తమిళసినిమా: 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం స్ఫూర్తి దాయకంగా ప్రోత్సాహకరంగా జరిగింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన చిత్రోత్సవ కార్యక్రమాలు 46 దేశాలకు చెందిన చెన్నై సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన 171 చిత్రాల ప్రదర్శన చెన్నై సినీ ప్రముఖులను పులకరింప చేసింది. అదే విధంగా ఉన్నత విలువలతో కూడిన మంచి కథా వస్తువుగా తమిళ చిత్రాలకు చక్కనిగుర్తింపు, గౌరవం దక్కింది. ఈ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో యువతరానికి తగిన ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్‌లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు.
కుట్రం కడిదల్‌కు ప్రథమ అవార్డు
ముందుగా ప్రతి ఏడాదీ అందిస్తున్న టెలిఫిలిం బఫ్ అవార్డు కోసం అత్యధికంగా 138 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. వాటిలో టెలిఫిలిం బఫ్ అవార్డును మద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్ అధ్యాపకుడు ఎస్.వినాయక్ గెలుచుకున్నారు. అదేవిధంగా ఎంజీఆర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు రూపొం దించిన ఐదు షార్ట్ ఫిలింస్‌లు ‘ఛీ’ అనే షార్ట్ ఫిలిం అమ్మా అవార్డును గెలుచుకున్నాయి. ఈ లఘు చిత్రరూపకర్త మనోజ్‌కుమార్ ఈ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు.
అమితాబ్‌బచ్చన్ యూత్ ఐకాన్ అవార్డును ఈ ఏడాది యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు దక్కింది. ఆయన అవార్డుతో పాటు లక్ష రూపాయల బహుమతిని అందుకున్నారు. కాగా తమిళ చిత్రాల పోటీలు మహిళాదర్శకురాలు తావిత్ షమీమ్ తెరకెక్కించిన పూవరసం పీపీ, నట దర్శకుడు పార్దీపన్ రూపొందించిన కథై తిరె కథై ఇయక్కం చిత్రంలో ప్రత్యేక జూరి అవార్డులను గెలుచుకున్నాయి. వీటికి తలా లక్షరూపాయల నగదు బహుమతుల్ని అందించారు.
ఇక రెండో ఉత్తమ కథా చిత్రంగా నవ దర్శకుడు హబ్ వినోద్ దర్శకత్వంలో నటుడు మనోబాల నిర్మించిన చదరంగవేట్టై గెలుచుకుంది. ఈ అవార్డుతో పాటు నిర్మాతకు లక్ష, దర్శకుడిగి లక్ష నగదు బహుమతితో సత్కరించారు. ప్రథమ ఉత్తమ కథా చిత్రంగా కుట్రం కడిదల్ చిత్రం ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బ్రహ్మజీకి రెండు లక్షలు, నిర్మాతలు సతీష్‌కుమార్, కిష్టి సిలువప్పన్‌లకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఇండో సినీ అప్రిషియోషన్ సంస్థ నిర్వహించిన ఈ చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ రాధిక ఫిలిం చాంబర్ అధ్యక్షుడు వాసుదేవన్, నటి సుహాసిని, పూర్ణిమా భాగ్యరాజ్, శ్రీప్రియన రాజ్‌కుమార్, పీ.వాసు మొదలగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఉత్తమ చిత్రాల ఎంపిక కష్టమనిపించింది
ముందుగా అవార్డు బ్యూరీ కమిటీ సభ్యుడు, దర్శకుడు పీ.వాసు మాట్లాడుతూ ఈ రోజు తమిళ సినిమా హెడ్‌మాస్టర్ లేని పాఠశాలగా మారిపోయిందన్నారు. కారణం అందరికీ తెలిసిందే. కె.బాలచందర్ లేని లోటు తీర్చలేనిదన్నారు. ఇక ఈ చిత్రోత్సవాల గురించి చెప్పాలంటే 171 విదేవీ చిత్రాలను తమిళ సినీ ప్రేక్షకుల చూసే భాగ్యం కలిగిందన్నారు. అవార్డుల పోటీలో పాల్గొన్న 12 తమిళ చిత్రాలలో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమైందని అన్నారు. మంచి కథా చిత్రాలను చూడాలంటే ఇంతకుముందు కోల్‌కత్తా, బెంగళూరు, కేరళ చిత్రాలను ఉదాహరణగా చెప్పేవారన్నారు. అలాంటిదిప్పుడు తమిళ సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన చిత్రాలు ఉంటున్నాయని అన్నారు.
కె.బాలచందర్ అవార్డు
గత ఏడాది ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ యువ కళాకారులను ప్రోత్సహించే విధంగా 11 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని అమితాబ్ యువ ఐకాన్ అవార్డును ప్రవేశ పెట్టి ప్రతి ఏడాదీ ఒకవర్ధమాన కళాకారుడికి అవార్డుతో పాటు *లక్ష అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మరో అవార్డు నెలకొననుంది. అదే బాలచందర్ అవార్డు. ఈ అవార్డు కోసం ప్రతి ఏడాది నటి శ్రీప్రియ రాజ్‌కుమార్ *లక్ష రఅందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను దర్శక శిఖరం బాలచందర్‌కు అంకితం ఇస్తున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు.
చెన్నై సినీ చిత్రోత్సవాలు బాలచందర్‌కు అంకితం
Published Sat, Dec 27 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement