
నేడు ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదరులంతా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా బంధువులను కలవడం.. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం.. స్వీట్లు పంచుకోవడం ఇవి దాదాపుగా అన్ని చోట్ల జరిగేవే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రిస్మస్ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఆ వివరాలు ఓ సారి చూద్దాం..
రోడ్లపై తిరగొద్దు
వెనుజులా, కరాకస్ వంటి ప్రాంతాల్లో క్రిస్మస్ రోజున కార్లు రోడ్ల మీద తిరగకూడదు. పండగ పూట ప్రజలు గుంపులుగా స్కేటింగ్ చేసేందుకు వీలుగా రోడ్లను ఖాళీగా ఉంచాలని నియమం. ఈ రూల్ ఎన్నో ఏళ్లుగా అక్కడ అమల్లో ఉంది. ఇక జర్మన్ల విషయానికొస్తే... వారు క్రిస్మస్ ట్రీలో పచ్చళ్లను దాచి పెట్టుకుంటారు.
మేక బొమ్మ దహనం
దసరా పండుగ రోజున మన దగ్గర రావణ దహనం చేసినట్లుగానే... క్రిస్మస్ పర్వదినాన స్వీడన్‌లో పెద్ద మేక బొమ్మను దహనం చేస్తారు. 1966 నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.
సంపద కలిసి వస్తుందని..
స్లోవేకియాలో ఓ వింత ఆచారం ఉంది. క్రిస్మస్ డిన్నర్‌ని ప్రారంభించడానికి ముందు ఇంటి పెద్ద ఆ రోజు తయారు చేసిన ఓ ప్రత్యేక వంటకాన్ని స్పూన్‌తో తీసుకుని ఇంటి సీలింగ్ మీదకు విసురుతాడు. ఎంత ఎక్కువ పదార్థం సీలింగ్‌కు అంటుకుంటే వారికి ఆ ఏడాది అంత ఎక్కువ సంపద కలిసి వస్తుందని నమ్మకం.
అక్కడ జనవరి 7న..
ప్రపంచమంతా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకొంటే.. రష్యా, ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు. ఆర్థోడాక్స్ సంప్రదాయాలు పాటించే చర్చిల్లో దాదాపు 40 రోజుల ముందుగానే ఈ వేడుకలు ప్రారంభిస్తారు. జనవరి 6 సాయంత్రం తొలి నక్షత్రం కనిపించేంత వరకూ ప్రార్థనలు జరుపుతారు.
దెయ్యాల భయంతో..
క్రిస్మస్ రోజున చీపుర్లను, ఇంటిని శుభ్రం చేసే వస్తువులను దాచి పెడతారు నార్వే ప్రజలు. క్రిస్మస్ రోజున దెయ్యాలు, ఆత్మలు చీపుర్ల సాయంతో ఆకాశంలో ఎగురుతాయని నార్వే ప్రజలు నమ్మకం. అందుకే ఆ రోజున వారు తమ చీపుర్లను దాచి పెడతారు. దెయ్యాలను బెదిరించడం కోసం మగవారు ఆరుబయట నిల్చుని తుపాకి కాలుస్తారు.
బీర్‌తో స్వాగతం
సాధారణంగా అందరూ క్రిస్మస్ రోజున స్వీట్లు, స్నాక్స్‌తో సాంటా క్లాజ్‌కు ఆహ్వానం పలికితే ఐర్లాండ్ ప్రజలు మాత్రం తమ దేశ సంప్రదాయం ప్రకారం బీర్‌తో ఆయనకు స్వాగతం చెబుతారు.
సెలవు రోజుల్లోనే ఎక్కువగా..
క్రిస్మస్‌కు ముందు రోజు రాత్రంతా చదువుకుంటూ కూర్చుంటారు ఐస్‌ల్యాండ్ ప్రజలు. స్నేహితులకు, బంధువులకు కూడా పుస్తకాలనే బహుమతులుగా ఇస్తారు. ఒక సంవత్సరంలో ఐస్‌ల్యాండ్ పబ్లిష్ అయినన్ని బుక్స్ మరే దేశంలోనూ పబ్లిష్ కావు. మిగతా రోజుల్లో కంటే సెలవుల్లో ఇక్కడ ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోతాయి.
Comments
Please login to add a commentAdd a comment