December 31 midnight
-
కారు కింద ఇరుక్కుందని తెలుసట!
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు. సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం
* కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో మహిళా సేవా సమాజ ఉన్నతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ‘స్వచ్ఛభారత్-హసిరుభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్-హసిరుభారత్లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేషనల్ కళాశాల క్రీడా మైదానంలో 10 వేల మంది పిల్లలు ఒకే చోట చేరి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తారన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకూ పిల్లల్లో భారతీయ సంస్కృతి, కళలు తదితర విషయాల పై అవగాహన కల్పించడం కోసం అదమ్య చేతన సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో చిత్రలేఖనం, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతకుమార్ తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. కార్యక్రమంలో అదమ్య చేతన వ్యవస్థాపక అధ్యక్షురాలు తేజశ్వినీ అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.