తిరుపతి : ప్రాథమిక విద్యా స్థాయి నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలని ఎస్వీయూ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.కృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటైన క్లస్టర్ లెవెల్ సోషియల్ సైన్స్ ఎగ్జిబిషన్, జాతీయ సమైక్యతా శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మార్పులు అవసరమన్నారు.
మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్న విద్యార్థులకు దేశం గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, సంస్కృతి సంప్రదాయాలను నేర్పడానికి కేంద్రీయ విద్యాలయాలు కృషి చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ, సంప్రదాయ నృత్యం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
క్లస్టర్ లెవెల్ పోటీల్లో విజేతలు డిసెంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్ బేగంపేటలో జరిగే రీజనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. తిరుపతి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 2014 సెంట్రల్ సీనియర్ సెకండరీ, సెంట్రల్ సెకండరీ సర్టిఫికెట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించారన్నారు. అనంతరం తిరుపతి, వెంకటగిరి, ఒంగోలు, సూర్యలంక, గుంటూరు, నెల్లూరు కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నమూనాల ఎగ్జిబిషన్‌ను కృష్ణారెడ్డి ప్రారంభించారు.
ప్రదర్శనలో స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్న ధీర వనితల చిత్రపటాలు, స్మార్ట్‌సిటీ నమూనాలు, ఈజిప్టు దేశానికి చెందిన పిరమిడ్లు, పగోడాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధిచిన నమూనాలు చోటు చేసుకున్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం గా విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పాలి
Published Sat, Oct 18 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement