శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. అందుకే ఇండస్ట్రీలో ఏ సినిమా ప్రారంభించినా మొదట వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుంది.
బేబీ నుంచి భగవంత్ కేసరి వరకు బొజ్జ గణపయ్యే
వినాయక చవితి వస్తుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలతో పాటు భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అలా నవరాత్రుల్లో ఊరూవాడల్లో సందడి కనిపిస్తుంది. సినిమా అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ అందుకే మన ప్రతి పండుగలో సినిమా ఉంటుంది. అలాగే చాలా సినిమాల్లో మన పండుగలు, సంప్రదాయాలు కనిపించేలా మేకర్స్ చిత్రీకరిస్తారు. అందులో భాగంగా చాలా సినిమాల్లో వినాయకుడు ప్రతిమ ఇతి వృత్తంగా సినిమాలు చాలానే వచ్చాయి. మెగాస్టార్ కూడా జై చిరంజీవ సినిమాలో వినాయకుడి గొప్పతనాన్ని చాటుతూ స్టెప్పులేశాడు. ఈ మధ్య విడుదలైన బేబీ సినిమాలో కూడా హీరోయిన్ వైష్ణవి ఎంట్రీ కూడా మన గణపతి ముందు వేసిన స్టెప్పులతోనే ప్రారంభం అవుతుంది. బాలయ్య భగవంత్ కేసరి నుంచి తాజాగా విడుదులైన మొదటి పాట కూడా బొజ్జ గణపయ్యతోనే ప్రారంభం అవుతుంది. అందులో శ్రీలీల వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ప్రతి గణేషుడి మండపం వద్ద ఈ పాటు మారుమ్రోగుతుంది. అంతలా వినాయకుడు సినిమాలో భాగం అయిపోయాడు.
వినాయకుడిలో తమ హీరోను చూసుకుంటున్న ఫ్యాన్స్
వినాయకుడు అంటే అందరికీ ఎంతో ప్రీతి.. ఆయన రూపం అందరినీ మెప్పిస్తుంది. అందుకే పలువురి హీరోల ఫ్యాన్స్ ఈ వేడుకలకు సినిమాలనూ జోడించి సంబరాలు చేసుకుంటారు. ఈ ట్రెండ్ చాలా ఏళ్ల నుంచే ప్రారంభం అయింది. ఈ ఏడాది కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలోని పాత్రల రూపంలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి యువత గణపతి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా ఈ వినాయక పండగకు కూడా కొలువుదీరిన విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాహుబలి వినాయకుడు
భారతీయ సినీ అభిమానులను విశేషంగా అలరించిన సినిమా బాహుబలి. అందులో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా భారత ప్రజలందరికీ దగ్గరయ్యాడు అంతలా ఆ పాత్రకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ బాహుబలి రూపంలో గణేశుడి విగ్రహాలు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇలా ప్రత్యేకంగా తమ ఫ్యాన్స్ అడిగి మరీ తయారు చేయించుకుంటున్నారు.
వినాయకుడి రూట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్‌తో పాటు నేషనల్ అవార్డ్ రావడంతో మళ్లీ ఈ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తే ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఫ్యాన్స్ వారిని వినాయకుడి రూపంలో విగ్రహాలు చేపించి తమ భక్తితో పాటు అభిమానాన్ని చాటుతున్నారు. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ విల్లు చేతబట్టి బాణాలు సందిస్తూ కనిపించిన చరణ్ ఇప్పుడు అదే లుక్‌లో గణేశుడి విగ్రహాలు రెడీ అయ్యాయి. మరోవైపు కొమురం భీం (ఎన్టీఆర్) ఇంటర్వెల్ సీన్‌లో ఎంట్రీ అదుర్స్ అనేలా ఉంటుంది. తారక్ ఒక వాహనం నుంచి దుకుతుంటే ఆయన చుట్టూ అడివి జంతువులు కూడా ముందుకు దూకుతాయి. ఇదే సింబల్ కనిపించేలా వినాయకుడి ప్రతిమలు రెడీ అయ్యాయి.
ఈ ట్రెండ్ కోలీవుడ్‌లోనూ ఉంది.. లియో- గణనాథుడు
విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమా ప్రకటన సందర్భంగా వారిద్దరినీ కలుపుతూ ఓ వైపు గణేశుడు, మరోవైపు సింహంతో విగ్రహాన్ని రూపొందించారు. అలాగే, లియో సినిమా పేరు ప్రకటన వీడియోలో నటుడు విజయ్ బ్లడీ స్వీట్ చెప్పే సన్నివేశం చుట్టూ రూపొందించిన మరో విగ్రహం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహం 8 అడుగుల పొడవు ఉండగా లక్షకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. 25 రోజుల పాటు, ఐదుగురు శిల్పులు ఈ విగ్రహాన్ని రూపొందించారు.
నేషనల్ అవార్డుతో తగ్గేదే లే అంటున్న పుష్ప- వినాయకుడు
గత సంవత్సరం ఎక్కడ చూసినా కూడా వినాయకుడి రూపంలో అల్లు అర్జున్ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అందుకే బన్నీపై అభిమానంతో తమకు ఎంతో ఇష్టమైన బొజ్జ గణపయ్య రూపంలో విగ్రహాలు రెడీ చేపించారు. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment