- సౌదీలో చిక్కుకున్న ఆరుగురు విశాఖ వాసులు
- ఉద్యోగాలిప్పిస్తామని మోసగించిన ఏజెంట్లు
- అయిదు నెలలుగా జీతాల్లేవు
- రోజూ రాత్రిపూటే భోజనం
- చిన్న గదిలో పది మంది నివాసం
అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని గట్టెక్కించాలి. కొడుకు కిడ్నీ శస్త్ర చికిత్సకు డబ్బు సంపాదించాలి. ఆర్థిక సమస్యలను అధిగమించాలి... అందుకోసం విదేశం వెళ్లాలనుకున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు గుమ్మరించారు. సౌదీలో విమానం దిగాక మోసపోయామని తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక విలపిస్తున్నారు. అయిదు నెలలుగా నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి తీసుకురమ్మని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
విశాఖ రూరల్ : సౌదీ అరేబియాలో ఉద్యోగాలిప్పిస్తామని కొందరు ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మి జిల్లాకు చెందిన చాలా మంది వారిని సంప్రదించారు. వెల్డర్, ఫిట్టర్, టెక్నికల్ ఉద్యోగాలిప్పిస్తామని, నెలకు రూ.20 వేలకు పైగా జీతమని, భోజనం, వసతి ఉచితమని ఏజెంట్లు నమ్మించారు. దీంతో అన్నెపు గోవిందరావు (నడుపూరు), గోల్కొండ శేషగిరిబాబు (బీహెచ్‌పీవీ), పిల్లా గణేష్ (శ్రీహరిపురం), ఎమ్‌డీ హఫీజుల్లా (పెదగంట్యాడ), రాయె శ్రీనివాసరావు (అనకాపల్లి), కోడెపు నరసింగరావు (కశింకోట)లు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఏజెంట్లకు సమర్పించి సౌదీ వెళ్లారు.
రూపాయైనా జీతం ఇవ్వలేదు
అక్కడికి వెళ్లాక చెప్పిన ఉద్యోగం కాకుండా కూలి పనులు చేయించారు. పనేదైనా నెలకు రూ.20 వేల జీతం వస్తుందన్న ఆశతో సంస్థ ప్రతినిధులు చెప్పిన ప్రతీ పని చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. చిన్న గదిలో 10 మందిని కుక్కడంతో నిద్రపోయేందుకు కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రోజూ రాత్రి పూట మాత్రమే భోజనం పెడుతున్నారు.
అయిదు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ విలపిస్తున్నారు. ఫోన్ చేయడానికి కూడా డబ్బుల్లేక, సంస్థలో పనిచేస్తున్నవారు, బయటి వ్యక్తులను అర్ధించి వారి ఫోన్లతో ఇళ్లకు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తమ వారిని వెనక్కి రప్పించాలని కుటుంబ సభ్యులు ఇటీవలే కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. కష్టాలు తమ జీవితాలకు కొత్తేమి కాదని, డబ్బులు పోయినా తమ వారిని వెనక్కు రప్పిస్తే చాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు.
కలెక్టరేట్‌కు సమాచారం
విశాఖ జిల్లావాసులు ఆరుగురు సౌదీలో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఐ ప్రొటోకాల్ విభాగం నుంచి వీరి చిరునామాలు కలెక్టరేట్‌కు రావడంతో రెవెన్యూ అధికారులు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న వారిని కలెక్టరేట్‌కు రప్పించి అక్కడ చిక్కుకున్న వారి పూర్తి వివరాలను సేకరించారు. కొందరి ఇళ్లకు రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నారు. ఆరుగురు జిల్లా వాసులను నిర్థారించాక ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తుందంటున్నారు.