‘‘ప్రభాకరన్నా.. ఆడ మా అన్న తాన పైసలున్నయో లెవ్వో.. ఎన్ని తిప్పలువడ్తున్నడో ఏమో.. ఏం దెలుస్తలేదు. మా అమ్మకు దెల్వకుండ గీ పైసలు దాస్కొని తెచ్చిన.. ఎట్లనన్న జేసి మా అన్న జాడ వట్టి గీ పైసలియ్యి, ఫోన్ చెయ్‌మని జెప్పు’’ అంటూ వాళ్లమ్మ చూడకుండా కర్చీఫ్ మూటను తన చేతిలో పెట్టిన సవిత మాటలే గుర్తొస్తున్నాయ్ ప్రభాకర్‌కి.
నిద్రపట్టక పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. బలవంతంగా కళ్లు మూసుకున్నాడు.. ‘‘ప్రభాకర్.. మా పిల్లిచ్చిన పైసలు పైలం. మొన్న యూరియా కాడ లైన్ల నిలవడి నిలవడి దస్కిదిని ఆల్ల బాపు పానం ఇడ్శిండు. నా మెడల పుస్తెల్తాడుంటి ఏం జేస్తదని అమ్మిన. లగ్గంకొచ్చిన పిల్లకు వనికొస్తయని కాపాయం జేసిన పైసలవి. నాకు దెల్వదనుకొని నీ షేతిల వెట్టింది. మావోడి అతపత దొరికితే మా కష్టం జెప్పుజరా..’’ కఠినంగా అన్న అనసూయవ్వ మాటలు ఛెళ్లున చరిచి.. దిగ్గున కూర్చోబెట్టాయి.
బయట జోరు వాన.. కిటికీలోంచి ఈదర ఇంట్లో వాతావరణాన్ని చల్లబరుస్తున్నా... చెమటతో తడిసి ముద్దయిపోయాడు ప్రభాకర్. లేచి.. వాల్ హ్యాంగర్‌కున్న షర్ట్ జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసుకొని.. ఆ చీకట్లోనే దారి తడుముకుంటూ.. శబ్దం రాకుండా తలుపు తెరిచి.. వసారాలో నిలబడ్డాడు. పళ్ల కింద సిగరెట్‌ను నొక్కి పట్టి.. కసిగా అగ్గిపుల్ల వెలిగించి సిగరెట్‌కు అంటించాడు.. పశ్చాత్తాపాన్ని కాల్చిబూడిద చేసేయాలన్నట్టుంది.. సిగరెట్ పొగను ఎగబీలుస్తునప్పుడు అతని ముఖ కవళిక.
పొగను ముక్కులోంచి.. నోట్లోంచి వదులుతూ పైజామా జేబులోంచి కర్చీఫ్ మూటను బయటకు తీసి గుప్పిటి తెరిచాడు. రెండు వేల నోట్ల మధ్యలో కొన్ని వందల నోట్లు.. వాటి మధ్యలో అయిదు వందల నోట్లు.. మడిచిన కట్ట. అవి ఎన్నున్నాయో కూడా లెక్కబెట్టుకున్నట్టు లేరు.. కర్చీఫ్‌లో కుక్కి మూటగట్టి తన చేతిలో పెట్టారు. ప్రభాకర్ కళ్లల్లో నీళ్లు.. చటుక్కున్న గుప్పిటి మూసి ఆ కర్చీఫ్ మూటను జేబులో పడేశాడు.
సిగరెట్ పొగను పూర్తిగా బయటకు వదలకుండా.. గుక్క మీద గుక్క పొగను పీల్చి కాలిపోయిన ఆ పీకను బొటనవేలు, మధ్యవేలును రింగులా చుట్టి సిగరెట్‌నూ అల్లంత దూరంలోకి విసిరాడు. వాన చినుకులు పడి దాని సెగ ఆరిపోయింది. రెండు చేతులు పైకెత్తి చూరుకింద ఉన్న గుంజలను పట్టుకుని బయటపడ్డ సిగరెట్‌కేసి చూడసాగాడు తదేకంగా.
మనసు గతాన్ని కళ్లముందుకు తెచ్చింది...
మస్కట్‌లో ఒక ఫ్రెండ్ కలిపించిండు సురేష్‌ను. ఇంటర్ పాసై తను పనిచేస్తున్న కన్‌స్ట్రక్షన్ సైట్‌లోకే కార్ డ్రైవర్‌గా వచ్చిండు.
‘‘ఇంటర్ పాసయినవ్.. ఆడ్నే సదుకోకుండా గీడికొచ్చినవ్ తమ్మీ’’ అడిగిండు తను.
‘‘యెవులసంతోని బగ్గ అప్పులయినయ్.. షెల్లెకు పెండ్లి జెయ్యాలే.. గందుకే’’ చెప్పిండు. ‘‘పిల్లగాడు మస్తు మంచోడ్రా.. మా ఊరే. ఈడ సుత మా రూమ్‌లనే ఉంచుకున్నం’’ చెప్పిండు తన దోస్త్.. సురేష్ భుజం మీద చేయివేసి ప్రేమగా కొడుతూ! గట్ల సురేష్ తనగ్గూడా దగ్గరైండు. అటెన్కల నెలకే గా దోస్త్ ఇండియాకొచ్చి.. మల్లా సౌదీకి వోయిండు. గాని జాగల.. గా రూమ్‌లకు తను వొయిండి. సురేష్ మాలెస్సనే క్లోజ్ అయిండు. ఆల్ల బాపు, అమ్మ, సవిత ఫోన్ జేస్తే అడ్పదడ్ప తనగ్గూడ ఇస్తుండే మాట్లాడమని. ‘‘అరే.. ప్రభాకరన్నా.. మీది మా పక్కపొంటి ఊరే’’అని సవిత సంబర పడ్తుండె. ఒకసారి శుక్రవారం దేవుళ్లకు జేసుకుంటే ఊరికి వొయ్యి తన పెండ్లాం, పిల్లలనూ పండుక్కి తెచ్చుకున్నడు బాపు... ఈ తలపులతో ప్రభాకర్ కళ్లలోని నీటి ఊట చెంపల మీద నుంచి జారుతోంది. పట్టించుకునే స్థితిలో లేడు.
ఎంత పనిజేసిండు.. పాపిష్టోడు.. పాపం పోరడొచ్చి ఆర్నెల్లన్న కాలే.. ఈ షేతులతోనే జైలుకి వట్టిచ్చిండు... కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుంది. ఏం జేస్తడు? తనగ్గూడా పైసలు కావాలే.. ఇంటికాడ జేసిన అప్పులు తీరాలే.. మస్కట్‌కొయ్యి మూడేండ్లయిందన్న ముచ్చట్నే గానీ.. యేడాద్దాకా కరెక్ట్‌గా పనే లేకుండే.. అగో గప్పుడే ‘‘ఖబ్రీ’’ గురించి దెల్సింది. ముందుగల్ల తన ఇలాఖా మనుషుల జోలికివోనేలేదు.. పాకిస్తానోల్లను, బంగ్లాదేశోల్లనే వట్టిచ్చిండు. పైస.. ఏ పాపమన్నా జేయిస్తది.. బాపు ఖీసాలకెంచి చారాణా, ఆఠాణా దొంగతనం జేసినప్పుడల్లా బాపమ్మ గొణుగుతుండే.. పైసా.. పైసా ఏం జేస్తవే అంటే అయినోడిని పగజేస్తా అన్నదట అని. నిజంగనే.. పైస మీద పావురం.. గా పిల్లగాన్ని పగ జేసింది. ఆ పిల్లగాడికి దెల్వదు.. తలనొప్పి గోళీలు గల్ఫ్‌ల బ్యాన్ అన్న సంగతి. తనకు దెల్సు అయినా చెప్పలే. రెండుమూడు పాకెట్లు దెచ్చుకున్నడు. ఎయిర్‌పోర్ట్‌ల కెంచి ఎట్ల దప్పిచ్చుకున్నడో మరి! గా పైసల ఆశ గోళీల గురించి పోలీసులకు ఖబర్ ఇచ్చేదాకా మనసునవట్టనియ్యలే. నాలుగునెల్లయితుంది సురేష్ జైల్లవడి. గా పొల్లగానిగ్గూడా దెల్వదు.. గా పనిజేసిన ఖబ్రీ ఎవరో!
థూ.. గీ బతుకుల మన్నువడా... దుఃఖం ఆగలేదు ప్రభాకర్‌కు. ఏడుస్తూ కూలబడిపోయిండు.
ఆ చప్పుడుకి లోపల్నుంచి బయటకు వచ్చింది అతని భార్య సువర్ణ.
కళ్లు నులుముకుంటూనే.. ‘‘అయ్యో.. ఏమైందే గిట్ల కూలవడ్డవ్?’’ అంది భర్తను లేపుతూ! ‘‘గింత రాత్రి గీడున్నవ్.. మల్లా సిగరెట్టా?’’ నిద్రమత్తు పోయి కోపం వచ్చింది ఆమెకు.
కాదు అన్నట్లు తలూపుకుంటూ కళ్లు తుడుచుకున్నాడు ప్రభాకర్. ఆ చీకట్లోనూ భర్త పరిస్థితి అర్థమైంది ఆమెకు.
‘‘ఏందే.. ఏడుస్తున్నవా?’’ అంది అతని దగ్గరకు వస్తూ!
‘‘ఉహ్హూ.. ఏం లేదు నువ్ పో.. పోయ్యి పండుకో’’అన్నడు మొహం ఆమెకు కనిపించకుండా పక్కకు తిప్పుకుంటూ!
కానీ ఆమె వెళ్లలేదు.. నిజం తెలుసుకునే పట్టూ వీడలేదు.
‘‘మాపటికెంచి చూస్తూన్న.. గా పొల్ల, అనసూయవ్వ అచ్చిపోయిన్నుంచి నువ్వు మంచిగలేవు. నాకు అర్థమైతలేదనుకున్నవా?’’ గట్టిగానే అడిగింది.
అంతే ఆమెను పట్టుకొని ఏడ్చేశాడు అతను.
‘‘అయ్యో.. ఏందే.. సురేష్‌కేమన్నా అయిందా ఏందీ?’’ గాభరాగా అడిగింది.
‘‘నేనే... జేష్న’’ రెండు చేతులతో గుండె మీద బాదుకుంటూ ఏడ్చాడు.
బిక్కమొహం వేసింది సువర్ణ. సవిత ఇచ్చిన కర్చీఫ్ మూటను జేబులోంచి తీసి భార్య చేతిలో పెడ్తూ ‘‘గా పిల్లకు మొహం ఎట్ల జూపియ్యాల్నే’’ అన్నాడు బాధ నిండిన గాద్గదిక స్వరంతో.
ఆ మూటను, భర్తను అయోమయంగా చూస్తూ అడిగింది.. ‘‘సంగతేందో నా మైండ్లవల్లేదస్సలు?’’ అని.
‘‘గా పొల్లగాడ్ని నేనే జైలుకివట్టిచ్చిన. నాలుగునెల్లైంది. ఆల్ల బాపు వోయిండని గూడా ఆడికి దెల్వదింకా!’’ అంటూ భార్యను పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు ప్రభాకర్.
‘‘ఎంత పనిజేసినవ్? మనకిద్దరాడవిల్లలున్నరు మర్శిపోయినవా? అసలు ఎందుకు వట్టిచ్చనవ్?’’ భర్త భుజాలు పట్టుకుని నిలదీస్తోంది సువర్ణ. జవాబుగా దుఃఖమే వస్తోంది అతణ్ణించి.
- సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment