రేపటి నుంచి అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవాలు
⇒ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
⇒ హాజరుకానున్న పలుదేశాల ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణని తరచి చూస్తే గోదారి పొడవునా అలనాటి ప్రాచీన వారసత్వ సంపదైన బౌద్ధ సంస్కృతి పొంగిపొర్లిన ఆనవాళ్లుంటాయి. బాదన్‌కుర్తి మొదలుకొని, నాగార్జునకొండ వరకు ప్రతిచోట బౌద్ధం నడయాడిన అరుదైన చరిత్ర తెలంగాణ సొంతం. ఆ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో రెండు రోజులపాటు రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్టు మంత్రి చందూలాల్ మంగళవారం టూరిజం ప్లాజాలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 27 బౌద్ధ చారిత్రక ప్రదేశాలున్నాయని, అందులో 11 ఇప్పటికే గుర్తింపు పొందాయన్నారు.
రాష్ట్రంలోని గోదావరీ నదీపరీవాహక ప్రాంతాల్లో బుద్ధిజం ఆచరించబడిందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. ఇది యావత్ దేశానికే ఇది గర్వకారణమన్నారు. గురువారం(23) నుంచి నాలుగు రోజుల పాటు(26) వరకు జరిగే తెలంగాణ బుద్ధిజం అంతర్జాతీయ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. దీనికి ప్రపంచ దేశాల నుంచి దాదాపు 250 మంది హాజరవుతున్నారన్నారు.
బౌద్ధ చరితను ముందుతరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టీనా చాంగ్ధూ అన్నారు. ఇటువంటివి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకురావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మలేసియాకి చెందిన బుద్ధిస్ట్ రచయిత, చరిత్రకారుడు కుమార్‌సేథి అన్నారు.