Drags Body
-
కారు కింద ఇరుక్కుందని తెలుసట!
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు. సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
బీహార్ పోలీసుల కాఠిన్యం...
వైశాలిః ఖాకీల కాఠిన్యం మరోమారు బయటపడింది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో ఓ బాలుడి మెడకు టవల్ చుట్టి ఈడ్చుకెళ్ళిన రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం మరువక ముందే... బీహార్ పోలీసుల అమానుషత్వం వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్ ద్వారా బీహార్ పోలీసుల అమానుషత్వం బయట పడింది. ఓ మృత దేహం మెడకు తాడు కట్టి వందల మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళిన ఘటన.. దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు... బాడీని బయటకు తీసి పోలీసులకు రిపోర్టు చేశారు. అయితే పిలిచిన రెండు గంటల తర్వాత ఉత్త చేతుల్తో తీరిగ్గా వచ్చిన పోలీసులు.. అంబులెన్స్ గానీ, వర్కర్స్ ను గానీ వెంటబెట్టుకు రాకపోగా.. మృతదేహం మెడకు తాడు చుట్టి వందలమీటర్ల దూరంలో నిలిపిన వాహనం వరకూ ఈడ్చుకుంటూ వెళ్ళారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దారుణ దృశ్యాలను బట్టి వందలమంది చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియో వివరాలు వైరల్ కావడంతో పై అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇదే జిల్లాలో కొన్నేళ్ళక్రితం జరిగిన ఘటనలో కొందరు అల్లరిమూకల కారణంగా మృతి చెందిన పదిమందిని దహనం చేయాలని పేర్కొన్నా... పోలీసులు వారిని నదిలో విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటువంటి ఘటనలెన్నో పోలీసుల కాఠిన్యానికి నిదర్శనంగా నిలవడంతోపాటు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.