అన్నపూర్ఱా దేవి (పాత చిత్రం)
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అన్నపూర్ణా దేవి(91) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మహిళా వాయిద్యకారులకు ఆదర్శంగా నిలిచిన అన్నపూర్ణా దేవి మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ దేవి ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమైన ఆమె మరణం తీరని లోటని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కుటుంబమంతా సంగీత విద్వాంసులే..
అన్నపూర్ణా దేవి ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఉస్తాద్ బాబా అలావుద్దీన్ ఖాన్, మదీనా బేగంల కుమార్తె. ఆమె అసలు పేరు రోషనార ఖాన్. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోషనార సర్‌బహర్(వీణ) వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మిహైర్ ఎస్టేట్ మహరాజ బ్రిజినాథ్ ఆమె పేరును అన్నపూర్ణగా మార్చారు. అన్నపూర్ణ సోదరుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా సంగీత విద్వాంసుడే కావడం విశేషం. కాగా అన్నపూర్ణ తన 14వ ఏట ప్రముఖ సితార్ విద్వాంసుడు రవి శంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. 20 ఏళ్ల అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని రుషి కుమార్ పాండ్యా అనే వ్యక్తిని వివాహమాడారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు (రవి శంకర్- అన్నపూర్ణ దంపతుల కుమారుడు) శుభేంద్ర శుభో శంకర్ 2013లో తన 50వ ఏట కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment