ఎర్ర తువ్వాలును గాల్లో గిర్రాగిర్రా తిప్పుతూ.. పొగరుతో బుసలు కొట్టే బసవన్నలను కనుసన్నలతో శాసిస్తూ.. క్రీడాకారులకు వాటిని చిక్కకుండా దౌడు తీయించే సాహస క్రీడా చాణక్యాన్ని ప్రదర్శించడంలో మగువలు సైతం తెగువ చూపుతున్నారు. వీరత్వం పురుష పుంగవులకే పరిమితం కాదని.. నారీమణుల ధీరత్వం సైతం మగధీరులకు ఏ మాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతున్నారు. సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో తమిళ తంబిలతో తలపడుతూ వారికే సవాల్ విసురుతున్నారు. మధురై పౌరుషానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.
సాక్షి, చెన్నై: సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలు.. ఆలయాలు.. వారసత్వ సంపదల వంటి విభిన్న విశేషాల సమాహారంతో నిండిన రాష్ట్రం తమిళనాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై తిరగబడ్డ వీర నారీమణి వేలునాచ్చియార్, తన భర్తకు జరిగిన అన్యాయంపై తిరగబడి మధురైను తగులబెట్టిన కన్నగి లాంటి వారెందరో తమిళ మంగై (తమిళ నారీమణి)లుగా చరిత్రకెక్కారు. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వారే కాకుండా.. దేశ రాజకీయాలతోపాటు ప్రాధాన్యతా రంగాల్లోనూ సత్తా చాటుతున్న మంగైలు ఎందరో ఈ గడ్డపై పుట్టారు. తమిళనాట అత్యంత భయంకరమైన సాహస క్రీడగా పేరొందిన జల్లికట్టులోనూ ప్రవేశిస్తూ ఇక్కడి మహిళలు మధురై వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటుతామంటూ తెరపైకి వస్తున్నారు.
బరిమే సవాల్
తమిళ గడ్డపై పూర్వం వరుడిని ఎంపిక చేసుకునేందుకు జల్లికట్టు క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో యువతుల్ని మెప్పించేందుకు యువకులు ఈ సాహసాన్ని ప్రదర్శించగా.. రానురాను ఇదో రాక్షస క్రీడగా మారింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ప్రారంభమయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలలపాటు జిల్లాల వారీగా తమిళనాడు వ్యాప్తంగా జరిగేది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు తమ వీరత్వాన్ని చాటుకునేందుకు జల్లికట్టు బరిలోకి దిగేవారు. ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు రానురాను ఎద్దులను హింసించడం పెరిగింది. పొగరెక్కిన ఎద్దుల దాడిలో ఎన్నో మరణాలు సైతం చోటుచేసుకున్నాయి.
బసవన్నలు బుసలు కొట్టేవిధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడంతో జల్లికట్టుపై ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. సంప్రదాయ సాహస క్రీడను తిరిగి సాధించుకునేందుకు 2017లో యావత్ తమిళావణి మహోద్యమంతో కదం తొక్కింది. జల్లికట్టును మళ్లీ సాధించుకున్న తర్వాత తమిళ వీర మంగైలు సైతం సత్తా చాటుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎద్దులను మచ్చిక చేసుకుని శిక్షణ ఇవ్వడంతోపాటు వాటిని జల్లికట్టుకు సిద్ధం చేయడం మొదలెట్టారు. అయితే, వీరికి క్రీడా మైదానంలోకి కొన్నేళ్లుగా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా వాడివాసల్ (ప్రవేశ మార్గం) వెనుకకే పరిమితమయ్యారు. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళ మగువలు క్రీడా మైదానంలో అడుగు పెట్టి సత్తా చాటారు.
అందుకే తిరస్కరించా..
నాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న తర్వాతే బహుమతి తీసుకోవాలన్నది నా లక్ష్యం. అందుకే తిరస్కరించాను. ప్రతిరోజు నా తమ్ముడు(ఎద్దు)తో రెండు గంటలపాటు పొలంలో సాధన చేయిస్తాను. వాడికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. ఈసారి తమ్ముడు తీవ్రంగానే పోరాటం చేశాడు. వచ్చేసారి గెలిచి తీరుతాడు.
– యోగదర్శిని, అవనియాపురం
ఆ ఉద్యమం స్ఫూర్తిగా..
2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నాన్నతో పట్టుబట్టి ఓ ఎద్దును కొనిపించి శిక్షణ ఇచ్చాను. చెరువు, నీటి పరీవాహక ప్రదేశాలు, మట్టి దిమ్మెలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ సాధన చేయిస్తున్నా. అందుకే వాడిద్వారా బంగారు నాణెం బహుమతిగా లభించింది. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్తా.
– స్నేహ, అలంగానల్లూరు
తమిళనాట ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్
మధురై జిల్లా అవనియాపురం వేదికగా భోగి రోజున జరిగిన జల్లికట్టులో అదే ప్రాంతానికి చెందిన 9 తరగతి విద్యార్థినులు అన్నలక్ష్మి, నిషా, పదో తరగతి విద్యార్థిని యోగదర్శిని తొలిసారిగా క్రీడా మైదానంలోకి తమ ఎద్దులతో దూసుకొచ్చారు. అన్నలక్ష్మి, నిషా వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బుసలు కొడుతూ క్రీడాకారులకు చిక్కకుండా ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. యోగదర్శిని ఎద్దు క్రీడాకారులకు చిక్కడంతో ఆ బాలికకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. అయితే, యోగదర్శిని ఆ బహుమతిని తిరçస్కరించి.. ‘మరోసారి కలుద్దాం.. కచ్చితంగా గెలుద్దాం’ అంటూ వాడివాసల్ వేదికగా ప్రతిజ్ఞ చేసి వెళ్లింది. ప్రస్తుతం తమిళనాట అంతటా ఇదే హాట్ టాపిక్. ఆ మరుసటి రోజున పాలమేడులో కొందరు బాలికలు తమ ఎద్దుల్ని వాడివాసల్ నుంచి బయటకు రప్పించి మెరిశారు.
ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం జరిగిన జల్లికట్టులో స్నేహ అనే 16 ఏళ్ల బాలికతో పాటుగా మరో ఇద్దరు బాలికలు తమ ఎద్దులతో వచ్చి బంగారు నాణేలను గెలుచుకెళ్లారు. ఇదే సందర్భంలో తమిళ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని.. మన సంస్కృతిని భావితరాలకు సైతం అందించాలంటే ప్రతి నారీ జల్లికట్టులో భేరీ మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో మగధీరులకు జల్లికట్టు పోటీల్లో మరింత పోటీ తప్పదన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment