Madhya Pradesh Indore Labourer Son Deepak Prajapati Scored 99.93% In First JEE Attempt - Sakshi
Sakshi News home page

తండ్రి వెల్డర్‌.. పేద కుటుంబం.. జేఈఈ తొలి ప్రయత్నంలోనే 99.93 శాతం స్కోర్‌

Published Wed, Jul 13 2022 4:24 PM | Last Updated on Wed, Jul 13 2022 8:12 PM

Madhya Pradesh: Welder Son Acheived 99 Pecent Score JEE Main - Sakshi

చదువుకు.. వయసు, స్తోమత, స్థాయితో పనేముంది. పరిస్థితులు అనుకూలిస్తే చాలు. కానీ, తమకున్న వనరులకు శ్రమను జోడించి చదువులో అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్లు ఎందరో!.  

వెల్డింగ్‌ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్‌(తొలి రౌండ్‌).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్‌ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్‌ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్‌ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట. రెండో తరగతిలోనే వీడిక చదువుకు పనికిరాడు అంటూ  టీచర్లు ఇంటికి పంపిస్తే.. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు.  

మధ్యప్రదేశ్‌ దెవాస్‌, దీపక్‌ సొంత ఊరు. దీపక్‌ తండ్రి రామ్‌ ఎక్‌బల్‌ ప్రజాపతి.. వెల్డింగ్‌ కూలీ. పెద్దగా చదువుకోని ఆయన.. కొడుకును కష్టపడి చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నాడు. కానీ, కొడుకు మాత్రం చిన్నతనంలో తోటి పిల్లలతో సరదాగా గడపడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. దీంతో చదవులో రాణించలేడంటూ ఇంటికి పంపించేశారు. కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆ తండ్రి ఆందోళన చెందాడు.కానీ.. 

కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. ఆ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. క్రమక్రమంగా చదువులో మెరుగు అవుతూ.. పదో తరగతిలో 96 శాతం మార్కులు సంపాదించాడు. కొందరు టీచర్ల సలహాతో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) చేయాలనుకున్నాడు. ఐఐటీలో చేరాలని తనకు తానుగా ప్రామిస్‌ చేసుకున్నాడు. 

దీపక్‌ ప్రాథమిక విద్య అంతా స్థానికంగా ఒక స్కూల్‌లోనే సాగింది. లాక్‌డౌన్‌ టైంలో తొమ్మిదవ తరగతి కష్టంగా సాగిందట.కారణం.. స్మార్ట్‌ ఫోన్‌ లేకపోవడం. అయితే తండ్రి ఎలాగో కష్టపడి కొడుకు కోసం ఓ ఫోన్‌ కొన్నాడు. జేఈఈ కోసం ఫ్రీగా కోచింగ్‌ ఇచ్చిన ఓ ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. 

ఇందుకోసం మధ్యప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరున్న ఇండోర్‌కు వెళ్లాడు. రోజుకు 13 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాకు దూరం ఉండడం అతనికి అలవాటు అయ్యింది. ఒకవేళ బోర్‌గా ఫీలైతే.. బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ ఆడడం లాంటివి చేశాడట. 

కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యేవాళ్లకు తన అనుభవపూర్వకంగా దీపక్‌ ఒక సలహా ఇస్తున్నాడు. తనను తాను నమ్ముకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం తన విజయానికి కారణమని చెప్తున్నాడు దీపక్‌ ప్రజాపతి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement