ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం. చదువుపైనే ధ్యాస పెడుతున్న విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎంతగానో నష్టపోతున్నారు. జిల్లాలోని సర్కార్ బడుల్లో వ్యాయామ విద్య అందడం లేదు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీలు ఉన్నా అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తుండగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీల నియామకం లేకపోవడంతో వ్యాయామ విద్య అటకెక్కింది. చదువు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు అవసరమని ఉపాధ్యాయ వర్గాలు, వైద్యులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఉపాధ్యాయులు వారికి ఆటలు ఆడిస్తున్నారు. కానీ ఆటల్లో నియమ నిబంధనలు, రక్షణ చర్యలు తెలియకపోవడంతో ఆయా ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడా మైదానంలో వదిలేస్తున్నారు. దీంతో ఇష్టం వచ్చినట్లు ఆటలాడిన విద్యార్థులు గాయాలపాలవుతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు మరుగునపడిపోతున్నారు.
జీవోలు జారీ తప్ప అమలేది..!
జీవోలు జారీ చేయడమే తప్ప వాటి అమలు పర్యవేక్షణపై అటు ప్రభుత్వాలు, ఇటు అధికారుల్లో చిత్తశుద్ధి కానరావడం లేదు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పాటు కోసం వ్యాయామ విద్య, క్రీడలు, నైతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న తల్లిదండ్రుల విన్నపాన్ని మన్నించిన గత ప్రభుత్వం జూలై 2012లో జీవో నంబర్ 63 విడుదల చేసింది. ప్రతి రోజు పిరియడ్ వ్యాయామ విద్యకు కేటాయించాలని అప్పటి సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ ఆదేశా>లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం స్వాగతించాయి. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైన పీఈటీ, పీడీలు లేకపోవడంతో అమలుకు నోచుకోవడం లేదు.
ఆట స్థలాలు, క్రీడా సామగ్రి ఏది..
జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 65 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 18 మండలాల్లో కేవలం 47 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలో 49 పాఠశాలలకు మాత్రమే పోస్టులను కేటాయించారు. కాగా 19 పీడీ పోస్టులకు గాను 15 మంది, 30 పీఈటీ పోస్టులకు గాను 27 మంది పని చేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పక్కన పెడితే, 53 ఉన్నత పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కేటాయించకపోవడం గమనార్హం. వీటిలో సగానికి పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. దీంతో అయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మరో పక్క చాలా స్కూళ్లలో క్రీడా సామగ్రి లేదు. విద్యార్థులే క్రీడా సామగ్రిని ఇంటి నుంచి తెచ్చుకుని ఆడుకుంటున్నారు. క్రీడలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో క్రీడలు మరుగునపడుతున్నాయి.
త్వరలో టీఆర్టీ ద్వారా భర్తీ కానున్నాయి
జిల్లాలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించడం జరిగింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీకానున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫిక్టెట్లను పరిశీలించడం జరిగింది. దాదాపు నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment