ఒకవైపు హిందుస్థానీ సంగీతం మరోవైపు వెస్ట్రన్ మ్యూజిక్... వెరసి ఆమె పాటకు కొత్త చూపును ఇచ్చాయి. ‘పాట అంటే వాద్యాల ఘోష కాదు... మనల్ని మనం పుస్తకంలా చదువుకోవడం కూడా’ అంటున్న మీరా దేశాయ్ పరిచయం...
అమెరికాలో పుట్టి పెరిగినా, తన సంగీత, సాహిత్యాలలో ‘భారతీయత’ ఎక్కడికీ పోలేదు. సందేహం ఉంటే...‘ఐ హ్యావ్ నెవర్‌బీన్ హ్యాపియర్ టు బీ లాస్ట్’ ఈపీ(ఎక్స్‌టెండెడ్ ప్లే)లో పాటలు వినండి చాలు.
తల్లిదండ్రులు మీరాకు గుజరాతి భాష నేర్పించారు. చిన్న వయసులోనే ఎన్నో భజనలను తల్లి ద్వారా నేర్చుకుంది. అలా తన మాతృభాషపై ఆసక్తి పెరిగింది,
పదిహేడు సంవత్సరాల వయసులో తొలి పాట రాసిన మీరాకు తొలిసారిగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సంగీత కచేరిలో హిందుస్థానీ శాస్త్రీయసంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్‌ను చూసే అదృష్టం దక్కింది. ఆ క్షణమే తనకు హిందుస్థానీ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది.
ప్రతిరోజూ తన చెవుల్లో హిందుస్థానీ సంగీతం మారుమోగేది.
ఎందరు గాయకులో, ఎన్ని ఘరానాలో!
హిందుస్థానీ దగ్గరే ఆగిపోలేదు. వెస్ట్రన్ మ్యూజిక్‌లో పదిసంవత్సరాల పాటు శిక్షణ పొందింది. ఫిమేల్ జాజ్ స్టార్స్...నైనా సిమోన్, నోరా జోన్స్, పాప్ సింగర్–సాంగ్ రైటర్స్ సారా బెరిలెస్, టోరీ కెల్లీ...తాను అభిమానించే జాబితాలో చేరిపోయారు. వారి ప్రభావం తన పాటలపై కనిపిస్తుంది.
తన డెబ్యూ ఈపి ‘ఐ హ్యావ్ నెవర్‌బీన్ హ్యాపియర్ టూ బీ లాస్ట్’ విడుదలైనప్పుడు తనదైన సొంతగొంతు వినిపించింది. రకరకాల సంగీతధోరణుల ప్రభావంతో పెరిగిన మీరాకు అది అంత తేలికైన విషయం కాదు.
‘మనదైన సొంతగొంతు వినిపించాలంటే, కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావాలి’ అంటుంది మీరా.
పాట అంటే వాయిద్యాల ఘోష కాదు. అందులో ఎమోషన్ డెప్త్ శ్రోతలను హంట్ చేయాలి. అది మీరా పాటల్లో వినిపిస్తుంది.
‘డివైన్’ పాటలో ఇలా రాసింది మీరా...
‘నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చదువుకోవాలని ఉంది’
జీవితపుటలను తిరగేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నలకు సాధికారికమైన సమాధానాలు వెదుక్కోవచ్చు.
ఇక ‘డిస్టెన్స్’ పాట దగ్గరికి వస్తే...దూరం పెరగడం అనేది అన్ని విషయాల్లోనూ భారమైన విషయమేమీ కాదు. కొన్ని విషయాల్లో అది శక్తిని ఇచ్చే పని. మనల్ని మనం పునరావిష్కరించుకునే పని. ఎక్కడి వరకో ఎందుకు? మనలోని బద్దకానికి దూరంగా జరిగితే, నిర్మాణరాహిత్యానికి దూరంగా జరిగితే... అదేమీ ప్రతికూలత కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే.
వెదుక్కుంటూ వెళితే మన మూలాల జాడ దొరుకుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లడం ద్వారా తన రూట్స్‌లోకి వెళ్లింది మీరా.
‘ఆల్ మై లైఫ్
ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్
సెర్చింగ్ ఫర్ సమ్‌థింగ్...’ అని తన ‘డివైన్’ లో చరణాలను పాడుకునే ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల మీరా.
ఆమె వెదుకుతున్నది అక్కడ ఏమైనా కనిపించిందా?
ఒకవేళ కనిపిస్తే అది కచ్చితంగా ఆమె పాటలో వినిపిస్తుంది. వేచిచూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment