* కేంద్ర మంత్రి అనంతకుమార్
సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో మహిళా సేవా సమాజ ఉన్నతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ‘స్వచ్ఛభారత్-హసిరుభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్-హసిరుభారత్‌లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేషనల్ కళాశాల క్రీడా మైదానంలో 10 వేల మంది పిల్లలు ఒకే చోట చేరి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తారన్నారు.
అదేవిధంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకూ పిల్లల్లో భారతీయ సంస్కృతి, కళలు తదితర విషయాల పై అవగాహన కల్పించడం కోసం అదమ్య చేతన సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో చిత్రలేఖనం, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతకుమార్ తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. కార్యక్రమంలో అదమ్య చేతన వ్యవస్థాపక అధ్యక్షురాలు తేజశ్వినీ అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం
Published Mon, Nov 17 2014 3:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement