మసీదు కమిటీ సభ్యులకు మంత్రి సవిత భర్త బెదిరింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఎవరైనా అడ్డొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శాల్తీలు లేచిపోతాయ్.. బాడీలు కూడా కనపడకుండా చేస్తా. ఇక్కడికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ సద్దాం వస్తే మర్యాదగా ఉండదు’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు బెదిరించారు. ఈ ఘటన ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 40 ఏళ్లకు పైగా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
ఇక్కడ దుకాణం పెట్టుకున్న నయాజ్ దాన్ని కొంతకాలం క్రితం రియాజ్ అనే వ్యక్తికి స్నేహ పూర్వకంగా ఇచ్చి ముంబై వెళ్లాడు. ఇటీవల తిరిగొచి్చన అతను, తన షాపు తనకు ఇవ్వాలని కోరగా రియాజ్ నిరాకరించాడు. వీరి మధ్య వివాదం కొనసాగుతుండగానే రియాజ్ ప్రస్తుతమున్న షాపును శ్మశానం వైపు పొడిగించి పెద్ద షెడ్డు వేస్తుండడంతో మసీదు కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రియాజ్ వారి మాటను పట్టించుకోకపోవడంతో దుకాణానికి తాళం వేశారు.
దీంతో టీడీపీ కార్యకర్త అయిన రియాజ్ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన పోలీసులతో చేరుకుని దుకాణం తాళాలను పగులగొట్టడమే కాకుండా అక్కడున్న జామియా మసీదు కమిటీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు దాదు, నిషార్, షమి, సన్నా తదితరులు దౌర్జన్యానికి దిగారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సర్ది చెప్పి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా మంత్రి భర్త దౌర్జన్యంపై ముస్లింలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment