సంప్రదాయాలను భావితరాలకు చాటుదాం
మంత్రి పరిటాల సునీత
అనంతపురం ఎడ్యుకేషన్ : తెలుగింటి అభిరుచులు, అలవాట్లు, సంప్రదాయాలు భావితరాలకు చాటుదామని పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె సునీత పేర్కొన్నారు. సాంస్కృతిక వ్యవహార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సంక్రాతి సంబరాలు-15 జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి వేడుకలు’ నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ. కోటి రూపాయలు నిధులు విడుదల చేశారన్నారు.
ఇక్కడ స్టాళ్లు, ముగ్గుల పోటీలు, గురవయ్యలు, కబడ్డీ, సాంస్కృతిక కార్యక్రమాలు పల్లెలను గుర్తు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ సంక్రాంతి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘చంద్రన్న సంక్రాతి కానుక’ అందజేశామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న అనంతపురం జిల్లా ఔన్నత్యాన్ని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పల్లె వంటకాలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఇన్‌చార్జి కలెక్టరు లక్ష్మీకాంతం మాట్లాడుతూ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన సంక్రాంతి పండుగను ఆడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతపురం మేయర్ మదమంచి స్వరూప, ఏజేసీ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.