కన్నగి రాజేంద్రన్ వెల్డర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు ‘వెల్‌డన్’ అని ఎవరూ అనలేదు. ‘వెల్డింగ్ పనిలోకి వెళుతున్నావా! అది మామూలు పని అనుకున్నావా... మంటలతో చెలగాటం’ అని మాత్రమే అన్నారు. ‘ఫైర్’ ఉన్న అమ్మాయికి ఫైర్‌తో భయం ఏమిటీ! అలాంటి ఒక ఫైర్ కన్నగి. ‘వెల్డింగ్ ఫీల్డ్‌లో రావడానికి భయం అక్కర్లేదు. కాస్త ధైర్యం చాలు’ అంటుంది...
పురుషుల డొమైన్‌గా భావించే వెల్డింగ్ ప్రపంచంలోకి మహిళలు అడుగు పెట్టడమే కాదు, తమ సత్తా చాటుతున్నారు. దీంతో తమిళనాడులోని కర్మాగారాలు వెల్డింగ్‌కు సంబంధించి మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఈ మార్పుకు కారణం కన్నగి రాజేంద్రన్‌లాంటి మహిళలు. ఆరియలూరుకు చెందిన కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టినప్పుడు....
‘ఇది తప్ప నీకు చేయడానికి మరే పని దొరకలేదా’ అన్నట్లుగా మాట్లాడారు.ఆ మాటలకు కన్నగి వెనకడుగు వేసి ఉంటే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చేది కాదు. నాలుగు సంవత్సరాలుగా ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో వెల్డర్‌గా పనిచేస్తున్న కన్నగి ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్’ నిర్వ హించిన గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ (జిఎంఎడబ్లు్య) పోటీలో ఉత్తమ పైప్ వెల్డర్‌గా అవార్డ్ గెలుచుకుంది.
ఈ పోటీలో 45 డిగ్రీల కోణంలో ఉంచిన పైపుపై వెల్డర్‌ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. పైప్ చుట్టూ వివిధ స్థానాలలో వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి అధునాతన టెక్నిక్, బహుముఖప్రజ్ఞ అవసరం అవుతాయి. ఆ బహుముఖప్రజ్ఞను సొంతం చేసుకున్న కన్నగి అవలీలగా విజయం సాధించింది. ఈ పోటీ కోసం కంపెనీలో వివిధ వెల్డింగ్ విభాగాలలో విస్తృతమైన శిక్షణ పొందింది.
ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్లే కన్నగి వెల్డింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అన్నయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చేసింది. తిరుచ్చిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో చేరిన కన్నగి 2021లో ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో ట్రైనీగా ఉద్యోగంలో చేరింది. ‘నేను ట్రైనీగా చేరినప్పుడు ఒక్క మహిళ కూడా లేదు. ఎందుకు ఇలా అని అడిగితే అధిక శ్రమతో కూడిన ఈ పనిలోకి మహిళలు ఎందుకు వస్తారు అనే జవాబు వినిపించింది.
నేను మాత్రం ఈ పని చేయగలనా అని కాస్త సందేహించాను. అలా భయపడితే ఎలా అని ఆ తరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఎంతైనా కష్టపడాలి అనుకున్నాను. ఆ కష్టమే ఈ పురుషాధిక్య రంగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడింది. రెండు నెలలలోనే నా పనికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది’ అంటుంది కన్నగి.
కంపెనీ ఫ్యాబ్రికేషన్ విభాగంలో వెల్డర్‌గా చేరినప్పుడు మొదట్లో ఆమె కుటుంబసభ్యులు భయపడ్డారు.
వెల్డింగ్ ఫీల్డ్‌లో జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు. వారికి సర్ది చెప్పి ఉద్యోగంలో చేరింది. మొదట్లో చర్మ సమస్యలు, కంటి సమస్యలు వచ్చాయి. సరైన మందులు, భద్రతాచర్యలతో త్వరలోనే వాటి నుంచి బయటపడింది.
‘ప్రతి ఉద్యోగంలో కష్టాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం’ అంటున్న కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్న యువతులకు ధైర్యాన్ని ఇస్తోంది. ‘చేయగలనా! అనే సందేహం దగ్గర ఉండిపోతే అక్కడే ఆగిపోతాం. యస్... నేను చేయగలను అనుకుంటే ముందుకు వెళతాం. నేను సాధించిన విజయం సంతోషాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు పురుషాధిక్య రంగాల్లో మహిళలు కూడా రాణించగలరు. తాము పురుషులతో సమానమని వారు తెలుసుకుంటారు’ అంటుంది కన్నగి రాజేంద్రన్.
Comments
Please login to add a commentAdd a comment