play grounds
-
Holi Celebrations Photos: హుడా ప్లే గ్రౌండ్లో హోలీ వేడుకలు (ఫోటోలు)
-
ఆటలకు చోటేది..? 135కోట్ల జనాభా.. ఒలింపిక్స్‌లో 7 పతకాలేనా?
135కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో 7 పతకాలేనా? అమెరికా, చైనా, జపాన్‌లు సాధించినన్ని పతకాలు గెలవడానికి మనకెన్ని సంవత్సరాలు పడుతుంది? అవునూ.. మనకెందుకు పతకాలు రావు? ఎందుకు రావో ఈ స్కూల్ ఆటస్థలం దుస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.. ఇది జూలూరుపాడు మండలం పాపకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనికి 1992లో దాత ముళ్లపాటి సీతాపతిరాజు 3 ఎకరాల భూమి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది క్రమంగా కబ్జా అవుతోంది. స్కూల్‌కు ఇచ్చిన స్థలం కబ్జా అవుతోందని, మూడు ఎకరాల్లో ఇప్పుడు రెండు ఎకరాలు కూడా లేదని స్కూల్ కమిటీ చైర్మన్లు శ్రీనాథరాజు, శ్రీనివాసరాజు తెలిపారు. స్థలం కబ్జా విషయమై అధికారులకు వినతిపత్రాలు అందజేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల దుస్థితి ఇదే. కొన్ని స్కూళ్లకు అసలు క్రీడా స్థలమే లేదు. సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: చిన్నప్పటి నుంచే విద్యార్థుల అభీష్టాన్ని అర్థం చేసుకొని వారు ఏ క్రీడల్లో రాణిస్తారో తెలుసుకొని సరైన శిక్షణ ఇప్పిస్తే ప్రపంచ స్థాయి పోటీల్లో ఎవరికైనా పతకాలు సాధించడం సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆడుకునేందుకు మైదానాలే ఉండటం లేదు. ప్రైవేటు స్కూళ్లు ఇరుకు గదుల్లో, చీకటి కుహూరాల్లో బోధనకే పరిమితం అవుతున్నాయి. వాటిల్లో క్రీడల గురించి పట్టించుకునే పరిస్థితే ఉండటంలేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు మనకు తయారుకావడంలేదు. పుస్తకాలతో కుస్తీ తప్ప క్రీడల్లో రాణించే పరిస్థితి కనిపించడంలేదు. 25% స్కూళ్లకు మైదానాలు లేవు రాష్ట్రంలో ప్రభుత్వ, సంక్షేమ రెసిడెన్షియల్, నవోదయ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కలిపి 40,898 ఉన్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు వాటిల్లో చదువుతున్నారు. ప్రస్తుతమున్న స్కూళ్లలో 30,126 పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన 10,772 (పావు వంతు) స్కూళ్లలో ఆటస్థలాలు లేవు. మైదానాలున్న వాటిల్లో 19,486 ప్రభుత్వ పాఠశాలలు, 10,630 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 3,042 పాఠశాలల ప్రాంగణాల్లో మైదానాలు లేవు. కానీ ప్రభుత్వ పార్కు లేదా క్రీడాస్థలాన్ని పాఠశాలలకు అనుబంధంగా చూపించారు. ఇక ప్రైవేటు పాఠశాలలు చూపించిన అనేక క్రీడామైదానాలు చాలావరకు కాకిలెక్కలేనని అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలలు తప్ప పట్టణాల్లో మాత్రం చాలావరకు మైదానాలు లేవు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలకు ప్రహారీలు లేక అవి ఆక్రమణలకు గురై విద్యార్థులు ఆడుకునే పరిస్థితి ఉండట్లేదు. ఒక అంచనా ప్రకారం దాదాపు 2 వేల పాఠశాలల ఆటస్థలాలు కబ్జాకు గురవడమో లేదా ప్రహారీ లేక జంతువులు సంచరించడమో జరుగుతోందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు హైస్కూళ్లకు దాదాపు 2,500 పీఈటీ పోస్టులు ఉండగా వాటిల్లో దాదాపు 550 వరకు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ వర్గాలు అంటున్నాయి. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలోని ఆక్రమణలో ఉన్న పాఠశాల స్ధలం వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదీ... ►ఆసిఫాబాద్ జిల్లాలో 75 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు కేటాయించడం క్రీడాకారుల పాలిట శాపంగా మారింది. ►మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం పిల్లర్ల వరకు తవ్వాక స్థల వివాదం తలెత్తి వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. ►ఖమ్మం జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మైదానాలు లేక క్రీడాకారులకు నిరాశే మిగులుతోంది. అదే ప్రైవేటు కళాశాలల్లో ఎక్కడా క్రీడా మైదానాలు లేవు. ►సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉన్న దాదాపు 7 ఎకరాల స్థలంలో ఇప్పటికే 3 ఎకరాలు ఆక్రమణకు గురైంది. పాఠశాలల్లో క్రీడలు నిర్వీర్యం మూడేళ్ల నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడలు నిర్వీర్యం అయ్యాయి. పాఠశాలల క్రీడల నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినా ఇంత వరకు రాష్ట్ర స్థాయి నుంచి నిధులు మంజూరు కాలేదు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. – పుట్టా శంకరయ్య, కార్యదర్శి, ఆర్చరీ అసోసియేషన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదు... ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కనీసం ప్రాక్టీస్ చేసేందుకు కనీసం గ్రౌండ్ లేదు. గతంలో ఆటస్థలం ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడంతో ఆర్మీలోకి ఆరుగురు ఎంపికయ్య్రాు. క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవట్లేదు. – బుదాడి కుమార్, రాష్ట్రస్థాయి గోల్డ్ మెడలిస్ట్ -
ఆటవిడుపేది?
ఇబ్రహీంపట్నంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 1,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల అనుమతి పొందేటప్పుడు ఆట స్థలం ఉన్నట్టు పత్రాలు సమర్పించారు. అయితే గత నెల 30వ తేదీన డీఈఓ రాజ్యలక్ష్మి స్కూల్‌ను తనిఖీ చేయగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఆ పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదు. రోడ్డుపైనే పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. ఇదేంటి అనుమతి పొందిన సమయంలో మీకు ఆట స్థలం ఉన్నట్టు రికార్డుల్లో ఉంది కదా.. అని డీఈవో సమగ్రంగా విచారించగా.. స్కూల్‌కు ఆనుకొని ఉన్న రహదారినే ఆట స్థలంగా చూపి అనుమతి పొందినట్లు తేలింది. విజయవాడ కృష్ణలంకలోని ఓ కార్పొరేట్ స్కూల్ బ్రాంచ్‌లో చదువుతున్న విద్యార్థులు ఆటలు ఆడాలన్నా, మానసిక ఉల్లాసం కోసం మరేదైనా చేయాలన్నా కనకదుర్గ వారధి నుంచి విజయవాడ బస్టాండ్‌కు ఉన్న సర్వీస్ రోడ్డు ఎక్కాల్సిందే. ఈ పాఠశాలకు ప్లే గ్రౌండ్ కాదు కదా కనీసం ప్రార్థన చేయటానికి పది అడుగుల స్థలం కూడా లేని దుస్థితి. జిల్లాలో వందలాది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి ఇదే.. స్కూల్ ప్రారంభించేటప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులు పొందుతూ..ఆ తర్వాత విద్యార్థులను ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా మార్చేస్తూ.. అమూల్యమైన బాల్యాన్ని హరించేస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులను కేవలం ర్యాంకులు తెచ్చే సాధనాలుగానే యాజమాన్యాలు చూస్తున్నాయి. వారిలో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో పిల్లల్లో మానసికోల్లాసం కరువైంది. నిత్యం ఒత్తిడితోచిత్తు అవుతున్నారు. పాఠశాల స్థాయిలో జోనల్, మండల క్రీడా పోటీలు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే పాల్గొని విజేతలవుతుంటారు. కార్పొరేట్ పాఠ శాలల్లో చదివే విద్యార్థులకు క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా అవకాశమివ్వరు. వారి దృష్టంతా చదువుల మీదే ఉంచాలంటారు. దీనికి తోడు కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను నిత్యం హోంవర్కు, స్లిప్ టెస్ట్‌ల పేరుతో కట్టడి చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో అనుమతులు...? జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 1,342 ఉండగా.. వాటిల్లో 4,10,705 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానం తప్పని సరి అని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు పత్రాలతో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభించే వారు అనుమతుల కోసం వెళ్లేటప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలి. ఉన్నతాధికారులు వీటిని చూసి అనుమతులు మంజూరు చేయాలి. కానీ పాఠశాలలు తనిఖీ చేసేటప్పుడు గమనించిన దాఖలాలు లేవు. మరికొన్ని అనుమతుల సమయంలో దగ్గర్లో ఖాళీగా ఉన్న మైదానాలను చూపి పర్మిషన్లు పొందుతున్నారు. అనుమతులు ఇచ్చిన తర్వాత ఆవేవి కనిపించడం లేదు. -
ఆటలకు దూరం..!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం. చదువుపైనే ధ్యాస పెడుతున్న విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎంతగానో నష్టపోతున్నారు. జిల్లాలోని సర్కార్ బడుల్లో వ్యాయామ విద్య అందడం లేదు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీలు ఉన్నా అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తుండగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీల నియామకం లేకపోవడంతో వ్యాయామ విద్య అటకెక్కింది. చదువు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు అవసరమని ఉపాధ్యాయ వర్గాలు, వైద్యులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఉపాధ్యాయులు వారికి ఆటలు ఆడిస్తున్నారు. కానీ ఆటల్లో నియమ నిబంధనలు, రక్షణ చర్యలు తెలియకపోవడంతో ఆయా ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడా మైదానంలో వదిలేస్తున్నారు. దీంతో ఇష్టం వచ్చినట్లు ఆటలాడిన విద్యార్థులు గాయాలపాలవుతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు మరుగునపడిపోతున్నారు. జీవోలు జారీ తప్ప అమలేది..! జీవోలు జారీ చేయడమే తప్ప వాటి అమలు పర్యవేక్షణపై అటు ప్రభుత్వాలు, ఇటు అధికారుల్లో చిత్తశుద్ధి కానరావడం లేదు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పాటు కోసం వ్యాయామ విద్య, క్రీడలు, నైతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న తల్లిదండ్రుల విన్నపాన్ని మన్నించిన గత ప్రభుత్వం జూలై 2012లో జీవో నంబర్ 63 విడుదల చేసింది. ప్రతి రోజు పిరియడ్ వ్యాయామ విద్యకు కేటాయించాలని అప్పటి సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ ఆదేశా>లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం స్వాగతించాయి. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైన పీఈటీ, పీడీలు లేకపోవడంతో అమలుకు నోచుకోవడం లేదు. ఆట స్థలాలు, క్రీడా సామగ్రి ఏది.. జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 65 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 18 మండలాల్లో కేవలం 47 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలో 49 పాఠశాలలకు మాత్రమే పోస్టులను కేటాయించారు. కాగా 19 పీడీ పోస్టులకు గాను 15 మంది, 30 పీఈటీ పోస్టులకు గాను 27 మంది పని చేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పక్కన పెడితే, 53 ఉన్నత పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కేటాయించకపోవడం గమనార్హం. వీటిలో సగానికి పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. దీంతో అయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మరో పక్క చాలా స్కూళ్లలో క్రీడా సామగ్రి లేదు. విద్యార్థులే క్రీడా సామగ్రిని ఇంటి నుంచి తెచ్చుకుని ఆడుకుంటున్నారు. క్రీడలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో క్రీడలు మరుగునపడుతున్నాయి. త్వరలో టీఆర్టీ ద్వారా భర్తీ కానున్నాయి జిల్లాలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీకానున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫిక్టెట్లను పరిశీలించడం జరిగింది. దాదాపు నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆదిలాబాద్ -
ఆటల్లేవ్
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులకు కాస్తంత ఆటవిడుపు తప్పనిసరి. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉన్నప్పుడే అర్యోవంతమైన సమాజం ఏర్పడుతుంది. దీనిని చాలామంది తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆటపాటలకు దూరమవుతున్నారు. దీంతో బాల్యం నాలుగు గోడల మధ్య బంధీ అవుతోంది. చదువుతోపాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే విద్యార్థుల్లో సృజన వెల్లివిరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. ధర్మవరం: జిల్లాలో మొత్తం 5,137 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు 5,78,791 మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు. 40 శాతం పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు ఉన్నాయి. క్రీడామైదానాలు ఉన్నవాటిలో కూడా 20 శాతం పాఠశాలల్లో మాత్రమే ఆటలు ఆడించే పీఈటీలు ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 246 పాఠశాలలు ఉండగా వాటిలో 20 వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు. బత్తలపల్లి మండలంలో మొత్తం 43 పాఠశాలలు ఉండగా వాటిలో మూడు పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు, పీఈటీల సౌకర్యం ఉంది. మిగిలిన అన్నింటీలోనూ ఆటస్థలాలు లేవు. ధర్మవరం పట్టణ, మండల పరిధిలో మొత్తం 122 పాఠశాలలు ఉండగా వాటిలో 20 పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు ఉన్నాయి. వాటిలో కూడా 10 పాఠశాలల్లో మాత్రమే పీఈటీలు ఉన్నారు. ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో 64 పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటుదీ అదే బాట వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,274 ప్రైవేటు పాఠశాలలకు గాను 10 శాతం పాఠశాలలకు క్రీడామైదానాలు లేవంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆయా పాఠశాలల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. మిగిలిన వాటిలో ప్రైవేటు పీఈటీలు ఉండగా, వారు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులను క్యూలో నిల్చోబెట్టడం, ప్రాంగణంలో విద్యార్థులు అల్లరి చేయకుండా చూడడానికే తప్ప వారితో ఆటలు ఆడించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలల్లో అయితే నిరంతరం బట్టీలు పట్టించేందుకు ఈ పీఈటీలను వినియోగించుకుంటున్నారు కానీ, వారితో ఏనాడూ ఒక్క ఆట ఆడించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తికాదు. ♦ ఇక ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 100కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 10 పాఠశాలలకు మించి క్రీడామైదానాలు లేవంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా పట్టణంలో నారాయణ, భాష్యం, రవీంద్రభారతి, శ్రీచైతన్య తదితర కార్పొరేట్ సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేశాయి. అయితే వాటిలో ఏ ఒక్క పాఠశాలకు కూడా క్రీడామైదానం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. కనిపించని మినీ స్టేడియాలు గ్రామీణ యువతను క్రీడలపై ఆసక్తి పెంపొందించి వారిలో నైపుణ్యం వెలికి తీసేందుకు పైకాలో భాగంగా ప్రతి మండల కేంద్రంలోనూ రూ.2కోట్లతో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అయితే స్థల సేకరణ, ఇతరత్రా కారణాలతో ఆ ప్రకటన మరుగున పడిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ మినీ స్టేడియాల గురించే ఆలోచించలేదు. ప్రయోజనాలెన్నో.. ఆటలాడేటప్పుడు శరీరం, మనస్సు ఒకేలా స్పందించి చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆటల వల్ల స్నేహబంధం, క్రమశిక్షణ పెంపొందుతాయంటున్నారు. ముఖ్యంగా ఆటల వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందని, క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవడం, పోటీతత్వం విద్యార్థుల్లో పెరుగుతుందని చెబుతున్నారు. -
లవ్లీ ప్లేయో ఆడేద్దాం యో..యో..
హిమాయత్‌నగర్: ప్రసాద్ బ్యాచ్‌కి క్రికెట్ అంటే ఇష్టం.. జోసెఫ్ అండ్ ఫ్రెండ్స్‌కు టెన్నిస్ అంటే ప్రేమ.. రమేష్‌కు వాలీబాల్ అంటే మక్కువ. చదువుకునే రోజుల్లో స్కూలు, కాలేజీ గ్రౌండ్స్‌లో ఆడుకున్న ఆనందమే.. ఉద్యోగం, వ్యాపారం వంటి వ్యాపకాల్లో పడిపోయాక ఆ అవకాశమే లేకుండా పోయింది. వీకెండ్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడన్నా ఆడుకుని పాత రోజులను గుర్తు చేసుకోవాలనుకున్నా.. మహానగరంలో కుదరనిపని. ఎందుకంటే ఈ బ్యాచ్ గ్రౌండ్స్‌కు వెళ్లేసరికే అక్కడ ఇంకెవరో ఆడుకుంటూ కనిపిస్తారు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఇలాంటి క్రీడాభిమానుల కోరిక నెరవేరుస్తుంది ‘ప్లేయో’ సంస్థ. మీ నగరంలోనే గ్రౌండ్‌ను మేం సెట్ చేస్తాం.. ఆనందంగా ఆడుకోండి అంటోంది. మనకు నచ్చిన ఆటను నగరంలోని ప్రముఖ ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల్లో ఆడుకునే వెసులుబాటును కల్పిస్తోందీ సంస్థ. ఇందుకోసం ఓ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన గౌరవ్ జిత్‌సింగ్, అమిత్ రౌషన్, కార్తీక్ ఇగూర్, దానియా సుహాయిల్, ఉమాశంకర్ వ్యాపారులు. అయితే వీరికి ఆటలంటే చాలా ఇష్టం. వీరి గ్రూప్ ఆడుకునేందుకు అనువైన గ్రౌండ్ లేక ఇబ్బంది పడేవారు. తమ లాగే మెట్రో నగరాల్లో ఎంతోమంది ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గుర్తించిన వీరు.. అన్ని నగరాలను ఓ వేదికగా మార్చి.. ‘ప్లేయో’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆడుకుందామని భావించేవారు ఈ సంస్థను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న నగరాల్లో నచ్చిన సమయంలో ఏ గ్రౌండ్ ఖాళీగా ఉందో సూచిస్తుంది. తొలుత బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సేవలు అందించిన ‘ప్లేయో’.. ఇటీవలే మన నగరంలో సైతం తన సేవలను విస్తరించింది. ఆట మీది.. వేదిక మాది.. నచ్చిన సమయంలో ఆట ఆడాలనుకునే వారు ముందుగా ‘p ్చyౌ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిష్టర్ కావాలి. తరువాత సిటీని ఎంచుకుని, ఏయే ఆటలు కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు. అధికారికంగా రిజిష్టర్ అయ్యాక ఆడాలనుకున్న వారు ఈ యాప్ ద్వారా గ్రౌండ్‌ను బక్ చేసుకోవచ్చు. గంట, రెండు గంటలు.. ఇలా ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ఆయా గ్రౌండ్స్‌లో ఆడుకునే వెసులుబాటును ‘ప్లేయో’ కల్పిస్తోంది. ఒక్కో క్రీడకు ఒక్కో గ్రౌండ్.. క్రికెట్, ఆర్చెరీ, బాడ్మింటన్, టెన్నిస్, బేస్‌బాల్ అండ్ సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్లైంబింగ్, ఫీల్డ్హాకీ, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, కరాటే, రోలర్స్పోర్ట్, నెట్‌బాల్, వాలీబాల్.. ఇలా 40కి పైగా క్రీడలు ఆడుకునే వెసులుబాటు ఈ యాప్ అందిస్తోంది. ఈ ఆటలకు అనుసంధానంగా నగరంలోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఉప్పల్, యూసుఫ్‌గూడ, మెహదీపట్నం, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు వంటి ప్రాంతాల్లోని ఇండోర్ ఔట్‌డోర్ గ్రౌండ్స్‌ను ఎంచుకున్నారు. ఆటను బట్టి ధరలు.. క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుడ్‌బాల్, టేబుల్ టెన్నిస్‌తో పాటు మరెన్నో ఆటలు ఆ యాప్ ద్వారా ఆడుకోవచ్చు. బ్యాడ్మింటన్.. గంటకు రూ.400, క్రికెట్‌కు టీం మొత్తానికి రూ.1500, ఫుడ్‌బాల్ టీంకు రూ.1000, టేబుల్ టెన్నిస్‌కు రూ.100 చొప్పున చార్జి చేస్తున్నారు. మరింతగా విస్తరిస్తాం సిటీలో ఈ యాప్ ద్వారా చాలామంది ఆటలు ఆడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు కూడా ఈ కాన్సెప్ట్ బాగుందంటున్నారు. రానున్న రోజుల్లో విజయవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభిస్తాం. దీంతో పాటు క్రీడాకారులకు అవసమైన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – రోణక్, హైదరాబాద్ రీజనల్ మేనేజర్ -
1 నుంచి జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్స్ బుకింగ్స్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను వినియోగించుకోవడానికి, స్విమ్మింగ్‌పూల్స్, ప్లే గ్రౌండ్లలో సభ్యత్వం కోసం ఇక నుంచి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ‘పే అండ్ ప్లే’ కేటగిరీలో నగరంలోని 21 క్రీడా మైదానాలు, 13 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. వీటితో పాటు 14 ఇండోర్ స్టేడియాలు, 9 అవుట్డోర్ స్టేడియాలు, 10 స్విమ్మింగ్పూల్స్లలో సభ్యత్వం కోసం కేవలం ఆన్లైన్లోనే సంప్రదించాలని కోరారు. వేదికల వద్ద ఎలాంటి లావాదేవీలు ఉండవన్నారు. కార్పొరేట్ కేటగిరీలో 21 ప్లేగ్రౌండ్లు, ప్రైవేట్ పాఠశాలల అవసరాల కోసం 521 క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ వివరించారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 1 నుంచి మొదలవుతాయని చెప్పారు. నగరంలో సుమారు 7 వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలుండగా, అందులో 70 శాతం స్కూల్స్‌లో సరైన క్రీడా మైదానాలు లేవన్నారు. జీహెచ్ఎంసీ మైదానాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఉదయం గం. 5–9, సాయంతం గం. 4–7 మధ్య క్రీడాకారులకు ఉచితంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖాళీగా ఉండే మైదానాలను పాఠశాలలు, కార్పొరేట్లకు గంటల వారీగా అద్దెకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. కోచ్‌ల వివరాలు, సభ్యత్వ నమోదుకై జీహెచ్ఎంసీ వెబ్సైట్ జ్టి్టhttp://www.ghmc. gov.in/rportrలో చూడవచ్చన్నారు. -
ప్లేగ్రౌండ్స్ కరువు
పేటలోని పాఠశాలలకు మైదానాలు కరువు దూరమవుతున్న వ్యాయామ విద్య మౌలిక వసుతులు లేక విద్యార్థుల అవస్థలు పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలో కెజివిబి, మోడల్‌స్కూల్‌లతో కలిపి 7 ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికి క్రీడామైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామవిద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ప్రాథమీక విద్యతో పాటు వ్యాయామ విద్య తప్పనిసరి చేయాలని తెలుపుతు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మౌళిక సదుపాయాలను మాత్రం ఏర్పాటు చేయడం మరిచింది. ఏళ్లు గడుస్తున్నా పలు పాఠశాలల్లో మాత్రం మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఆని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి దాదాపు 5వేల 4 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 7 ఉన్నత పాఠశాలల్లో కస్తూర్బా, మోడల్‌స్కూల్‌లతో కలిపి విశాలమైన క్రీడా మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. గతంలో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. పాఠశాలలో పీఈటిలు లేక పోవడంతో విద్యార్థులు ఆటలు ఆడే పరిస్థితి కనిపించడంలేదు. అటు పీఈటిలు ఇటు క్రీడా మైదానాలు లేక పోవడంతో ఆటలు ఎలా ఆడిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామవిద్యకోసం సమయాన్ని కెటాయిస్తున్నా విద్యార్థులకు మాత్రం ఒరిగిందేమి లేదు. క్రీడలకు అవసరమైన నిధులు కెటాయించిక పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగలేక పోతున్నారు. ఆయా పాఠశాలల్లో మైదానాలు లేక విద్యార్థులు ఉన్న చోటే ఆడుకుంటున్నారు. విద్యార్థులను శారీరకంగా , మానసికంగా ఎదిగేందుకు క్రీడలు దోహదం చేస్తాయి. విద్యార్థుల అవసరాలను దష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న పీఈటి పోస్టులను భర్తి చేస్తు, క్రీడా మైదాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం 250 మంది విద్యార్థులకు ఒక పీఈటి ఉండాలనే నిభందన అమలు కావడం లేదు. ప్రతీ ఏటా పాఠశాలలను మాత్రం అప్‌గ్రేడ్ చేస్తున్నా పీఈటీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలలో రాణించలేకపోతున్నారు. గతంలో నిర్వహించిన మండల, తాలుకా, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కజన్ పర్యాటక విశేషాల ఖజానా!
విహారం ఒకే నగరం అనేక విశేషాలు... రెండు పెద్ద నదుల సంగమం, అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక రవాణా సదుపాయం, ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, అద్భుతమైన చారిత్రక సంపద, మోడ్రన్ లైఫ్ స్టైల్, సంప్రదాయాలు, నమ్మకాలు... మత ఘర్షణల రహితం.. ఇన్ని భిన్న విశేషాలకు ఒకే నగరం కేంద్రం కావడం చాలా అరుదైన విషయం. 2015లో ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్, 2018లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఇక్కడ జరగనున్నాయి. 2013లో ఇక్కడ వరల్డ్ యూనివర్సియాడ్ జరిగింది. దీంతో ఇపుడు రష్యా క్రీడా రాజధాని అని కూడా పిలుస్తున్నారు. ఒక మనిషిలో ఎన్నో భావోద్వేగాలు. మరెన్నో సృ్మతులు.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు.. ఉంటే ఆ మనిషిది పరిపూర్ణ జీవితం.ఒక నగరానికి ఎంతో చరిత్ర, మరెంతో ఖ్యాతి... అంతకుమించిన సంస్కృతి, సదుపాయాలు ఉంటే ఆ నగరానిది పరిపూర్ణత్వం. ఈ కోణంలో చూస్తే రష్యాలో కజన్ నగరానికి ఓ పరిపూర్ణత ఉంది. ఎందుకంటే దానికి చెప్పుకోదగిన చరిత్ర ఉంది. ఎంతో ఖ్యాతి ఉంది. అన్ని కోణాల్లో ఆకట్టుకుంటున్న ఆ నగరం విశిష్టతల సమాహారమిది. రష్యా.. అంటే గుర్తొచ్చే నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్... మరి అవేనా గొప్పవి అంటే బయటివారికి తెలిసినంత వరకు అవే గొప్పవి. కానీ వాటితో ఎందులోనూ తీసిపోని నగరం ‘కజన్’. ఇంకా చెప్పాలంటే వాటికి మించిన కొన్ని విభిన్నతలు కూడా ఇక్కడున్నాయి. దీన్ని ‘రష్యా మూడో రాజధాని’ అని అధికారికంగా పిలుస్తారు అంటే మీకు ఆ నగరం స్థాయేంటో సులువుగా అర్థమవుతుంది. నది ఒడ్డున జీవించడమే ఒక అదృష్టం. కజన్ ప్రజలకు ఆ లెక్కన అదృష్టం రెట్టింపుగా ఉందేమో. ఎందుకంటే అది కజంకా, వోల్గా అనే రెండు నదుల ఒడ్డున, అవి రెండూ కలిస సంగమం వద్ద ఉంది. నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యమది. ఇలాంటి దృశ్యం చాలా తక్కువగా చూస్తాం. రష్యా ఉత్తర ధృవం వైపు ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు కొంతకాలం మైనస్ డిగ్రీలకు కూడా పడిపోతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఏప్రిల్-అక్టోబరుల మధ్య సందర్శిస్తే బాగుంటుంది. నది నుంచి వచ్చే చల్లని గాలులకు సేదదీరుతూ నగరం హొయలను అలా చూస్తూ స్థానిక చిరుతిళ్లు తింటూ గడిపేయడం ఒక మంచి అనుభూతి. ఇక్కడ వినోదం కోసం ఏర్పాటుచేసిన బోటింగ్‌తో పాటు రష్యాలోని కొన్ని నగరాల నుంచి పడవ ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రెండు నదులున్నా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏవైపునకు ఆ వైపు కంజకా నది పై ఐదు బ్రిడ్జిలు నిర్మించారు. క్రీ.శ.1005లో ఏర్పడిన ఈ నగరానికి 2005లో మిలీనియం ఉత్సవాలు జరిపారు. ఉత్సవాలు జరపడం అంటే ఏమిటో వారిని చూసే నేర్చుకోవాలి. మిలీనియంను పురస్కరించుకుని నగరంలో ఏకంగా మిలీనియం బ్రిడ్జి కట్టారు. దానిపై ‘ఎం’ ఆంగ్ల అక్షరం ఆకారంలో పెద్ద పైలాన్ ఏర్పాటుచేశారు. నగరంలో అన్ని చారిత్రక, ప్రభుత్వ ఆస్తులన్నిటినీ రినోవేట్ చేశారు. మెట్రో ఏర్పాటు చేసుకున్నారు. వారధులు నిర్మించుకున్నారు... బహుశా మిలీనియం ఉత్సవాలు ఇంత సంపూర్ణంగా మరెవరూ నిర్వహించి ఉండరు. ఇవి స్థానిక అవసరాలను తీర్చేవిగానే కాకుండా పర్యాటకులకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సందర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి. పాత - కొత్తల కలయిక క్రెమ్లిన్ కజన్‌లోని క్రెమ్లిన్... టాటర్స్తాన్ రాష్ట్ర పాలన వేదిక. ఇది వెయ్యేళ్ల క్రితం నాటి భవనం. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భతంగా ఉంది. వెయ్యేళ్ల క్రితం కట్టిన ఈ భవనాన్ని వందేళ్ల క్రితం పునరుద్దరిస్తే మిలీనియం ఉత్సవాల సందర్భంగా దాని స్వరూపం మారకుండానే ఆధునికీకరించారు. ఈ భవనంలోకి పర్యాటకులను అనుమతిస్తారు. ఇది అతిపెద్ద ఆవరణ. అందులో తిరుగుతూ అలనాటి నిర్మాణశైలిని గమనిస్తూ ఉంటే మధ్యయుగాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆధునిక సదుపాయాలు అన్నీ కన్పిస్తూ ఉంటాయంతే. ఇదే ఆవరణలో ఓ పెద్ద మసీదు ఉంది. అది కూడా ఈ భవనం వయసులో ఉన్నదే. క్రెమ్లిన్ చారిత్రక గొప్పదనాన్ని గుర్తించి యునెస్కో దానిని ప్రపంచ వారసత్వపు సంపద జాబితాలో చేర్చింది. ఇది కంజకా నది పక్కన ఉండటం వల్ల ఇక్కడి నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ రైల్వేస్టేషన్, ఆధ్మాత్మిక కేంద్రాలు, భవనాలు అన్నీ చారిత్రక సాక్ష్యాలుగా నిలవగా... తాజా నిర్మాణాలు, అభివృద్ధి నాగరికతకు సూచికలవుతున్నాయి. ఇటీవల నిర్మించిన ‘కజన్ స్మార్ట్ సిటీ’ ఒక డ్రీమ్ ప్లేస్. ఇది ఆర్థిక ఉపాధి కేంద్రం. నగరానికి చివరన నిర్మించిన ఈ స్మార్ట్ సిటీ పూర్తి ఆధునిక కేంద్రం. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, గేమ్ సెంటర్లు, విజిటర్ ప్లేస్‌లు, అమ్యూజ్మెంట్లు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రతిదీ అబ్బరం అనిపిస్తుంది. ఇంత విశాలమైన కేంద్రం నగరంలో నిర్మిస్తే ఎన్నో చారిత్రక కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో దీన్ని శివారున ఏర్పాటుచేశారు. అభిరుచులను బట్టి ఇక్కడ వినోదాన్ని పొందవచ్చు. గొప్ప సహజీవనం... కజన్ నగరంలో అనేక మతాల ప్రజలు ఉన్నా... ఎక్కువ మంది ముస్లింలు, క్రిస్టియన్లు. కానీ ఇక్కడ మతఘర్షణలు అత్యంత అరుదు. రెండు మతాల మధ్య శాంతి సహజీవనం అద్భుతంగా ఉంది. భిన్నసంప్రదాయాలకు నెలవు. ఇక్కడ ఉన్న మూడు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా పర్యాటక ప్రదేశాలు కావడం మరో అరుదైన విషయం. రష్యాలోని అతిపెద్ద మసీదు ఖోల్షరీఫ్ ఇక్కడే ఉంది. దీనిని బయటి నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో... లోపల నుంచి చూస్తే అంతకు రెట్టింపు మనోహరంగా లోపల డోమ్‌తో సహా ప్రతి గోడ అత్యద్భుతమైన కళాఖండాలతో అలరారుతుంటుంది. చరిత్ర అన్ని నగరాలకు ఉంటుంది. కానీ కజన్కు మాత్రం నిగనిగలాడుతూ ఉంటుంది. నగరంలోని క్యాథలిక్ చర్చి కూడా అత్యద్భుతమైన నిర్మాణతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా ఇది చల్లగా ఉంటుంది. అద్భతమైన ఆలోచన.. సర్వమత ఆధ్యాత్మిక కేంద్రం టెంపుల్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్... కజన్ కేరాఫ్ అడ్రెస్‌లలో ఒకటి. ఇది కజన్కు చెందిన ఓ ఆర్టిస్టు ఊహకు వాస్తవ రూపం. పద్దెనిమిది మతాల కేంద్రం. ఈ టెంపుల్లో 18 శిఖరాలకు 18 మతాల గుర్తులుంటాయి. ఇందులోకి అన్నిమతాల వారు వస్తారు. అన్ని మతాలకు చెందిన ఆధ్మాత్మిక చిహ్నాలుంటాయి. ఇది ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. చేరుకోవడం చాలా సులువు కజన్ నగరానికి లేని రవాణా సదుపాయమంటూ లేదు. రష్యాలోని అన్ని నగరాల నుంచి ఇక్కడికి విమానాలున్నాయి. కజన్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ సర్వీసులు నడిచే విమానాశ్రయం. రష్యా రాజధాని మాస్కో నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు. కానీ కేవలం పది గంటల్లో చేరుకోగలిగిన ఆధునిక రైలు రవాణా ఉంది. నిరంతరం విమానాలుంటాయి. బస్సు ద్వారా, బోటు ద్వారా కూడా చేరుకోవచ్చు. స్విస్ హోటల్ లాంటి నది ఒడ్డున వెలిసిన ఐదు నక్షత్రాల హోటల్స్‌తో పాటు అన్ని రకాల హోటల్స్ ఇక్కడ ఉన్నాయి.