ముంబై: ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణదేవి(92) కన్నుమూశారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిందుస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవిని 1977లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడే. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి 1941లో వివాహమాడి, 1962లో విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత తన జీవితకాలంలో అధికభాగం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అన్నపూర్ణాదేవి..ముంబైకి మకాం మార్చి కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇవ్వడానికే అంకితమయ్యారు. ఆమె శిష్యుల్లో హరిప్రసాద్ చౌరాసియా(బన్సూరి), ఆశిష్ ఖాన్(సరోద్), అమిత్ భట్టాచార్య(సరోద్), బహదూర్‌ఖాన్(సరోద్), బసంత్ కాబ్రా(సరోద్), , జోతిన్ భట్టాచార్య(సరోద్), నిఖిల్ బెనర్జీ(సితార్), నిత్యానంద్ హల్దీపూర్(బన్సూరి), పీటర్ క్లాట్(సితార్), ప్రదీప్ బారట్(సరోద్), సంధ్యా ఫాడ్కే(సితార్), సరస్వతి సాహా(సితార్), సుధీర్ ఫాడ్కే(సితార్), సురేశ్ వ్యాస్(సరోద్) తదితర ప్రముఖులున్నారు. అన్నపూర్ణదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
తండ్రే గురువు..
‘మా’గా పిలుచుకునే అన్నపూర్ణాదేవిది సంప్రదాయ సంగీత నేపథ్యమున్న కుటుంబం. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా, అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఐదేళ్ల ప్రాయం నుంచే తండ్రి ఉస్తాద్ బాబా నుంచి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తొలుత సితార్ వైపు మొగ్గుచూపినా, తరువాత సూర్‌బహర్(తక్కువ పిచ్ ఉండే సితార్)పై మక్కువ పెంచుకుని అందులోనే ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో ‘సేనియా మైహర్ ఘరానా’ అనే శైలిని నెలకొల్పడంలో ఆమె తండ్రి విశేష కృషి చేశారు.
‘హిందుస్తానీ’ దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత
Published Sun, Oct 14 2018 3:58 AM | Last Updated on Sun, Oct 14 2018 3:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment