135కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో 7 పతకాలేనా? అమెరికా, చైనా, జపాన్‌లు సాధించినన్ని పతకాలు గెలవడానికి మనకెన్ని సంవత్సరాలు పడుతుంది? అవునూ.. మనకెందుకు పతకాలు రావు? ఎందుకు రావో ఈ స్కూల్ ఆటస్థలం దుస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది..
ఇది జూలూరుపాడు మండలం పాపకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనికి 1992లో దాత ముళ్లపాటి సీతాపతిరాజు 3 ఎకరాల భూమి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది క్రమంగా కబ్జా అవుతోంది. స్కూల్‌కు ఇచ్చిన స్థలం కబ్జా అవుతోందని, మూడు ఎకరాల్లో ఇప్పుడు రెండు ఎకరాలు కూడా లేదని స్కూల్ కమిటీ చైర్మన్లు శ్రీనాథరాజు, శ్రీనివాసరాజు తెలిపారు. స్థలం కబ్జా విషయమై అధికారులకు వినతిపత్రాలు అందజేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల దుస్థితి ఇదే. కొన్ని స్కూళ్లకు అసలు క్రీడా స్థలమే లేదు.
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: చిన్నప్పటి నుంచే విద్యార్థుల అభీష్టాన్ని అర్థం చేసుకొని వారు ఏ క్రీడల్లో రాణిస్తారో తెలుసుకొని సరైన శిక్షణ ఇప్పిస్తే ప్రపంచ స్థాయి పోటీల్లో ఎవరికైనా పతకాలు సాధించడం సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆడుకునేందుకు మైదానాలే ఉండటం లేదు. ప్రైవేటు స్కూళ్లు ఇరుకు గదుల్లో, చీకటి కుహూరాల్లో బోధనకే పరిమితం అవుతున్నాయి. వాటిల్లో క్రీడల గురించి పట్టించుకునే పరిస్థితే ఉండటంలేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు మనకు తయారుకావడంలేదు. పుస్తకాలతో కుస్తీ తప్ప క్రీడల్లో రాణించే పరిస్థితి కనిపించడంలేదు.
25% స్కూళ్లకు మైదానాలు లేవు
రాష్ట్రంలో ప్రభుత్వ, సంక్షేమ రెసిడెన్షియల్, నవోదయ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కలిపి 40,898 ఉన్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు వాటిల్లో చదువుతున్నారు. ప్రస్తుతమున్న స్కూళ్లలో 30,126 పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన 10,772 (పావు వంతు) స్కూళ్లలో ఆటస్థలాలు లేవు. మైదానాలున్న వాటిల్లో 19,486 ప్రభుత్వ పాఠశాలలు, 10,630 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 3,042 పాఠశాలల ప్రాంగణాల్లో మైదానాలు లేవు. కానీ ప్రభుత్వ పార్కు లేదా క్రీడాస్థలాన్ని పాఠశాలలకు అనుబంధంగా చూపించారు. ఇక ప్రైవేటు పాఠశాలలు చూపించిన అనేక క్రీడామైదానాలు చాలావరకు కాకిలెక్కలేనని అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలలు తప్ప పట్టణాల్లో మాత్రం చాలావరకు మైదానాలు లేవు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలకు ప్రహారీలు లేక అవి ఆక్రమణలకు గురై విద్యార్థులు ఆడుకునే పరిస్థితి ఉండట్లేదు. ఒక అంచనా ప్రకారం దాదాపు 2 వేల పాఠశాలల ఆటస్థలాలు కబ్జాకు గురవడమో లేదా ప్రహారీ లేక జంతువులు సంచరించడమో జరుగుతోందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు హైస్కూళ్లకు దాదాపు 2,500 పీఈటీ పోస్టులు ఉండగా వాటిల్లో దాదాపు 550 వరకు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ వర్గాలు అంటున్నాయి.
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలోని ఆక్రమణలో ఉన్న పాఠశాల స్ధలం
వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదీ...
►ఆసిఫాబాద్ జిల్లాలో 75 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు కేటాయించడం క్రీడాకారుల పాలిట శాపంగా మారింది.
►మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం పిల్లర్ల వరకు తవ్వాక స్థల వివాదం తలెత్తి వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి.
►ఖమ్మం జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మైదానాలు లేక క్రీడాకారులకు నిరాశే మిగులుతోంది. అదే ప్రైవేటు కళాశాలల్లో ఎక్కడా క్రీడా మైదానాలు లేవు.
►సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉన్న దాదాపు 7 ఎకరాల స్థలంలో ఇప్పటికే 3 ఎకరాలు ఆక్రమణకు గురైంది.
పాఠశాలల్లో క్రీడలు నిర్వీర్యం
మూడేళ్ల నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడలు నిర్వీర్యం అయ్యాయి. పాఠశాలల క్రీడల నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినా ఇంత వరకు రాష్ట్ర స్థాయి నుంచి నిధులు మంజూరు కాలేదు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు.
– పుట్టా శంకరయ్య, కార్యదర్శి, ఆర్చరీ అసోసియేషన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా
అధికారులు పట్టించుకోవట్లేదు...
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కనీసం ప్రాక్టీస్ చేసేందుకు కనీసం గ్రౌండ్ లేదు. గతంలో ఆటస్థలం ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడంతో ఆర్మీలోకి ఆరుగురు ఎంపికయ్‌య్రాు. క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవట్లేదు.
– బుదాడి కుమార్, రాష్ట్రస్థాయి గోల్డ్ మెడలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment