Welder
-
అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?
కన్నగి రాజేంద్రన్ వెల్డర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు ‘వెల్డన్’ అని ఎవరూ అనలేదు. ‘వెల్డింగ్ పనిలోకి వెళుతున్నావా! అది మామూలు పని అనుకున్నావా... మంటలతో చెలగాటం’ అని మాత్రమే అన్నారు. ‘ఫైర్’ ఉన్న అమ్మాయికి ఫైర్‌తో భయం ఏమిటీ! అలాంటి ఒక ఫైర్ కన్నగి. ‘వెల్డింగ్ ఫీల్డ్‌లో రావడానికి భయం అక్కర్లేదు. కాస్త ధైర్యం చాలు’ అంటుంది...పురుషుల డొమైన్‌గా భావించే వెల్డింగ్ ప్రపంచంలోకి మహిళలు అడుగు పెట్టడమే కాదు, తమ సత్తా చాటుతున్నారు. దీంతో తమిళనాడులోని కర్మాగారాలు వెల్డింగ్‌కు సంబంధించి మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఈ మార్పుకు కారణం కన్నగి రాజేంద్రన్లాంటి మహిళలు. ఆరియలూరుకు చెందిన కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టినప్పుడు....‘ఇది తప్ప నీకు చేయడానికి మరే పని దొరకలేదా’ అన్నట్లుగా మాట్లాడారు.ఆ మాటలకు కన్నగి వెనకడుగు వేసి ఉంటే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చేది కాదు. నాలుగు సంవత్సరాలుగా ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో వెల్డర్‌గా పనిచేస్తున్న కన్నగి ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్’ నిర్వ హించిన గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ (జిఎంఎడబ్లు్య) పోటీలో ఉత్తమ పైప్ వెల్డర్‌గా అవార్డ్ గెలుచుకుంది.ఈ పోటీలో 45 డిగ్రీల కోణంలో ఉంచిన పైపుపై వెల్డర్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. పైప్ చుట్టూ వివిధ స్థానాలలో వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి అధునాతన టెక్నిక్, బహుముఖప్రజ్ఞ అవసరం అవుతాయి. ఆ బహుముఖప్రజ్ఞను సొంతం చేసుకున్న కన్నగి అవలీలగా విజయం సాధించింది. ఈ పోటీ కోసం కంపెనీలో వివిధ వెల్డింగ్ విభాగాలలో విస్తృతమైన శిక్షణ పొందింది.ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్లే కన్నగి వెల్డింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అన్నయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చేసింది. తిరుచ్చిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో చేరిన కన్నగి 2021లో ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో ట్రైనీగా ఉద్యోగంలో చేరింది. ‘నేను ట్రైనీగా చేరినప్పుడు ఒక్క మహిళ కూడా లేదు. ఎందుకు ఇలా అని అడిగితే అధిక శ్రమతో కూడిన ఈ పనిలోకి మహిళలు ఎందుకు వస్తారు అనే జవాబు వినిపించింది. నేను మాత్రం ఈ పని చేయగలనా అని కాస్త సందేహించాను. అలా భయపడితే ఎలా అని ఆ తరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఎంతైనా కష్టపడాలి అనుకున్నాను. ఆ కష్టమే ఈ పురుషాధిక్య రంగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడింది. రెండు నెలలలోనే నా పనికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది’ అంటుంది కన్నగి.కంపెనీ ఫ్యాబ్రికేషన్ విభాగంలో వెల్డర్‌గా చేరినప్పుడు మొదట్లో ఆమె కుటుంబసభ్యులు భయపడ్డారు.వెల్డింగ్ ఫీల్డ్‌లో జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు. వారికి సర్ది చెప్పి ఉద్యోగంలో చేరింది. మొదట్లో చర్మ సమస్యలు, కంటి సమస్యలు వచ్చాయి. సరైన మందులు, భద్రతాచర్యలతో త్వరలోనే వాటి నుంచి బయటపడింది.‘ప్రతి ఉద్యోగంలో కష్టాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం’ అంటున్న కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్న యువతులకు ధైర్యాన్ని ఇస్తోంది. ‘చేయగలనా! అనే సందేహం దగ్గర ఉండిపోతే అక్కడే ఆగిపోతాం. యస్... నేను చేయగలను అనుకుంటే ముందుకు వెళతాం. నేను సాధించిన విజయం సంతోషాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు పురుషాధిక్య రంగాల్లో మహిళలు కూడా రాణించగలరు. తాము పురుషులతో సమానమని వారు తెలుసుకుంటారు’ అంటుంది కన్నగి రాజేంద్రన్.(చదవండి: జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్) -
వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలులోని మద్దూర్ నగర్‌కు చెందిన షఫీ 1997లో ఐటీఐ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద ఆస్పత్రులకు ఎలక్ట్రికల్ వర్క్ కాంట్రాక్టుకు తీసుకుని బాగానే సంపాదిస్తున్నాడు. తనవద్ద ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న ఎంతోమంది కూడా సొంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ రెండు, మూడేళ్లుగా అతనికి ఎలక్ట్రీషియన్లు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మూడు బ్యాచ్‌లుగా పిలిపించుకుని వారితో పనిచేయిస్తున్నాడు. కారణం పనిచేసేవారు మన వద్ద క్రమంగా తగ్గిపోతుండటమే. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం! పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. ఆస్పత్రులు, బ్యాంకులు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో అభివృద్ధి జరుగుతోంది. కానీ వర్కర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎలక్ట్రీషియన్లు, శానిటేషన్ వర్కర్లను(ఫిట్టర్లు) కూడా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ నుంచి తెప్పించుకుని పనులు చేస్తున్నారు. పై రెండు ఉదాహరణలు పరిశీలిస్తే ‘స్కిల్డ్ వర్కర్ల’ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు సూపర్ విజన్ జాబ్‌ల దిశగా అడుగులేస్తూ పని నేర్చుకునే ఐటీఐని పక్కన పడేస్తుండటం ఆందోళనకరం. గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గానికో స్కిల్హబ్ ఏర్పాటు చేసి, వృత్తివిద్య పూర్తిచేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంది. టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత అధిక శాతం మంది స్మార్ట్ లైఫ్‌కు అలవాటుపడ్డారు. శారరీక శ్రమ లేని ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులు కూడా కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. ‘మేం కష్టపడ్డాం. మా పిల్లలు అలా కాకూడదు. సుఖంగా బతకాలి’ అనే ధోరణితో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఈ విభాగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడనివారు కొందరైతే, మంచి చదువులు అభ్యసించి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారి సంఖ్య ఎక్కువే. దీనికి కారణం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ‘సూపర్వైజింగ్’ ఉద్యోగాలు. దేశంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ‘స్కిల్డ్ వర్కర్ల’నే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీఐ, డిప్లొమో చదివిన వారివైపు మక్కువ చూపుతున్నాయి. దీనికి కారణం ఈ విభాగాల్లోని వారు శారీరక శ్రమతో పనిచేయాలి. ఐటీఐలో 71.08 శాతం తక్కువ అడ్మిషన్లు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ రంగాల్లో ఎక్కువగా ఐటీఐ చదివిన విద్యార్థులు ఉంటారు. కొంతకాలంగా ఐటీఐ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి కారణం ఈ చదువులు చదివితే వర్కర్లుగా పనిచేయాలి. ఇంజినీరింగ్ లాంటి చదువులు చదివితే కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేయొచ్చనే దృక్పథం విద్యార్థుల్లో ఉండటమే. గత ఐదేళ్ల ఐటీఐ అడ్మిషన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2018లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే 23 శాతం తక్కువగా అడ్మిషన్లు నమోదైతే, 2019లో 28 శాతం, 2020లో 40.76 శాతం, 2021లో 39.76 శాతం తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం 2022లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏకంగా 71.08 శాతం తక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 17 ఐటీఐ కాలేజీల్లో 2012 సీట్లు ఉంటే కేవలం 713 మాత్రమే భర్తీ అయ్యాయి. నంద్యాల జిల్లాలో 21 కాలేజీల్లో 2,924 సీట్లు ఉంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 714 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 75.58 శాతం తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే ఐటీఐ చదువులపై విద్యార్థులు మక్కువ చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే.. ఐటీఐ, డిప్లొమో చదువులు పూర్తి చేసిన స్కిల్డ్ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్ఎస్డీసీ(నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్ లాంటి ఆటోమొబైల్‌తో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. మెకానిక్ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్ ఒక ఇంటికి కరెంట్ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే. స్కిల్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి విద్యార్థుల్లో వృతినైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లాలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ నిర్మిస్తోంది. రెండు జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 5 హబ్‌లు ఏర్పాటు చేశారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు 45 రోజుల నుంచి 60 రోజులు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేసినవారు, నిరుద్యోగులు ఇక్కడ ‘స్కిల్’ మెరుగుపరుచుకుని ఉద్యోగం సంపాదించొచ్చు. నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్నూలు, ఎమ్మిగనూరులో రెండు సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత వీరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. 24/7, వెబ్బ్లెండర్స్ లాంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. శిక్షణ పూర్తికాగానే ప్లేస్మెంట్లు ఇస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్, స్కిల్‌డెవలప్‌మెంట్ -
కూలీ కొడుకు.. తొలి ప్రయత్నంలోనే 99.93 శాతం స్కోర్
చదువుకు.. వయసు, స్తోమత, స్థాయితో పనేముంది. పరిస్థితులు అనుకూలిస్తే చాలు. కానీ, తమకున్న వనరులకు శ్రమను జోడించి చదువులో అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్లు ఎందరో!. వెల్డింగ్ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్(తొలి రౌండ్).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట. రెండో తరగతిలోనే వీడిక చదువుకు పనికిరాడు అంటూ టీచర్లు ఇంటికి పంపిస్తే.. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు. మధ్యప్రదేశ్ దెవాస్, దీపక్ సొంత ఊరు. దీపక్ తండ్రి రామ్ ఎక్బల్ ప్రజాపతి.. వెల్డింగ్ కూలీ. పెద్దగా చదువుకోని ఆయన.. కొడుకును కష్టపడి చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నాడు. కానీ, కొడుకు మాత్రం చిన్నతనంలో తోటి పిల్లలతో సరదాగా గడపడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. దీంతో చదవులో రాణించలేడంటూ ఇంటికి పంపించేశారు. కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆ తండ్రి ఆందోళన చెందాడు.కానీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. ఆ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. క్రమక్రమంగా చదువులో మెరుగు అవుతూ.. పదో తరగతిలో 96 శాతం మార్కులు సంపాదించాడు. కొందరు టీచర్ల సలహాతో కంప్యూటర్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) చేయాలనుకున్నాడు. ఐఐటీలో చేరాలని తనకు తానుగా ప్రామిస్ చేసుకున్నాడు. దీపక్ ప్రాథమిక విద్య అంతా స్థానికంగా ఒక స్కూల్లోనే సాగింది. లాక్డౌన్ టైంలో తొమ్మిదవ తరగతి కష్టంగా సాగిందట.కారణం.. స్మార్ట్ ఫోన్ లేకపోవడం. అయితే తండ్రి ఎలాగో కష్టపడి కొడుకు కోసం ఓ ఫోన్ కొన్నాడు. జేఈఈ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా పేరున్న ఇండోర్‌కు వెళ్లాడు. రోజుకు 13 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరం ఉండడం అతనికి అలవాటు అయ్యింది. ఒకవేళ బోర్‌గా ఫీలైతే.. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడడం లాంటివి చేశాడట. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు తన అనుభవపూర్వకంగా దీపక్ ఒక సలహా ఇస్తున్నాడు. తనను తాను నమ్ముకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం తన విజయానికి కారణమని చెప్తున్నాడు దీపక్ ప్రజాపతి. -
సౌదీనావస్థ
సౌదీలో చిక్కుకున్న ఆరుగురు విశాఖ వాసులు ఉద్యోగాలిప్పిస్తామని మోసగించిన ఏజెంట్లు అయిదు నెలలుగా జీతాల్లేవు రోజూ రాత్రిపూటే భోజనం చిన్న గదిలో పది మంది నివాసం అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని గట్టెక్కించాలి. కొడుకు కిడ్నీ శస్త్ర చికిత్సకు డబ్బు సంపాదించాలి. ఆర్థిక సమస్యలను అధిగమించాలి... అందుకోసం విదేశం వెళ్లాలనుకున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు గుమ్మరించారు. సౌదీలో విమానం దిగాక మోసపోయామని తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక విలపిస్తున్నారు. అయిదు నెలలుగా నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి తీసుకురమ్మని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విశాఖ రూరల్ : సౌదీ అరేబియాలో ఉద్యోగాలిప్పిస్తామని కొందరు ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మి జిల్లాకు చెందిన చాలా మంది వారిని సంప్రదించారు. వెల్డర్, ఫిట్టర్, టెక్నికల్ ఉద్యోగాలిప్పిస్తామని, నెలకు రూ.20 వేలకు పైగా జీతమని, భోజనం, వసతి ఉచితమని ఏజెంట్లు నమ్మించారు. దీంతో అన్నెపు గోవిందరావు (నడుపూరు), గోల్కొండ శేషగిరిబాబు (బీహెచ్‌పీవీ), పిల్లా గణేష్ (శ్రీహరిపురం), ఎమ్డీ హఫీజుల్లా (పెదగంట్యాడ), రాయె శ్రీనివాసరావు (అనకాపల్లి), కోడెపు నరసింగరావు (కశింకోట)లు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఏజెంట్లకు సమర్పించి సౌదీ వెళ్లారు. రూపాయైనా జీతం ఇవ్వలేదు అక్కడికి వెళ్లాక చెప్పిన ఉద్యోగం కాకుండా కూలి పనులు చేయించారు. పనేదైనా నెలకు రూ.20 వేల జీతం వస్తుందన్న ఆశతో సంస్థ ప్రతినిధులు చెప్పిన ప్రతీ పని చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. చిన్న గదిలో 10 మందిని కుక్కడంతో నిద్రపోయేందుకు కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రోజూ రాత్రి పూట మాత్రమే భోజనం పెడుతున్నారు. అయిదు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ విలపిస్తున్నారు. ఫోన్ చేయడానికి కూడా డబ్బుల్లేక, సంస్థలో పనిచేస్తున్నవారు, బయటి వ్యక్తులను అర్ధించి వారి ఫోన్లతో ఇళ్లకు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తమ వారిని వెనక్కి రప్పించాలని కుటుంబ సభ్యులు ఇటీవలే కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. కష్టాలు తమ జీవితాలకు కొత్తేమి కాదని, డబ్బులు పోయినా తమ వారిని వెనక్కు రప్పిస్తే చాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. కలెక్టరేట్‌కు సమాచారం విశాఖ జిల్లావాసులు ఆరుగురు సౌదీలో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని ఎన్ఆర్ఐ ప్రొటోకాల్ విభాగం నుంచి వీరి చిరునామాలు కలెక్టరేట్‌కు రావడంతో రెవెన్యూ అధికారులు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న వారిని కలెక్టరేట్‌కు రప్పించి అక్కడ చిక్కుకున్న వారి పూర్తి వివరాలను సేకరించారు. కొందరి ఇళ్లకు రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నారు. ఆరుగురు జిల్లా వాసులను నిర్థారించాక ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తుందంటున్నారు.