
సంప్రదాయాన్ని ఆధరిద్దాం
మనసులో ఎంతగా తపనున్నా... మనదైన సంప్రదాయాలపై ఎంత మక్కువున్నా... తప్పనిసరై ‘తెలుగుదనాన్ని’ దూరంగా పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రెడిషనల్ వేర్ మీద పెరిగిన మక్కువ ప్రతి చోటా కనపడుతోంది. అందుకు అనుగుణంగానే నగరంలో జరిగే ప్రతి ఫ్యాషన్‌షోలో ఏదో ఒక ట్రెడిషనల్ వేర్ సీక్వెన్స్ పెడుతున్నారు. పేరున్న బ్రాండ్స్ సైతం సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్‌ని సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని విడుదల చేస్తున్నాయి. ‘సంక్రాంతి వేడుకల్లో సంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఫెస్టివ్ కలెక్షన్స్‌ను లాంచ్ చేశాం’ అని సాహిబా డెరైక్టర్ యాష్ సలూజా అంటున్నారు.
నేటి పరిస్థితుల్లో ఆసక్తి ఉన్నంత మాత్రాన ఆహార్యం మార్చేయలేం. పండుగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రం ట్రెడిషనల్ వేర్‌ని పరిమితం చేసుకుంటున్నాం. దీనివల్ల వస్తున్న చిక్కు... అరుదుగా వాడుతుండడం వల్ల వాటి వినియోగంలో ఉన్న సౌకర్యం ఎప్పటికీ వంటబట్టడం లేదు. ఇటువంటి వారికి ఆధునిక విపణి కొన్ని మార్గాలు అందిస్తోంది.
‘పంచె’తంత్రం...
తెలుగు‘వాడి’కి చిహ్నమైన పంచెకట్టు ఎంతో అందంగా, హుందాగా ఉంటుంది. ఎందరో తెలుగు ప్రముఖులు పంచెకట్టుతో ప్రపంచాధినేతలనే కట్టిపడేశారు. దీనిపై మక్కువ ఉన్నా కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునేవారి కోసం స్టిచ్చింగ్ పంచెలు మార్కెట్లోకి వచ్చేశాయి. తరచుగా జారిపోవడం, దోపుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారి కష్టాలకు ఇవి చెక్ పెడుతున్నాయి. వీటిని డిజైనర్, రెడీమేడ్ పంచెలు అని కూడా వ్యవహరిస్తున్నారు.
వేడుకలకు తగ్గట్టుగా...
సంక్రాంతి వంటి పండుగలకు పంచెకట్టు వంటివి ధరించడం, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల సమయంలో షేర్వాణి, కుర్తా పైజమా వగైరాలతో పురుషులు సంప్రదాయాన్ని పండించవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే యువతులైతే హాఫ్‌శారీలు, మహిళలైతే చీరలు బావుంటాయని వేరే చెప్పనక్కర్లేదు. వీటిలో కూడా సులువుగా ధరించేలా స్టిచ్‌డ్ శారీస్ అందుబాటులో ఉన్నాయి.
అలవాటు చేసుకొంటే మేలు
ట్రెడిషనల్ వేర్‌కు ఇప్పుడు ప్రాధాన్యం బాగా పెరిగింది. అయితే ఎంత ఇష్టం ఉన్నా చీరలు, హాఫ్‌శారీలు ఉపయోగించడంలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోయింగ్ స్టైల్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకుంటే మరింత సులభంగా చీర కట్టుకోవచ్చు. దళసరి ఫ్యాబ్రిక్‌తో చేసే చీర ధరిస్తే కొత్తవారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే జార్జెట్స్, షిఫాన్స్ వంటివి పార్టీలకు, ఫంక్షన్లకు... పెళ్లిళ్లకు బెనారస్, ఉప్పాడ వంటివి... పండగలకు పోచంపల్లి, కలంకారి, ఇకత్ తదితర వెరైటీలు ఎంచుకోవాలి.
- అజితారెడ్ది, హామ్‌స్టెక్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్