శిరిడీలో బాబా అరవై ఏళ్లపాటు నడయాడితే, ఆ అరవై ఏళ్లపాటూ బాబా వెన్నంటే నడిచిన పునీతుడు మహల్సాపతి. సాయిప్రేమను సంపూర్ణంగా పొందిన మహల్సాపతి సదాచార సంపన్నుడు. సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగినవాడు. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోంచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జి కుక్క ఒకటి ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండు మూడుమార్లు దానిని అదిలించాడు. అయినా అది తన వెనకే రావడంతో విసుగెత్తి కర్ర తీసుకుని ఈడ్చిపెట్టి కొట్టాడు. పాపం ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది.
మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘‘మహల్సా! పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తోంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది?’’ అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. బాబాతో అన్నేళ్లు సావాసం చేసి కూడా మహల్సాపతి ఆ నీతిని గ్రహించలేకపోయాడు. తోటి ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండడం, ఉన్నంతలో సత్కర్మలు ఆచరించడం, చిత్తశుద్ధితో మనసును పరిశుద్ధం చేసుకోవడం... ఇవే భగవంతునికి మనం ఇవ్వగల నివేదనలు.
డా. కుమార్ అన్నవరపు
Comments
Please login to add a commentAdd a comment