విశ్లేషణ
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది.
రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు.
అయోధ్యకే మినహాయింపు
ఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.
అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు.
ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు.
కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
బాధ్యతాయుత చట్టం
పార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.
అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.
అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.
వెనక్కి వెళ్లగలమా?
ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.
నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.
ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.
బర్ఖా దత్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment