కజన్ పర్యాటక విశేషాల ఖజానా! | kazan tourism reports treasery | Sakshi
Sakshi News home page

కజన్ పర్యాటక విశేషాల ఖజానా!

Published Sun, Jan 12 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

కజన్ పర్యాటక విశేషాల ఖజానా!

కజన్ పర్యాటక విశేషాల ఖజానా!

విహారం
 ఒకే నగరం అనేక విశేషాలు...
 రెండు పెద్ద నదుల సంగమం, అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక రవాణా సదుపాయం, ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, అద్భుతమైన చారిత్రక సంపద, మోడ్రన్ లైఫ్ స్టైల్, సంప్రదాయాలు, నమ్మకాలు... మత ఘర్షణల రహితం.. ఇన్ని భిన్న విశేషాలకు ఒకే నగరం కేంద్రం కావడం చాలా అరుదైన విషయం. 2015లో ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్, 2018లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఇక్కడ జరగనున్నాయి. 2013లో ఇక్కడ వరల్డ్ యూనివర్సియాడ్ జరిగింది. దీంతో ఇపుడు రష్యా క్రీడా రాజధాని అని కూడా పిలుస్తున్నారు.
 
 
 ఒక మనిషిలో ఎన్నో భావోద్వేగాలు. మరెన్నో సృ్మతులు.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు.. ఉంటే ఆ మనిషిది పరిపూర్ణ జీవితం.ఒక నగరానికి ఎంతో చరిత్ర, మరెంతో ఖ్యాతి... అంతకుమించిన సంస్కృతి, సదుపాయాలు ఉంటే ఆ నగరానిది పరిపూర్ణత్వం.
 ఈ కోణంలో చూస్తే రష్యాలో కజన్ నగరానికి ఓ పరిపూర్ణత ఉంది. ఎందుకంటే దానికి చెప్పుకోదగిన చరిత్ర ఉంది. ఎంతో ఖ్యాతి ఉంది. అన్ని కోణాల్లో ఆకట్టుకుంటున్న ఆ నగరం విశిష్టతల సమాహారమిది.
 రష్యా.. అంటే గుర్తొచ్చే నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్... మరి అవేనా గొప్పవి అంటే బయటివారికి తెలిసినంత వరకు అవే గొప్పవి. కానీ వాటితో ఎందులోనూ తీసిపోని నగరం ‘కజన్’. ఇంకా చెప్పాలంటే వాటికి మించిన కొన్ని విభిన్నతలు కూడా ఇక్కడున్నాయి. దీన్ని ‘రష్యా మూడో రాజధాని’ అని అధికారికంగా పిలుస్తారు అంటే మీకు ఆ నగరం స్థాయేంటో సులువుగా అర్థమవుతుంది.
 
 నది ఒడ్డున జీవించడమే ఒక అదృష్టం. కజన్ ప్రజలకు ఆ లెక్కన అదృష్టం రెట్టింపుగా ఉందేమో. ఎందుకంటే అది కజంకా, వోల్గా అనే రెండు నదుల ఒడ్డున, అవి రెండూ కలిస సంగమం వద్ద ఉంది. నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యమది. ఇలాంటి దృశ్యం చాలా తక్కువగా చూస్తాం. రష్యా ఉత్తర ధృవం వైపు ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు కొంతకాలం మైనస్ డిగ్రీలకు కూడా పడిపోతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఏప్రిల్-అక్టోబరుల మధ్య సందర్శిస్తే బాగుంటుంది. నది నుంచి వచ్చే చల్లని గాలులకు సేదదీరుతూ నగరం హొయలను అలా చూస్తూ స్థానిక చిరుతిళ్లు తింటూ గడిపేయడం ఒక మంచి అనుభూతి. ఇక్కడ వినోదం కోసం ఏర్పాటుచేసిన బోటింగ్‌తో పాటు రష్యాలోని కొన్ని నగరాల నుంచి పడవ ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రెండు నదులున్నా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏవైపునకు ఆ వైపు కంజకా నది పై ఐదు బ్రిడ్జిలు నిర్మించారు.
 
 క్రీ.శ.1005లో ఏర్పడిన ఈ నగరానికి 2005లో మిలీనియం ఉత్సవాలు జరిపారు. ఉత్సవాలు జరపడం అంటే ఏమిటో వారిని చూసే నేర్చుకోవాలి. మిలీనియంను పురస్కరించుకుని నగరంలో ఏకంగా మిలీనియం బ్రిడ్జి కట్టారు. దానిపై ‘ఎం’ ఆంగ్ల అక్షరం ఆకారంలో పెద్ద పైలాన్ ఏర్పాటుచేశారు. నగరంలో అన్ని చారిత్రక, ప్రభుత్వ ఆస్తులన్నిటినీ రినోవేట్ చేశారు. మెట్రో ఏర్పాటు చేసుకున్నారు. వారధులు నిర్మించుకున్నారు... బహుశా మిలీనియం ఉత్సవాలు ఇంత సంపూర్ణంగా మరెవరూ నిర్వహించి ఉండరు. ఇవి స్థానిక అవసరాలను తీర్చేవిగానే కాకుండా పర్యాటకులకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సందర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.
 
 పాత - కొత్తల కలయిక క్రెమ్లిన్
 కజన్‌లోని క్రెమ్లిన్... టాటర్‌స్తాన్ రాష్ట్ర పాలన వేదిక. ఇది వెయ్యేళ్ల క్రితం నాటి భవనం. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భతంగా ఉంది. వెయ్యేళ్ల క్రితం కట్టిన ఈ భవనాన్ని వందేళ్ల క్రితం పునరుద్దరిస్తే మిలీనియం ఉత్సవాల సందర్భంగా దాని స్వరూపం మారకుండానే ఆధునికీకరించారు. ఈ భవనంలోకి పర్యాటకులను అనుమతిస్తారు. ఇది అతిపెద్ద ఆవరణ. అందులో తిరుగుతూ అలనాటి నిర్మాణశైలిని గమనిస్తూ ఉంటే మధ్యయుగాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆధునిక సదుపాయాలు అన్నీ కన్పిస్తూ ఉంటాయంతే. ఇదే ఆవరణలో ఓ పెద్ద మసీదు ఉంది. అది కూడా ఈ భవనం వయసులో ఉన్నదే. క్రెమ్లిన్ చారిత్రక గొప్పదనాన్ని గుర్తించి యునెస్కో దానిని ప్రపంచ వారసత్వపు సంపద జాబితాలో చేర్చింది. ఇది కంజకా నది పక్కన ఉండటం వల్ల ఇక్కడి నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ రైల్వేస్టేషన్, ఆధ్మాత్మిక కేంద్రాలు, భవనాలు అన్నీ చారిత్రక సాక్ష్యాలుగా నిలవగా... తాజా నిర్మాణాలు, అభివృద్ధి నాగరికతకు సూచికలవుతున్నాయి.
 
 ఇటీవల నిర్మించిన ‘కజన్ స్మార్ట్ సిటీ’ ఒక డ్రీమ్ ప్లేస్. ఇది ఆర్థిక ఉపాధి కేంద్రం. నగరానికి చివరన నిర్మించిన ఈ స్మార్ట్ సిటీ పూర్తి ఆధునిక కేంద్రం. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, గేమ్ సెంటర్లు, విజిటర్ ప్లేస్‌లు, అమ్యూజ్‌మెంట్లు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రతిదీ అబ్బరం అనిపిస్తుంది. ఇంత విశాలమైన కేంద్రం నగరంలో నిర్మిస్తే ఎన్నో చారిత్రక కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో దీన్ని శివారున ఏర్పాటుచేశారు. అభిరుచులను బట్టి ఇక్కడ వినోదాన్ని పొందవచ్చు.
 
 గొప్ప సహజీవనం...
 కజన్ నగరంలో అనేక మతాల ప్రజలు ఉన్నా... ఎక్కువ మంది ముస్లింలు, క్రిస్టియన్లు. కానీ ఇక్కడ మతఘర్షణలు అత్యంత అరుదు. రెండు మతాల మధ్య శాంతి సహజీవనం అద్భుతంగా ఉంది.  భిన్నసంప్రదాయాలకు నెలవు. ఇక్కడ ఉన్న మూడు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా పర్యాటక ప్రదేశాలు కావడం మరో అరుదైన విషయం. రష్యాలోని అతిపెద్ద మసీదు ఖోల్‌షరీఫ్ ఇక్కడే ఉంది. దీనిని బయటి నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో... లోపల నుంచి చూస్తే అంతకు రెట్టింపు మనోహరంగా లోపల డోమ్‌తో సహా ప్రతి గోడ అత్యద్భుతమైన కళాఖండాలతో అలరారుతుంటుంది. చరిత్ర అన్ని నగరాలకు ఉంటుంది. కానీ కజన్‌కు మాత్రం నిగనిగలాడుతూ ఉంటుంది. నగరంలోని క్యాథలిక్ చర్చి కూడా అత్యద్భుతమైన నిర్మాణతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా ఇది చల్లగా ఉంటుంది.
 
 అద్భతమైన ఆలోచన.. సర్వమత ఆధ్యాత్మిక కేంద్రం
 టెంపుల్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్... కజన్ కేరాఫ్ అడ్రెస్‌లలో ఒకటి. ఇది కజన్‌కు చెందిన ఓ ఆర్టిస్టు ఊహకు వాస్తవ రూపం. పద్దెనిమిది మతాల కేంద్రం. ఈ టెంపుల్‌లో 18 శిఖరాలకు 18 మతాల గుర్తులుంటాయి. ఇందులోకి అన్నిమతాల వారు వస్తారు. అన్ని మతాలకు చెందిన ఆధ్మాత్మిక చిహ్నాలుంటాయి. ఇది ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది.
 
 చేరుకోవడం చాలా సులువు
 కజన్ నగరానికి లేని రవాణా సదుపాయమంటూ లేదు. రష్యాలోని అన్ని నగరాల నుంచి ఇక్కడికి విమానాలున్నాయి. కజన్ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ సర్వీసులు నడిచే విమానాశ్రయం. రష్యా రాజధాని మాస్కో నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు. కానీ కేవలం పది గంటల్లో చేరుకోగలిగిన ఆధునిక రైలు రవాణా ఉంది. నిరంతరం విమానాలుంటాయి. బస్సు ద్వారా, బోటు ద్వారా కూడా చేరుకోవచ్చు. స్విస్ హోటల్ లాంటి నది ఒడ్డున వెలిసిన ఐదు నక్షత్రాల హోటల్స్‌తో పాటు అన్ని రకాల హోటల్స్ ఇక్కడ ఉన్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement