హిమాయత్‌నగర్: ప్రసాద్ బ్యాచ్‌కి క్రికెట్ అంటే ఇష్టం.. జోసెఫ్ అండ్ ఫ్రెండ్స్‌కు టెన్నిస్ అంటే ప్రేమ.. రమేష్‌కు వాలీబాల్ అంటే మక్కువ. చదువుకునే రోజుల్లో స్కూలు, కాలేజీ గ్రౌండ్స్‌లో ఆడుకున్న ఆనందమే.. ఉద్యోగం, వ్యాపారం వంటి వ్యాపకాల్లో పడిపోయాక ఆ అవకాశమే లేకుండా పోయింది. వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడన్నా ఆడుకుని పాత రోజులను గుర్తు చేసుకోవాలనుకున్నా.. మహానగరంలో కుదరనిపని. ఎందుకంటే ఈ బ్యాచ్ గ్రౌండ్స్‌కు వెళ్లేసరికే అక్కడ ఇంకెవరో ఆడుకుంటూ కనిపిస్తారు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఇలాంటి క్రీడాభిమానుల కోరిక నెరవేరుస్తుంది ‘ప్లేయో’ సంస్థ. మీ నగరంలోనే గ్రౌండ్‌ను మేం సెట్ చేస్తాం.. ఆనందంగా ఆడుకోండి అంటోంది. మనకు నచ్చిన ఆటను నగరంలోని ప్రముఖ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో ఆడుకునే వెసులుబాటును కల్పిస్తోందీ సంస్థ. ఇందుకోసం ఓ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది.
బెంగళూరుకు చెందిన గౌరవ్ జిత్‌సింగ్, అమిత్ రౌషన్, కార్తీక్ ఇగూర్, దానియా సుహాయిల్, ఉమాశంకర్ వ్యాపారులు. అయితే వీరికి ఆటలంటే చాలా ఇష్టం. వీరి గ్రూప్ ఆడుకునేందుకు అనువైన గ్రౌండ్ లేక ఇబ్బంది పడేవారు. తమ లాగే మెట్రో నగరాల్లో ఎంతోమంది ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గుర్తించిన వీరు.. అన్ని నగరాలను ఓ వేదికగా మార్చి.. ‘ప్లేయో’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆడుకుందామని భావించేవారు ఈ సంస్థను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న నగరాల్లో నచ్చిన సమయంలో ఏ గ్రౌండ్ ఖాళీగా ఉందో సూచిస్తుంది. తొలుత బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సేవలు అందించిన ‘ప్లేయో’.. ఇటీవలే మన నగరంలో సైతం తన సేవలను విస్తరించింది.
ఆట మీది.. వేదిక మాది..
నచ్చిన సమయంలో ఆట ఆడాలనుకునే వారు ముందుగా ‘p ్చyౌ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిష్టర్ కావాలి. తరువాత సిటీని ఎంచుకుని, ఏయే ఆటలు కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు. అధికారికంగా రిజిష్టర్ అయ్యాక ఆడాలనుకున్న వారు ఈ యాప్ ద్వారా గ్రౌండ్‌ను బక్ చేసుకోవచ్చు. గంట, రెండు గంటలు.. ఇలా ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ఆయా గ్రౌండ్స్‌లో ఆడుకునే వెసులుబాటును ‘ప్లేయో’ కల్పిస్తోంది.
ఒక్కో క్రీడకు ఒక్కో గ్రౌండ్..
క్రికెట్, ఆర్చెరీ, బాడ్మింటన్, టెన్నిస్, బేస్‌బాల్ అండ్ సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్లైంబింగ్, ఫీల్డ్‌హాకీ, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, కరాటే, రోలర్‌స్పోర్ట్, నెట్‌బాల్, వాలీబాల్.. ఇలా 40కి పైగా క్రీడలు ఆడుకునే వెసులుబాటు ఈ యాప్ అందిస్తోంది. ఈ ఆటలకు అనుసంధానంగా నగరంలోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఉప్పల్, యూసుఫ్‌గూడ, మెహదీపట్నం, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లోని ఇండోర్ ఔట్‌డోర్ గ్రౌండ్స్‌ను ఎంచుకున్నారు.
ఆటను బట్టి ధరలు..
క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుడ్‌బాల్, టేబుల్ టెన్నిస్‌తో పాటు మరెన్నో ఆటలు ఆ యాప్ ద్వారా ఆడుకోవచ్చు. బ్యాడ్మింటన్.. గంటకు రూ.400, క్రికెట్‌కు టీం మొత్తానికి రూ.1500, ఫుడ్‌బాల్ టీంకు రూ.1000, టేబుల్ టెన్నిస్‌కు రూ.100 చొప్పున చార్జి చేస్తున్నారు.
మరింతగా విస్తరిస్తాం
సిటీలో ఈ యాప్ ద్వారా చాలామంది ఆటలు ఆడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు కూడా ఈ కాన్సెప్ట్ బాగుందంటున్నారు. రానున్న రోజుల్లో విజయవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభిస్తాం. దీంతో పాటు క్రీడాకారులకు అవసమైన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – రోణక్, హైదరాబాద్ రీజనల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment