తెస్తారా.. వదిలేస్తారా..?
తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, భూములు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టిన గత పాలకులు చారిత్రక సంపదనూ వదల్లేదు. ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన కాలచక్రలో ప్రదర్శించడానికి కొలనుపాక, పానగల్లు నుంచి తరలించిన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు చేర్చలేదు. అత్యంత అమూల్యమైన బౌద్ధ సంపదను తెలంగాణ రాష్ట్రంలోనైనా రాబట్టుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు. -భువనగిరి
⇒ ఎనిమిదేళ్ల క్రితం అమరావతికి
⇒ తరలిన మన బౌద్ధ సంపద
⇒ రాష్ట్ర విభజన వరకు స్వస్థలానికి చేర్చని పాలకులు
⇒ తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు
కొలనుపాక.. బౌద్ధ చరిత్రకు నిలయంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం. నల్లగొండ జిల్లా ఆలేరుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం అత్యంత విలువైన చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. అయితే గత పాల కుల హయాంలో గుంటూరులో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఇక్కడి నుంచి తరలించిన విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి తీసుకురాలేదు.
అసలేం జరిగిందంటే..
2005 నవంబర్‌లో గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధులకు సంబంధించి ‘కాలచక్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాతో పాటు దేశవిదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో బౌద్ధ మతస్తులు హాజరయ్యారు. వారి సందర్శనార్థం ఉంచటానికి జిల్లాలోని పానగల్, కొలనుపాక మ్యూజియం నుంచి బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలు, బౌద్ధ మతానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు, పీఠాలను అమరావతికి తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి స్వస్థలాలకు చేర్చాల్సిన ఉండగా ఇప్పటి వరకు తీసుకురాలేదు.
ఈ విషయమై అప్పట్లో శాసనసభలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగగా పానగల్ మ్యూజియానికి బుద్ధుని విగ్రహం మాత్రం వచ్చింది. పానగల్ మ్యూజియానికి ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. అలాగే కొలనుపాక మ్యూజియంలో వజ్రపాణి (బుద్ధుడు సూర్యునిగా వెలుగొందిన ప్రతిరూపం), బుద్ధుని పీఠం (పెడస్టల్ ఆఫ్ బుద్ధ), లైన్‌స్టోన్ పిల్లర్ (బుద్ధ ఇమేజ్) బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత విలువైన రాత్రి విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి.
తవ్వకాలలో బయల్పడిన విగ్రహాలలో కొన్ని..
కొలనుపాకతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యంత విలువైన చారిత్రక శిలా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానంగా వీరశైవ మతానికి సంబంధించిన విగ్రహాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన రాత్రి విగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న జైన మతానికి సంబంధించిన ప్రాచీనమైన దేవాలయంలో పురావస్తు శాఖ వారు మ్యూజియం ఏర్పాటు చేసి లభించిన విగ్రహాలను భద్రపరిచింది.
చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం
అమరావతికి తరలించిన అత్యంత విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు తీసుకురాకపోతే వాటికున్న చారిత్రక నేపథ్యం కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాల వల్ల పూర్వకాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లిందన్న ఆధారాలు ఉన్నాయి. వాటిపై పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో పరిశోధన జరిపితే అత్యంత విలువైన సమాచారం లభించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేల తరలిపోయిన సంపదను తిరిగి రాబట్టుకోనట్లయితే ఈ ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యత తెరమరుగయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.