అంటే కుదర్దు’’ కరాఖండిగా చెప్పింది ఆమె. ఆ పాక తలుపు మూయబోతుంటే అందరూ కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు.. ‘‘ఎలా కట్టేస్తావ్’’ అంటూ.
‘‘అయితే ఇళ్లకెళ్లి డబ్బుతేపోండి’’ అంది ఆమె నింపాదిగా!
తోకముడిచారంతా. వాళ్ల వాలకం చూసి ‘‘ఇంట్లో కూడా డబ్బు లేనప్పుడు ఎందుకు ఈ అర్భాటాలు? పొండి.. సొమ్మున్నప్పుడే రండి’’ అంటూ మళ్లీ ఆమె పాక తలుపుమూయబోతుంటే..
‘‘ఆగ్గాగ్గు..! షొ.. షొ.. ష్షొమ్మంట్టే గ్గుర్ర్... త్తొష్షింద్ది.. మాయ్యాలి.. ష్షొమ్ములు వ్వాక్కేన్నా.. డబ్‌బ్‌లు ఇష్షే ద్దాక్కా...’’ అన్నాడొక ముప్పై అయిదేళ్ల వ్యక్తి.
‘‘డబుల్ ఓకే.. ఇప్పుడు తెస్తావా?’’ రెచ్చగొడుతూ ఆమె.
‘‘ఊ.... ’’ అంటూ తూలుతూ.. కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అక్కడి నుంచి కదిలాడు అతను.
‘‘మీరు కూడా మీ ఆడోళ్ల సొమ్ములు తెచ్చి ఈ కల్లుకోసం తాకట్టు పెట్టుకోవచ్చు’’ అంది టేబుల్ మీదున్న కల్లు సీసాలను చూపిస్తూ ఆ యజమానురాలు.
అంత మత్తులోనూ ఇళ్లకు వెళ్లడానికి వాళ్లు తటపటాయిస్తుంటే.. ‘‘ఈ కల్లు కావాలంటే సొమ్ము తేవాల్సిందే. మీ ఇష్టం.. తెస్తామంటే.. మీరొచ్చేదాకా కొట్టు మూసేయను’’ హామీ ఇస్తున్నట్టు చెప్పింది ఆ యజమానురాలు. భరోసాతో వాళ్లు ఇళ్లకు వెళ్లారు.
పొద్దంతా కష్టం చేసొచ్చి.. అలసిపోయి పడుకున్న భార్యల, తల్లుల మెడలో ఉన్న బంగారు తాళి, కాళ్లకున్న వెండి కడియాలు, పిల్లల కాళ్లకున్న వెండి పట్టీలు అన్నిటినీ తీసుకెళ్లిపోయారు ఆ మదిర కోసం. ఆ రాత్రంతా కల్లుతాగి మత్తులో ఆ పాకముందే మట్టిలో చిత్తుగా పడిపోయారు.
తెల్లవారింది...
నిద్రలేచిన ఆడవాళ్లు ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండడంతో ముందు ఉలిక్కిపడ్డారు. తర్వాత ‘‘ఈ దొంగ సచ్చినోళ్లు తప్పతాగి ఏ రాత్రో వచ్చి అన్నం తినడానికి తలుపులను తన్ని ఉంటారు’’ అనుకుంటూ ఉన్న ఆ రెండు గదుల ఇంటిలో ముందు గదిలో చూశారు. వసారాలోనూ చూశారు. కనిపించలేదు. వంటింట్లో అన్నం తిన్న ఆనవాళ్లూ కనిపించలేదు. ఇంటికొచ్చిన వాళ్లు ఆ మైకంలో మళ్లీ ఎక్కడికి వెళ్లిపోయారో అనుకుంటూ పనుల్లో పడ్డారు. కాసేపటికే పిల్లలు.. ‘‘అమ్మా.. పట్టీల్లేవు’’ అంటూ ఏడుస్తూ తల్లుల దగ్గరకు వచ్చారు.
‘‘అరే రాత్రికి రాత్రే ఏమయ్యాయి? పైగా ఆ ఊళ్లోని ఇళ్లల్లోని పిల్లలందరి కాళ్లకు ఒకేసారి ఎలా పోతాయి? దొంగలు పడ్డారా?’’ అని సంశయిస్తూ తమ మెడలను తడుముకున్నారు ఆ స్త్రీలు. తాళి లేదు. కాళ్లనూ చూసుకున్నారు కడియాల్లేవ్’’ అంతే అందరి గుండె ఝల్లుమంది.
‘‘దొంగలు పడ్డారా ఏంటీ?’’ అనుకుంటూ వీథుల్లోకి వచ్చారంతా. మాట్లాడుకున్నారు. మథన పడ్డారు.
సరే.. ఇంతకీ ఊళ్లోని మగవాళ్లేరీ? ఎంత తాగుడికి బానిసలైనా అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు. కాని చిత్రంగా ఓ రెండుమూడు రోజులగా .. ఆ కొత్త కల్లు కొట్టు వచ్చినప్పటి నుంచి వాళ్ల తీరు మారింది. గమనించినా.. తాగుబోతు నాయాళ్లు అని పట్టించుకోలేదు. ఇంటి తలుపులు బార్లా తెచిరి ఉండడం.. సొమ్ములు మాయమవడం.. ఆలోచిస్తుంటే కంక్లుజన్ దొరికింది వాళ్లకు.
అంతే చీపురు కట్టలు, పొయ్యిలో కర్రలు, రోకలిబండలు తీసుకొని ఆ స్త్రీ దండు కొత్త కల్లు కొట్టు దగ్గరకు పరిగెత్తారు.
వాళ్లు అక్కడికి చేరే సరికి ఆ ఊరి మగవాళ్లంతా సోయిలేకుండా పడి ఉన్నారు.. అక్కడ కల్లు కొట్టు కాదు కదా.. కనీసం ఆ ఆనవాలే లేదు. ఖంగుతిన్న మహిళామణులు అదే చీపుర్లతో భర్తలను తట్టి నిద్రలేపారు. మత్తు వీడిన వాళ్లూ హతాశులయ్యారు.
‘‘ఈ ఊరు బాగా వర్కవుట్ అయిందిరా డింభక్! మీ అమ్మ భలే యాక్ట్ చేసింది. లేకపోతే ఈ సొమ్ములు వచ్చేవి కావు’’ అన్నాడు అతను.
‘‘ఈ రాత్రే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామా?’’ అడిగింది భార్య.
‘‘ఈ రాత్రే ఏంటీ.. ఇప్పుడే రండి నాతో’’ అంటూ ఆ ఊరి శ్మశానంలోని మర్రి చెట్టు మీద నుంచి గాల్లోకి ఎగిరాడు అతను. ఆ వెంటే అతని కుటుంబమూ గాల్లోకి ఎగిరింది.
- సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment