న్యూక్లియర్ రిలేషన్ | Nuclear Family | Sakshi
Sakshi News home page

న్యూక్లియర్ రిలేషన్

Published Thu, Nov 20 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

న్యూక్లియర్ రిలేషన్

న్యూక్లియర్ రిలేషన్

ఆధునికత .. అనుబంధాలనూ హత్తుకుంది! అత్తాకోడలు,ఆడపడుచు, అల్లుడు..అనే బంధాలు మర్యాద చట్రంలోంచి బయటపడి ఆప్యాయత వరస కలుపుకొన్నాయి! ఇలాంటి అనురాగాలు న్యూక్లియర్ ఫ్యామిలీని అల్లుకుంటున్నాయి! మనుషులు కలిసుండి మనసులు కలహించుకునే బదులు మనుషులు దూరంగా ఉన్నా మనసులు కలిసుండే ఈ మోడర్న్ రిలేషన్సే బావుంటున్నాయని అంటున్నారు మూడు తరాల ప్రతినిధులు.
- సరస్వతి రమ

ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల్లో.. అత్తగారు చెప్పిందే వేదం. ఇంట్లో పనులు అత్తగారికి నచ్చినట్టు చేయాలి. ఆమె కనుసన్నల్లో మెలగాలి. బయట పనులన్నీ మామగారి బాధ్యత. ఇక్కడ కోడలికే కాదు కొడుకుకూ పెద్దగా అధికారాల్లేవ్. కొడుకు అనే బంధానికి కాస్త వెసులుబాటు ఉంటుంది. అటువైపు వరుసలో అల్లుడు రాచమర్యాదలను అందుకుంటుంటాడు. అల్లుని ముందుకి రావడం అత్తగారికి అమర్యాద. మంచిచెడులు ఏవైనా కూతురి ద్వారా తెలపాల్సిందే తప్ప అల్లుడిని అడిగే ధైర్యం అత్తింటివాళ్లకు లేదు.
 
ఇప్పటి కుటుంబాల్లో..
కుటుంబసభ్యులంతా కలసి ఉండే కల్చర్ లేదు. అత్తగారు నిలబడి ఉన్నా కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ కోడలికి ఉంది. ‘అత్తయ్యా.. నాకు ఫలానా వంటకం తినాలని ఉంది.. అరగంటలో ఇంటికొస్తాను వేడివేడిగా వండి పెట్టండి’ అని హక్కుగా అడిగే ఇంటి అల్లుళ్లు కనపడుతున్నారు. ఇరుగుపొరుగుతో షాపింగ్ వెళ్లి కోడలికి సూట్ అయ్యే డ్రెస్‌ను కొనిపెట్టే అత్తా ఉంది. ఉద్యోగస్తురాలైన కోడలి మంచిచెడులే కాదు ఆమె సమస్యలనూ పంచుకొని.. ధైర్యాన్నిచ్చే అత్తమ్మా దర్శనమిస్తోంది.

అత్తామామల ముప్పయ్యో వివాహ వార్షికోత్సవానికి సెకండ్ హానీమూన్ ట్రిప్‌ని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందిస్తున్న అల్లుళ్లూ ఉంటున్నారు. కొడుకు విదేశాల్లో ఉంటే తానే కొడుకై వాళ్ల యోగక్షేమాలను కనిపెడుతున్నాడు. మనవళ్లను, మనవరాళ్లకు పక్కన పడుకోబెట్టుకుని కథలు వినిపించే అవకాశం అమ్మమ్మ, నానమ్మలకు ఈ తరం ఇవ్వకపోయినా... స్కైప్‌లో ముచ్చట్లు పెట్టి తృప్తిపడే సౌకర్యాన్ని మాత్రం ఇస్తోంది! ఇలా ఆధునికతను హత్తుకున్న ఈ అనుబంధాలను ఆస్వాదించే కుటుంబాలూ లేకపోలేదు.  
 
నో ఎండ్ ఫర్ ఆత్మీయత..
కాలంలో వచ్చిన వేగం ఉమ్మడికుటుంబాలను పొట్టలో దాచుకొని చిన్న కుటుం బాలకు ప్రాణం పోసి ఉండొచ్చు. అంతమాత్రాన అనుబంధాలను మాయం చేయలేదు. ఇదిగో లాంఛనంగా ఉన్న కుటుంబమర్యాదలను పక్కకు తప్పించి దగ్గరితనాన్ని పెంచిందిలా! అయితే ఇదంతా నాణానికి ఓ పార్శ్వం మాత్రమే కావొచ్చు కూడా!
 
స్మార్ట్ రిలేషన్స్..
‘నౌ ఐయామ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్.  నాకు మునిమనమరాలు కూడా ఉంది. అంటే అయిదు తరాలు చూశానన్నమాట. ఎన్నో మార్పులు. ముఖ్యంగా అనుబంధాల విషయంలో. ఇప్పుడు చదువుకున్నవాళ్ల శాతం పెరిగింది. ఆ చదువు విజ్ఞతను, లాజిక్‌నూ నేర్పుతోంది కాబట్టి ఈ తరం కుటుంబ బంధాలను సంక్లిష్టం చేసుకోకుండా సున్నితంగా మలచుకుంటోంది. అంతకుముందు అత్తగారిమీదే నడిచేది.

నాకు అత్తగారి హోదా వచ్చేటప్పటికి నేను ఇండిపెండెంట్‌గా ఉండాలనుకున్నాను.. నా కోడలికీ ఆ స్వేచ్ఛనివ్వాలనుకున్నాను. అలాగే ఉన్నాంకూడా. హ్యాపీగా ఉన్నాం. అనుబంధాల్లో ఏమాత్రం తేడాలేదు. ఇంకా ఈ తరమైతే స్మార్ట్ రిలేషన్స్‌ని కోరుకుంటోంది. ఈ మార్పులో ఉన్న సానుకూల అంశం ఏంటంటే.. ఇదివరకు ఉమ్మడికుటుంబాల్లో మనుషులు కలిసుంటే కలతలు పెంచుకునేవాళ్లు. ఈర్ష్య, అసూయలుండేవి. ఇప్పుడవి లేవు. అంత టైమ్ కూడా ఇప్పటివాళ్లకు లేదనుకోండి. మనుషులు దూరంగా ఉన్నా మనసులు కలిసుంటే చాలు అన్న సూత్రం ఇప్పుడు కనిపిస్తోంది. మంచిదే కదా’ అంటారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామేశ్వరి.
 
ఫ్రెండ్‌గా ఉంటే చాలు..
‘నాకు ఒక  కూతురు, కొడుకు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నేను కొన్నాళ్లు ఉమ్మడి కుటుంబానికి కోడలిని. ఇప్పుడూ కొడుకు, కోడలితో కలిసే ఉంటాం. అయినా నేను ఎదుర్కొన్న సమస్యలు నా కోడలికి లేవు. కొడుక్కి సంబంధం కుదరగానే కోడలికి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌నయ్యా. అలాగే కూతురి పెళ్లి కుదరగానే మా అల్లుడూ నాతో ఆన్‌లైన్ చాటింగ్ చేసేవాడు (వాళ్లు ఆస్ట్రేలియాలో ఉంటారు). ఇద్దరూ నన్ను ఓ అమ్మలా భావించేవారు. భావిస్తున్నారు కూడా.

నా కోడలు అడిగింది మీ ఇంటి కోడలిగా నానుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నేనెలా ఉండాలనుకుంటున్నారు?’ అని. నన్ను మీ అమ్మలా అనుకొని ఓ ఫ్రెండ్‌లా ఉంటే చాలమ్మా  అని చెప్పాను. అలాగే ఉంటున్నాం. అన్నీ షేర్ చేసుకుంటుంది. అటు అల్లుడూ అంతే కొడుకులా ఉంటాడు’అని రచయిత్రి జ్యోతి వలభోజు చెప్తుంటే వాళ్ల కోడలు ప్రీతి ‘ నేను బీటెక్ చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. నాకు మా అమ్మవాళ్లింట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవ్. ఫ్రెండ్లీగా ఉంటారు అత్తమ్మ. మా ఆడపడచు దీప్తి.. తనూ అంతే.  మేమిద్దరం వదినామరదళ్లులా ఉండం. కజిన్స్‌లా ఉంటాం.’ అంటుంది.
 
ఇద్దరితోపాటు మూడో కొడుకు..
‘నాకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి. ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యాయి. అల్లుడు రాము మా ఇద్దరు కొడుకుల్లానే ఉంటాడు. అమ్మా అనే పిలుస్తాడు. వాళ్లమ్మకు ఏది కొంటే నాకూ అది కొంటాడు. నా కొడుకులతోనూ ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు. బావా అని ఎప్పుడూ పిలుచుకోరు వాళ్లు. స్నేహితుల్లా ఒరేయ్ అనే పిలుచుకుంటారు. అమ్మాయి వాళ్లు దుబాయ్‌లో ఉంటారు. వాళ్లకో బాబు. వాడికి మూడేళ్లు. కథలు, కబుర్లు చెప్పాలని అమ్మమ్మగా చాలా అనిపిస్తుంది. అందుకే వాళ్లమ్మ పనిలో ఉంటే స్కైప్‌లో వాడిని నాకు కనెక్ట్ చేసేస్తుంది. ఆమె పనయ్యే వరకు ఆ కంప్యూటర్‌లోనే వాడితో ఆడుకుంటా’ అని మోడర్న్ రిలేషన్‌కి అచ్చమైన ప్రతి నిధిలా ఉన్న
 పద్మాసూర్యప్రకాశ్‌రెడ్డి చెప్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement