
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు.
సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment