మంజునాదం
హిందుస్థానీ సంగీతంలో గ్వాలియర్ ఘరానా, కయన్ సంప్రదాయాల మేళవింపుతో రాగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మంజూషా పాటిల్. సంగీత ప్రేమికులైన తల్లిదండ్రుల ప్రోత్సాహం.. నిరంతర సాధనతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారీమె. హైదరాబాదీ శ్రోతలను అలరించేందుకు తొలిసారి ఇక్కడకు వచ్చిన ముంజూషా పాటిల్ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు.
నేను పుట్టి పెరిగిందంతా మహారాష్ట్ర సాంగ్లీలో. అమ్మనాన్నలకు సంగీతమంటే ప్రాణం. ఎక్కడ కచేరి జరిగినా వారితో పాటు నన్ను తీసుకెళ్లేవారు. దీంతో సహజంగానే రాగాలు ఒంటబట్టాయి. అలాగని సంగీతం నేర్చుకోవాలంటూ పేరెంట్స్ నాపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. 12 ఏళ్ల వయస్సులోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నా. మిరాజ్‌లోని అఖిల భారత గాంధర్వ మహావిద్యాలయలో సంగీత విశారద్ పూర్తి చేశా. తరువాత కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ నుంచి ఎంఏ (మ్యూజిక్)లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఓ సంగీత పోటీలో నా గాత్రం విన్న దివంగత పండిట్ డీవీ కనెబువా స్వరం బాగుందని ప్రశంసించారు. ఆయన దగ్గరే ఆగ్రా, గ్వాలియర్ ఘరానా సంప్రదాయంలో సాధన చేశా. ప్రస్తుతం పద్మశ్రీ పండిట్ ఉల్హాస్ కషల్కర్ ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నా.
మంచి ఆదరణ...
నేను హైదరాబాద్ రావడం తొలిసారి. ఎప్పటి నుంచో నా గాత్రాన్ని నగరవాసులకు వినిపించాలని అనుకుంటున్నా. ‘ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ వారు ఇక్కడ కచేరీ చేయాలని ఆహ్వనించగానే మారు మాట్లాడకుండా ఓకే చేశా. ఈ నగరంలో హిందూస్థానీ మ్యూజిక్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. నా కచేరీకి వచ్చిన ప్రజలను చూస్తుంటే ఇది అర్ధమవుతోంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని కచేరీలు చేయాలనుకుంటున్నా. ఇక్కడి స్పైసీ ఫుడ్ నచ్చింది.
-వీఎస్