
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్‌లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది.
నటసింహంగా గుర్తింపు..
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.
బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..
1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన.
50 ఏళ్ల నట ప్రస్థానం..
‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్‌ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.
బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment