- సౌదీలో అష్టకష్టాలుపడ్డ మహిళ
- బాధితురాలిని షేక్‌లకు అమ్మేసిన ఏజెంట్లు
- నెలన్నర తర్వాత నగరానికి చేరిన బాధితురాలు
గోల్నాక, న్యూస్‌లైన్: ఏజెంట్ల మాటలను నమ్మి పనిమనిషిగా చేసేందుకు సౌదీ అరేబియా వెళ్లిన మహిళ అక్కడి షేక్‌ల చేతుల్లో నలిగిపోయింది. అష్టకష్టాలు పడి నెలన్నర తర్వాత నగరానికి చేరుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... అంబర్‌పేట ఆకాష్‌నగర్‌లో బాధితురాలు, తన భర్తతో కలిసి నివాసముంటోంది. మెకానిక్ పని చేస్తున్న భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంది. ఖాద్రిబాగ్‌కు చెందిన ఏజెంట్ సనాబేగం, టోలీచౌకికి చెందిన మరో ఏజెంట్ ఫయీంలను సంప్రదించింది.
వీరు ఆమెకు పాస్‌పోర్టు ఇప్పించారు. సౌదీ అరేబియాలోని అబాలో షేక్ (70) ఇంట్లో వంట చేయడంతో పాటు అతని పిల్లలను చూసే పనిపై గత జనవరి 28న పంపారు. అక్కడ షేక్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాను అలాంటి దానిని కాదని, మీ ఇంట్లో పని చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు స్పష్టం చేయగా... నిన్ను రూ. 2 లక్షలకు ఏజెంట్లు నాకు అమ్మేశారని షేక్ చెప్పాడు.
నా మాట వినాల్సిందేనని బెదిరించి వారం పాటు షేక్ ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ హింసించాడు. అక్కడే ఉంటున్న ఏజెంట్ ఫయీం కుమారుడు ఇమ్రాన్ అలియాస్ సమీర్ ఆమె ఆ తర్వాత మరో షేక్‌కు విక్రయించాడు. ఇలా ఎనిమిది మంది షేక్‌లకు ఇమ్రాన్ ఆమెను విక్రయించాడు. చివరకు బాధితురాలు నగరంలోని తన కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేయగా.. వారు గతనెల 11న అంబర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏజెంట్లు సనాబేగం, ఫయీంలను పోలీసులు పిలిపించారు. వెంటనే ఆ మహిళను నగరానికి తీసుకురావాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విమాన చార్జీల కోసం రూ. 15 వేలు ఇస్తే ఆమెను నగరానికి రప్పించే ఏర్పాటు చేస్తామని ఏజెంట్లు చెప్పారు. ఆ డబ్బు తీసుకొని బాధితురాలిని గురువారం నగరానికి తీసుకొచ్చారు. సౌదీలో తాను పడ్డకష్టాలను బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసిన ఏజెంట్లు సనాబేగం, ఫయీం, అబాలో ఉన్న ఇమ్రాన్ అలియాస్ సమీర్‌లను కఠినంగా శిక్షించాలని కోరింది.