‘‘ప్రణయ్.. లవ్యూ.. నన్ను అర్థం చేసుకో.. ప్లీజ్’’ ఫోన్లో ఆడ గొంతు బతిమాలుతోంది.
‘‘ఇప్పుడు చెప్తున్నావా లాస్యా? నీ రెస్పాన్స్ కోసం మూడేళ్లు మీ రూమ్ ముందు కుక్కలా కాపుకాశా! యేడాది నుంచయితే కనపడకుండా మాయమయ్యావ్. ఎక్కడికి వెళ్లావో తెలియదు. ఇప్పుడు సడెన్‌గా ఫోన్..’’ ఆవేదనగా ప్రణయ్.
‘‘అయ్యో.. అవన్నీ గుర్తు చేయకు ప్రణయ్.. అన్నిటికీ.. అన్నిటికీ సారీ. ఇప్పుడు నీ ఇంటి ముందు నేను కుక్కలా కాపుకాయడానికి సిద్ధమే’’ అన్నది అవతలి గొంతు అంతకంటే వేదనగా.
‘‘జస్ట్ స్టాపిట్ లాస్యా! రెండు రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు నేనేం చేయలేను. నిన్ను మర్చిపోయా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ’’ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ప్రణయ్. వెంటనే మళ్లీ ఫోన్ వచ్చింది.
‘‘లాస్యా..’’ కాస్త కటువుగా అంటూనే కట్ చేశాడు. మళ్లీ ఫోన్. మళ్లీ డిస్కనెక్ట్. మళ్లీ ఫోన్. ‘‘ఇలాగైతే రిజెక్ట్ లిస్ట్‌లో పెట్టేస్తా’’ విసుగ్గా ప్రణయ్. అనడమే కాదు పెట్టేశాడు కూడా! లాస్య చేస్తూనే ఉంది. కొన్ని గంటలు.. వేల కాల్స్. కోపంతో పళ్లు కొరుకుతోంది. పిడికిళ్లు బిగించింది. గోడకేసి కొట్టుకుంటోంది.
∙∙
‘‘అక్కా.. ప్రణయ్ కనిపించట్లేదు’’ తోటి కోడలి చెవిన వేసింది జయ కంగారుగా.
‘‘ఏంటీ..’’ అర్థంకానట్టు అయోమయంతో ప్రణయ్ తల్లి వైశాలి. గబగబా భర్త దగ్గరకు పరిగెత్తింది వైశాలి. విషయం చెప్పింది.
క్షణాల్లోనే ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ప్రణయ్ వాళ్ల నానమ్మయితే... ‘‘అయ్యో.. పెళ్లికొడుకుని చేసే వేళ.. ఇదేం పనే తల్లీ..’’ అంటూ ఊరంతా వినిపించేలా రాగం అందుకుంది.
‘‘అబ్బా.. అత్తయ్యా! ఏం కాలేదు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి’’ అంటూ ఆవిడ రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లింది జయ.
‘‘ఇదిగో ప్రమీలా.. పెద్దమ్మకేం కావాలో చూడు’’ అని గట్టిగా పనమ్మాయికి పురమాయించి వాళ్లత్తగారు చూడకుండా ఆ పిల్ల చెవిలో ‘‘ఆవిడ్ని బయటకు రానివ్వకు’’అని చెప్పి వెళ్లిపోయింది జయ.
ఇంట్లో సభ్యులంతా వసారాలో సమావేశమయ్యారు. పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులతో సహా. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రణయ్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి అడుగుతోంది అతని మేనత్త ‘‘మా వాడికి లవ్ ఎఫైర్ ఏమైనా.. ’’ అని.
‘‘అలాంటిదేం లేదు ఆంటీ’’ అన్నారు వాళ్లంతా ముక్త కంఠంతో.
‘‘కానీ.. రాత్రి ఏదో ఫోన్ వచ్చినట్టుంది ఆంటీ.. ప్రణయ్‌కి?’’ డౌట్‌గా ప్రణయ్ ఫ్రెండ్స్ గ్రూప్‌లోని ఓ అమ్మాయి.
‘‘ఎవరు? నీకేమన్నా తెలుసా?’’ ఆదుర్దాగా మేనత్త.
తల అడ్డంగా ఊపింది ఆ అమ్మాయి. మిగిలిన వాళ్లకేసీ చూసింది మేనత్త. తెలీదన్నట్టే ఎక్స్‌ప్రెషన్ వాళ్ల మొహాల్లోనూ!
నిట్టూరుస్తూ వైశాలి దగ్గరకు వెళ్లింది మేనత్త.
ప్రణయ్ సెల్‌ఫోన్‌కి కాల్ చేస్తున్నాడు వాళ్ల నాన్న. అది అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రణయ్ మిస్సింగ్.. టాక్ ఆఫ్ ది విలేజై.. పెళ్లి కూతురు తరపు వాళ్లకూ తెలిసింది. పెళ్లి కూతురు షాక్. తర్వాత ఫెయింట్. ఆమె తండ్రి హుటాహుటిని ప్రణయ్ వాళ్ల ఊరు వచ్చేశాడు. గుండె పట్టుకొని కుర్చీలో కూలబడ్డాడు.
∙∙
‘‘మీరంతా ఎవరు?’’ ప్రణయ్.
అతని ముందున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు. ఆ నవ్వులో... ఆ గుంపులో మసగ్గా తనకు పరిచితమైన రూపమే! వాళ్లందరి వెనక నుంచి నెమ్మదిగా ముందుకు వచ్చింది... లా...స్యా....
‘‘లాస్యా’’ పిలిచాడు గాబరాగా.
బదులుగా నవ్వు.. తెరలు తెరలుగా! ప్రణయ్‌కి కంగారు పుట్టించేంతగా.
‘‘లాస్యా... వీళ్లంతా ఎవరు?’’ చేతులను దగ్గరకు తెచ్చుకోబోతూ అడిగాడు. కానీ రాలేదు. ఠక్కున నవ్వు ఆపి ప్రణయ్ వైపే చూస్తోంది ఆమె. కాసేపు తీక్షణంగా... ఇంకాసేపు ప్రేమగా.. మరికాసేపు లాలనగా..
చిరాగ్గా ఉంది ప్రణయ్‌కి. తనని తాను చూసుకున్నాడు. ఒంటి మీద పెళ్లి బట్టలు కనపడ్డాయి.. ఏంటిది? పెళ్లి ఎల్లుండి కదా.. అనుకున్నాడు. తనను కట్టేసి ఉంచారు. కిడ్నాప్ చేశారా? తెంచుకోయాడు. రాలేదు. గుంపులో ఉన్న వాళ్లంతా గట్టిగా అరిచారు. ఏదో లాగినట్టయిన బాధతో. ఆ అరుపుకి ఉలిక్కి పడ్డాడు ప్రణయ్. మళ్లీ తెంచుకోబోయాడు. ఈసారి అంతకన్నా గట్టిగా అరిచారు. అప్పుడు చూసుకున్నాడు. తనను కట్టేసింది తాళ్లతో కాదు. పొడుగాటి జడలతో. అదిరిపడ్డాడు. మళ్లీ వాళ్లంతా నవ్వుతున్నారు. అందరూ ఒకే వయసు వాళ్లు కాదు. వందేళ్లు.. ఎనభై ఏళ్లు.. డెబ్బై ఏళ్లు.. యాభై ఏళ్లు.. నలభై ఏళ్లు..ముప్పై ఏళ్లు.. పాతికేళ్లు... రకరకాల వయసుల వాళ్లు.
నడుం వంగిపోయి ఒకరు.. పళ్లూడిపోయి ఒకరు.. ముడతల చర్మంతో ఒకరు.. గారపళ్లతో ఒకరు.. బూడిదరంగు కళ్లతో ఒకరు.. భయంతో బిగుసుకుపోయాడు ప్రణయ్.
లాస్య.. అతనికి దగ్గరగా వచ్చింది.
‘‘ఇంకెప్పుడు పెళ్లి? త్వరగా తాళి కట్టించండి లేకపోతే వీడు పారిపోతాడు’’ అంటోంది వందేళ్లావిడ.
‘‘అవును పారిపోతాడు. చేసేద్దాం.. చేసేద్దాం. పూలు, పళ్లు తెండి.. ఒరేయ్ బాజాభజంత్రీలూ.. వాయించడర్రా... ’’ అంటూ కేకేసింది ఇంకోవిడ.
బాజాభజంత్రీలు మొదలయ్యాయి.. చెవులు చిల్లులు పడేలా.
‘‘అమ్మాయ్.. పూలు పెడ్తాను రా ’’ అంటూ ఇంకోవిడ లాస్య జడలో జిల్లేడు పూలమాల తురమసాగింది.
ప్రణయ్‌కి ప్రాణాంతకంగా ఉంది ఈ వ్యవహారమంతా. యాభై ఏళ్ల ఆవిడ వచ్చి ప్రణయ్ నుదుటికి బబ్బేరు గింజ బాసికం కట్టింది. ఇంకొంతమంది గుంపు వచ్చి ప్రణయ్‌ని అమాంతం ఎత్తుకోబోయారు.
‘‘వదలండి.. నాకు ఈ పెళ్లి వద్దు.. ప్లీజ్ నన్ను వదలండి’’ అంటూ గింజుకుంటున్నాడు.
‘‘ఒరేయ్.. ఏమొచ్చిందిరా..?’’అంటూ ఒక్కటిచ్చాడు ప్రణయ్‌కి వాళ్ల బాబాయ్.
దిగ్గునలేచి కూర్చున్నాడు. ఒళ్లంతా తడుముకొని చూసుకుంటున్నాడు. నుదుటి మీద చేయి పెట్టి ఏదో వెదుక్కుంటున్నాడు. అతని వాలకం చూసిన బాబాయ్ ‘‘ ఏమైందిరా? అలా తడుముకుంటున్నావ్?’’ అడిగాడు.
‘‘ఏంలేదు బాబాయ్.. ’’ అని జవాబు చెప్తూనే మనసులో అనుకున్నాడు.. ‘‘కలా.. !? బతికిపోయా’’ అని.
‘‘ప్రణయ్.. లే..లే.. నాలుగు దాటకముందే వెళ్లాలి. లేచి గబుక్కున మొహం కడుక్కో..’’ అంటూ టూత్ బ్రష్, పేస్ట్ అతని చేతిలో పెట్టింది మేనత్త. ∙∙
‘‘నానమ్మా... ఇక్కడెందుకు పసుపు నీళ్ల స్నానం చేయిస్తున్నారు?’’ అడిగింది ప్రణయ్ స్నేహితురాలు.
‘‘ఈ ఊరి ఆచారం. ఎప్పుడో వెనకట.. పెళ్లి కాని వాళ్లు, పెళ్లయ్యీ ఏ ముచ్చటా తీరని వాళ్లు చనిపోయి దయ్యాలై ఈ చెట్టునెక్కాయట. వాటిని శాంతింప చేయడానికి ఈ చెట్టు కింద పెళ్లికొడుక్కి పసుపు నీళ్లు పోయడం ఆనవాయితీ అయిపోయింది. అలా పోయకపోతే పెళ్లి కూతురు రూపంలో దయ్యమే వచ్చి కాపురం చేస్తుందని అంటారు. అలాంటివి జరిగాయట కూడా’’ నానమ్మ.
జడలు వేళ్లాడదీసినట్టుగా ఉంది ఊరవతలున్న ఆ మర్రి. తల మీద నుంచి పసుపు నీళ్లు్ల కళ్లలోకి జారడంతో తల వంచుకుని రెండు చేతులతో కళ్లను గట్టిగా తుడుచుకుని తెరిచాడు.. ఒళ్లో బబ్బేరు బాసికం.. జిల్లేడు పూలు. ఝల్లుమంది ప్రణయ్‌కి. ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు.
చలేస్తోందేమో అనుకొని మేనత్త టవల్ తెచ్చిచ్చింది. ఒళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు..
జిల్లేడు పూల జడను ముందుకు వేసుకొని.. నుదుట మీద చింతపిక్క కళ్యాణ తిలకం.. బబ్బేరు గింజ బాసికం కట్టుకొని పెళ్లికూతురులా లాస్య.. నవ్వుతూ!
-సరస్వతి రమ
పసుపునీళ్ల స్నానం
Published Sun, Feb 3 2019 3:03 PM | Last Updated on Sun, Feb 3 2019 3:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment