
నింగే హద్దుగా.. తెలంగాణ పండగ
సాక్షి, నల్లగొండ, నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష, 60 ఏళ్ల పోరాటం ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం వచ్చే నెల 2వ తేదీన మనుగడలోకి రానుంది. ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కనీవిని ఎరుగని రీతిలో అధికారికంగా స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం ఆరు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రాథమిక ప్రణాళిక రూపొందించింది. 1947లో దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చినప్పుడు కలిగినంత ఆనందం కంటే రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ అవతరణ ఉత్సవాలను జరపాలని కంకణం కట్టుకున్నారు.
ఈ మేరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండు మూడు తరాలపాటు సంబరాలు గుర్తిండిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న కృత నిశ్చయంతో అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఉత్సవాల తోరణం..
‘నీలగిరి తెలంగాణ అవతరణ ఉత్సవాలు’ పేరిట ఈనెల 28 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు కార్యక్రమా లు చేపట్టాలని ప్రణాళిక తయారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు, బొట్టుకు అద్దం పట్టే లా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సామన్యుడి నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు.
జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం ఇందుకు వేదిక కానుంది. ఈ క్రమంలో కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దనున్నారు. ఉత్సవాల కోసం ఇప్పటికే 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒకరు నుంచి నలుగురు వరకు అన్ని శాఖల జిల్లా అధికారులు ఉంటారు. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత అప్పగించారు. నిర్వహణ, ఆహ్వాన, ఆర్థిక, క్రీడలు, సాంస్కృతిక, ప్రచార కమిటీలు ఏర్పాటయ్యాయి.
కార్యక్రమాలు ఇలా..
ఈనెల 28న మండలస్థాయిలో పురుషులు, మహిళలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ముగ్గులు, బతుకమ్మ పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 29న డివిజన్‌స్థాయి పోటీలు నిర్వహిస్తారు.
30వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు.
31వ తేదీన ఉదయం జిల్లా చరిత్ర సంస్కృతి-సాహిత్యంపై కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం జిల్లాలోని జానపద కళారూపాలను క్రోడీకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వచ్చేనెల ఒకటో తేదీ రాత్రి ఏడు నుంచి 10 గం టల వరకు కార్నివాల్ (తిరునాలు) నిర్వహిస్తా రు. ఎన్జీ కళాశాల మైదానం నుంచి మొదలుకొని క్లాక్‌టవర్ వరకు రోడు పక్కన తిరునాలు నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది.
ఇందుకోసం అక్కడక్కడ ఆరు ప్రధాన వేదికలు ఏర్పా టు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. అంతేగాక తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ఖవ్వాలి వంటి కార్యక్రమాలు చేపడతారు.అదేరోజురాత్రి 10.30 నుంచి 12 గంటలకు వరకు సెలబ్రిటీని ఆహ్వానించి ఆర్కెస్ట్రా నిర్విహ స్తారు. అనంతరం ‘ఫైర్ వర్క్స్’ కార్యక్రమం పేరిట టపాసులు కాల్చి తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలుకుతారు. వ తేదీన ఉదయం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతారు.