Buddhist culture
-
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్‌లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
మైమరిపించేలా.. మహాస్తూపం
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతానికి వెళ్తే బుద్ధుడి జీవితచక్రం కళ్లముందు కదలాడుతుంది.. ఆ మహనీయుని బోధనలు అడుగడుగునా ప్రేరణ కల్పించేలా వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రధాన బౌద్ధ స్థూపాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం దేశంలోనే ప్రధాన బౌద్ధపర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటోంది. అదే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం. 249 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణాల పరంపరలో కీలకమైన మహాస్తూపం ప్రత్యేక తరహాలో సిద్ధమవుతోంది. నంద్యాలలో చెక్కిన శిల్పాలు ఇటీవలే బుద్ధవనం చేరుకున్నాయి. వాటిని ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశ గుమ్మటం... ఆకర్షణీయం.. మహాస్తూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. అదే ప్రధాన మందిరం. లోపలి వైపు నిలబడి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. పైకప్పునకు ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 16 వరసల్లో గులాబీ పూరేకుల తరహాలో తీర్చిదిద్దా రు. ఈ ఏర్పాటు సిమెంటుతో కాకుండా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్‌తో ఏర్పాటు చేయటం విశేషం. అందులోనే నాలుగు దిక్కులా ఒక్కోటి 9 అడుగుల ఎత్తులో ఉండే నాలుగు బుద్ధుడి భారీ రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మచక్ర ప్రవర్ధన ముద్రలో ఇవి ఉంటాయి. వీటి మధ్య ఒక్కోటి మూడు అడుగుల ఎత్తుతో మరో 4 విగ్రహాలుం టాయి. అవి ధ్యాన ముద్ర, భూస్పర్శ ముద్ర, అభయముద్ర, వర్ణముద్రల్లో ఉంటాయి. వీటి ప్రతిష్ట పూర్తయితే ప్రధాన నిర్మాణం పూర్తయినట్టే. ప్రధాన ద్వారం వద్ద అష్టమంగళ చిహ్నాలు, బుద్ధుడి జాతకచిహ్నాలను రాతితో చేయించిన 104 ప్యానెల్స్‌పై చెక్కించి ఏర్పాటు చేయించారు. మధ్య 17 అడుగులతో ధర్మచక్ర స్తంభం ఠీవిగా నిలబడి ఆకట్టుకుంటోంది. ఇక బుద్ధచరిత్ర వనంలో బుద్ధుడి జీవితగాథలోని ప్రధానఘట్టాలు ప్రతి బింబించేలా 10 కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేయించారు. బుద్ధుడి జాతక కథలను తెలిపే 40 రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా 27 అడుగుల ఎత్తుతో ఔకాన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. మన దేశంలోని ప్రధాన 5 బౌద్ధ స్తూపాలు, వివిధ దేశాల్లోని ప్రధాన 8 స్తూపాల సూక్ష్మ నమూనాలతో మినియేచర్ పార్కును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులతోపాటు సాధారణ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. -
రేపటి నుంచి అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవాలు
⇒ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ⇒ హాజరుకానున్న పలుదేశాల ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణని తరచి చూస్తే గోదారి పొడవునా అలనాటి ప్రాచీన వారసత్వ సంపదైన బౌద్ధ సంస్కృతి పొంగిపొర్లిన ఆనవాళ్లుంటాయి. బాదన్‌కుర్తి మొదలుకొని, నాగార్జునకొండ వరకు ప్రతిచోట బౌద్ధం నడయాడిన అరుదైన చరిత్ర తెలంగాణ సొంతం. ఆ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో రెండు రోజులపాటు రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్టు మంత్రి చందూలాల్ మంగళవారం టూరిజం ప్లాజాలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 27 బౌద్ధ చారిత్రక ప్రదేశాలున్నాయని, అందులో 11 ఇప్పటికే గుర్తింపు పొందాయన్నారు. రాష్ట్రంలోని గోదావరీ నదీపరీవాహక ప్రాంతాల్లో బుద్ధిజం ఆచరించబడిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. ఇది యావత్ దేశానికే ఇది గర్వకారణమన్నారు. గురువారం(23) నుంచి నాలుగు రోజుల పాటు(26) వరకు జరిగే తెలంగాణ బుద్ధిజం అంతర్జాతీయ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. దీనికి ప్రపంచ దేశాల నుంచి దాదాపు 250 మంది హాజరవుతున్నారన్నారు. బౌద్ధ చరితను ముందుతరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టీనా చాంగ్ధూ అన్నారు. ఇటువంటివి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకురావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మలేసియాకి చెందిన బుద్ధిస్ట్ రచయిత, చరిత్రకారుడు కుమార్సేథి అన్నారు. -
తెస్తారా.. వదిలేస్తారా..?
తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, భూములు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టిన గత పాలకులు చారిత్రక సంపదనూ వదల్లేదు. ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన కాలచక్రలో ప్రదర్శించడానికి కొలనుపాక, పానగల్లు నుంచి తరలించిన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు చేర్చలేదు. అత్యంత అమూల్యమైన బౌద్ధ సంపదను తెలంగాణ రాష్ట్రంలోనైనా రాబట్టుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు. -భువనగిరి ⇒ ఎనిమిదేళ్ల క్రితం అమరావతికి ⇒ తరలిన మన బౌద్ధ సంపద ⇒ రాష్ట్ర విభజన వరకు స్వస్థలానికి చేర్చని పాలకులు ⇒ తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు కొలనుపాక.. బౌద్ధ చరిత్రకు నిలయంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం. నల్లగొండ జిల్లా ఆలేరుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం అత్యంత విలువైన చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. అయితే గత పాల కుల హయాంలో గుంటూరులో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఇక్కడి నుంచి తరలించిన విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి తీసుకురాలేదు. అసలేం జరిగిందంటే.. 2005 నవంబర్‌లో గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధులకు సంబంధించి ‘కాలచక్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాతో పాటు దేశవిదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో బౌద్ధ మతస్తులు హాజరయ్యారు. వారి సందర్శనార్థం ఉంచటానికి జిల్లాలోని పానగల్, కొలనుపాక మ్యూజియం నుంచి బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలు, బౌద్ధ మతానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు, పీఠాలను అమరావతికి తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి స్వస్థలాలకు చేర్చాల్సిన ఉండగా ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈ విషయమై అప్పట్లో శాసనసభలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగగా పానగల్ మ్యూజియానికి బుద్ధుని విగ్రహం మాత్రం వచ్చింది. పానగల్ మ్యూజియానికి ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. అలాగే కొలనుపాక మ్యూజియంలో వజ్రపాణి (బుద్ధుడు సూర్యునిగా వెలుగొందిన ప్రతిరూపం), బుద్ధుని పీఠం (పెడస్టల్ ఆఫ్ బుద్ధ), లైన్‌స్టోన్ పిల్లర్ (బుద్ధ ఇమేజ్) బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత విలువైన రాత్రి విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి. తవ్వకాలలో బయల్పడిన విగ్రహాలలో కొన్ని.. కొలనుపాకతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యంత విలువైన చారిత్రక శిలా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానంగా వీరశైవ మతానికి సంబంధించిన విగ్రహాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన రాత్రి విగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న జైన మతానికి సంబంధించిన ప్రాచీనమైన దేవాలయంలో పురావస్తు శాఖ వారు మ్యూజియం ఏర్పాటు చేసి లభించిన విగ్రహాలను భద్రపరిచింది. చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం అమరావతికి తరలించిన అత్యంత విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు తీసుకురాకపోతే వాటికున్న చారిత్రక నేపథ్యం కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాల వల్ల పూర్వకాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లిందన్న ఆధారాలు ఉన్నాయి. వాటిపై పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో పరిశోధన జరిపితే అత్యంత విలువైన సమాచారం లభించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేల తరలిపోయిన సంపదను తిరిగి రాబట్టుకోనట్లయితే ఈ ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యత తెరమరుగయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.