సాక్షి, ఇంద్రవెల్లి: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు పాత ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల సార్‌మెడిల ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని ఆయా ఆదివాసీ గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు.
ఫంక్షన్ హాల్‌లో పెళ్లిలు రద్దు...
ప్రస్తుతం మారుతున్న కాలంలో ఒక్కరిని చూసి ఒక్కరూ ఉన్న కుటుంబీకులు పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో కాకుండా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించడంపై చర్చించారు. పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో లేదా.. ఇల్లరికం అయితే వధువు ఇంట్లో నిర్వహించాలని ఆదివాసీ పెద్దలు తీర్మానాలు చేశారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయం...
తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగించడం, పెళ్లిల్లో అక్కాచెల్లెల్లు తప్ప ఇతరులకు అహేరి(కానుక)లు రద్దు చేయుడం, సామూహిక వివాహాలు చేయడం, ఎర్రబోట్టు కార్యక్రమంలో సాల్ ముద్ద(బంగారపు ఉంగరం) ఇవ్వరాదు. పెళ్లిచూపులకు పది మంది కంటే ఎక్కువ మంది వెళ్లరాదు. పెళ్లి వేడుకల్లో నాలుగు డోళ్లు మాత్రమే ఉపయోగించాలి. వధువును పెళ్లికి ఒక రోజు ముందే పెళ్లి కొడుకు గ్రామానికి పంపించాలి. నిర్ణయించిన సమయంలో పెళ్లి చేయాలి. అక్షింతలు పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే వాడాలి.
వధూవరులకు ముఖాముఖిగా తమకు తోచిన కట్నకానుకలు ఇవ్వాలి. వివాహ వేడుకల్లో వరుడు దోతి, రూమల్ ధరించాలి. పెళ్లి మండపంలో కరెకోపాల నీటితో మండపం వద్దనే స్నానం చేయించాలి. కట్నం, హుండీ, బండి, బెడ్, కూలర్, ప్రీజ్ ఇవ్వడం రద్దు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్, వడగామ్, ఇంద్రవెల్లి తదితర రాయిసెంటర్లలో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశారు.
పాత ఆచారాలను అమలు చేయాలి
ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న వరకట్నాలు, కానుకలతో నిరుపేద కుటుంబీకులు పెళ్లిలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాయిసెంటర్ సమావేశంలో ఆదివాసీ పెద్దలు చేసిన తీర్మానాన్ని ఆదివాసీ గ్రామాల్లో అమలు చేసి పాత పద్ధతి, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలను అన్ని గ్రామాల్లో అమలు చేయాలి.
– ఆత్రం మారు, వడగామ్
కట్నం లేని పెళ్లి చేద్దాం..
సిర్పూర్(యూ): పేదల ఇంట్లో ఖర్చు లేకుండా పెళ్లి చేయలాంటే ఆదివాసీ పెళ్లిళ్లు ఎంతో ఆదర్శం. గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేయాలంటే నయా పైస ఖర్చు లేకుండా జరిగిపోయేది. పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని గ్రామస్తులు అన్ని తామై చేసేవారు. కాలక్రమంలో వరకట్నాలు, బహుమతులు, కానుకలు ఇవ్వడం మొదలైంది. ఇలాంతి సంస్కృతి సమాజానికే ప్రమాదమని గ్రహించి ఆదివాసీ పెద్దలు తిరిగి తమ పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. కట్నకానుకలు నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. సిర్పూర్(యు) గ్రామ పటేలు ఆత్రం ఆనంద్‌రావు కట్నాకానుకలు తీసుకోవద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాయిసెంటర్‌లో సమర్పించి అన్ని గ్రామాల్లో ఇదే పద్ధతి అమలయ్యేలా నాంది పలకనున్నట్లు గ్రామపటేళ్లు చెబుతున్నారు
పెళ్లి పేదలకు భారం కాకూడదు..
గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేస్తున్నారంటే ఎలాంటి ఖర్చు లేకుండా జరిగేది. కానీ నేటి ఆధునిక యుగంలో ఒకరిని చూసి ఒకరు కట్నాలు ఇవ్వడం, తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి సమాజానికి మంచిది కాదని భావించాం. పేదవారికి పెళ్లి అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో కట్నాలను నిషేధిస్తూ గ్రామ తీర్మానం చేశాం. పెద్దలతో చర్చిస్తూ అన్నీ గ్రామాల్లో ఇదే పద్ధతిని అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నం. పాత ఆచారాలు, సంప్రదాయాలు అందరికీ మేలుచేస్తాయి.
– ఆత్రం ఆనంద్‌రావు, గ్రామపటేలు
మంచి నిర్ణయం
ప్రస్తుతం కట్నకానుకలతో ఆడ పిల్లల పెళ్లిలు నిర్వహించడానికి నిరుపేద కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతన్నారు. అదే విధంగా రోజురోజుకూ మారుతున్న కాలంలో పాత ఆచారాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాయిసెంటర్‌లో చేసిన తీర్మానం ప్రకారం పెళ్లిలు, వేడుకలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో అమలు చేయాలి.
– రాయిసిడం అన్నపుర్ణ, గోండ్‌గూడ
మా కాలంలో కట్నాలు లేవు
మా కాలంలో కట్నాలు లేవు.. కానుకలు లేవు... సాధారణంగా పెళ్లి చూపులు చూసి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలు జరిగాయి. రోజురోజుకూ పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిలు చేయడానికి కట్నాలు, కానుకల పేరుతో లక్షలు కూడా సరిపోవడం లేదు. పాత పద్ధతిలో వేడుకలు నిర్వహించాలి.
– ఆత్రం లక్ష్మిబాయి, ఇంద్రవెల్లి, గోండ్‌గూడ
Comments
Please login to add a commentAdd a comment