షైన్ విత్ వైన్
రేపు డ్రింక్ వైన్ డే
పసందైన విందు భోజనానికి ‘వైన్ అండ్ డైన్’ అని ఇంగ్లిషులో వాడుక. వైన్ లేని విందు అసలు విందే కాదనేది పాశ్చాత్యుల భావన. వారి సంస్కృతిలో వైన్‌కు అంతటి ప్రాధాన్యత ఉంది మరి. మన దేశంలోనూ సురార్చకులకు కొదవ లేకపోయినా, మిగిలిన మధువులతో పోల్చి చూస్తే వైన్ వాడుక మాత్రం చాలా పరిమితం. ‘బీరాధిబీరు’లైన హైదరాబాదీలు ఎక్కువగా బీరు సాగరంలోనే ఓలలాడేందుకు ఇష్టపడతారు తప్ప, వెరైటీగా వైన్ టేస్ట్ చేయాలని కోరుకోవడం కాస్త అరుదే.
నిజానికి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇతరేతర మధుపానీయాల కంటే వైన్ చాలా శ్రేష్టమైనది. పరిమితంగా, క్రమం తప్పకుండా వైన్ సేవించే వారికి చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరవు. మధువులన్నింటిలోనూ ‘సారా’శం ఒకటే కదా, అలాంటప్పుడు వైన్ వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమిటని ప్రశ్నించే ‘మందు’మతుల అవగాహన కోసం ఒక చిన్న ఉదాహరణ. ఫ్రాన్స్‌ను మినహాయిస్తే, చాలా పడమటి దేశాల్లో కూడా విస్కీ, వోడ్కా, బీరు వంటి పానీయాల వినియోగమే ఎక్కువ.
అమెరికన్లు వినియోగించే కొవ్వు పదార్థాలతో పోలిస్తే, ఫ్రెంచి ప్రజలు ఆరగించే కొవ్వు పదార్థాలు 30 శాతం ఎక్కువ. అయినా, ఫ్రాన్స్‌తో పోలిస్తే కొవ్వు ఎక్కువ కావడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడే అమెరికన్లు 40 శాతం ఎక్కువ. అమెరికా కంటే పుష్కలంగా ద్రాక్షలు పండే ఫ్రాన్స్‌లో వైన్ వినియోగం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ వైచిత్రికే ఫ్రెంచి వైద్యుడు డాక్టర్ సెర్జే రెనాడ్ ‘ఫ్రెంచ్ పారడాక్స్’ అని పేరు పెట్టాడు. వైన్ సేవనం వల్ల ఫ్రెంచి ప్రజలు పొందుతున్న ఆరోగ్య లబ్ధిని గమనించిన అమెరికన్ ‘మందు’మతులు వైన్ కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని సృష్టించారు.
ఏటా ఫిబ్రవరి 18న అమెరికాలో దేశవ్యాప్తంగా జరుపుకొనే ‘నేషనల్ డ్రింక్ వైన్ డే’ సందర్భంగా బార్లు, పబ్బులు రకరకాల వైన్లతో కస్టమర్లకు ‘మదిరా’నందం కలిగిస్తాయి. రోజూ 8 ఔన్సులకు మించకుండా వైన్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రపంచవ్యాప్తంగా వైద్యుల ఉవాచ. మన భాగ్యనగరంలో ఇప్పుడిప్పుడే వైన్ వైపు మొగ్గుతున్న వారు నెమ్మదిగా పెరుగుతున్నారు.
జంటనగరాల్లో నెలకు రూ.3 కోట్ల మేరకు వైన్ విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ గణాంకాల భోగట్టా. ‘సిటీ’జనులలో వైన్ ప్రశస్తిపై అవగాహన కల్పించేందుకు ‘హైదరాబాద్ వైన్ క్లబ్’ కూడా ఇతోధికంగా కృషి చేస్తోంది. భాగ్యనగర సురార్చకులారా! ఇంకెందుకాలస్యం.. డ్రింక్ వైన్ డే సందర్భంగా మీరు కూడా వైన్‌తో చీర్స్ చెప్పండి.
- వైన్‌తేయుడు