వేల ఏళ్ల క్రితమే భారతదేశం శాంతి సౌభాగ్యాలను ప్రవచించిన బుద్ధభూమిగా విదేశాల వారికి తెలుసు. ప్రపంచమంతా కత్తులతో సామ్రాజ్య విస్తర ణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నాడు. అదీ భారత వారసత్వ బలం. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. బౌద్ధ సూత్రాలు అనేకం మన రాజ్యాంగంలోనూ పొందుపరచారు అంబేడ్కర్.
అయితే ఈనాడు తద్ద్విరుద్ధమైన పరిస్థితులుదేశంలో నెలకొని ఉన్నాయి. దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో ఉంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమం అవసరం.
ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్‌లో 18వ ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) సదస్సులో ప్రసంగిస్తూ ‘మానవుని భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధునిలో ఉందని’ ఉద్ఘాటించారు. ఇది చాలా చరిత్రాత్మకమైన ప్రకటన. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ప్రకటన అని చెప్పక తప్పదు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి గురించి, అలాగే ఇజ్రాయెల్– గాజా మధ్య జరుగుతున్న మానవ హననం గురించిన ఆందోళన ఇందులో లీనమై ఉంది. ఇంకా ఆయన ఈ సందర్భంగా మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వార సత్వం కారణంగా మన తత్త్వాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామనీ, ప్రస్తుతం ప్రపంచం మనం చెప్పే మాటను వింటోందని తెలిపారు.
ఆయన మరొక ముఖ్యమైన ప్రస్తావన కూడా చేశారు. ‘ప్రపంచ మంతా కత్తులతో సామ్రాజ్య విస్తరణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నారు. అదీ భారత వారసత్వబలం. భారత్ అంటే ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. భిన్నత్వం గురించి మనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలు దానిపైనే నడుస్తున్నాయి. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా ఆ సమాజంలోఅంతర్భాగం అవుతారు.
ఆ యా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ చిత్తశుద్ధితో పనిచేసి అక్కడి పురోభివద్ధికి దోహదపడు తుంటారు. అదే సమయంలో వారి హృదయాలు భారత్ కోసం తపిస్తుంటాయి. ప్రవాసులను మన దేశ రాయబారులుగా నేను చూస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరుగుతున్నానంటే దానికి వారే కారణం. అన్ని చోట్లా వారు నాకు ఘనస్వాగతం చెబు తుంటారు. భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని అన్నారు.
వాస్తవానికి భారతదేశం అశోకుడు కత్తి దించాక ప్రపంచంఅంతా విస్తరించింది. కేవలం సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, తాత్విక సాంస్కృతిక విప్లవం కూడా భారత్ నుండి ప్రపంచానికి విస్తరించింది. భారతదేశం ఉత్పత్తి క్రమం పెరగాలంటే తప్పక బౌద్ధం విస్తృతి ప్రపంచ దేశాలకే కాదు భారతదేశానికీ మరింత అవసరం అని అంబేడ్కర్ అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ప్రసిద్ధ భారతదేశ చరిత్ర పరిశోధకులు రొమిల్లా థాపర్ బౌద్ధం... మరీ ముఖ్యంగా అశోకుని బౌద్ధం స్వీయ జీవిత అనుభవం నుంచి వ్యక్తీక రించబడిందని, అనుసరించబడిందని చెప్తూ అది భారతదేశంలో నూత్న నిర్మాణానికి దారి తీయడానికి ఎన్నో సామాజిక అసమాన తలకు సంబంధించిన అమానవ ధర్మాలను త్రోసి పుచ్చిందని అన్నారు.
‘దమ్మం అనేది అశోకుని దృష్టిలో ఒక జీవిత విధానం. అది అతనికి పరిచయమున్న తత్త్వవేత్తల నైతిక బోధనల సారం. బహుశా స్వీయ జీవితానుభవ సారం కూడా అయివుండవచ్చు. ఆ జీవిత విధానం ఉన్నత స్థాయి సామాజిక నీతి మీద, పౌరబాధ్యతల మీద ఆధారపడింది. అంతేగాక అశోకుడు... వర్ణవ్యవస్థను గురించి ఆదర్శప్రాయంగా చిత్రించిన సిద్ధాంతంగా కాక, నిత్యజీవితం దృష్ట్యా తన దమ్మాన్ని రూపొందించార’ని రొమిల్లా థాపర్ విశ్లేషించారు. ‘సాధారణంగా పెక్కు సమాజాలలో కన్పించే సాంఘిక డాంబికత్వాన్ని పరిహరించి, మానవత్వ సిద్ధమైన సాంఘిక ప్రవర్తనను అశోకుడు కాంక్షించాడు.
స్వర్గ సౌఖ్యం వంటి ఆధ్యాత్మిక భావనలో ప్రజలకు పరిచయముంది. అటువంటి ప్రతిఫలాల ఆశ చూపటం ద్వారా సాంఘిక బాధ్యతను కేవలం సదాచార వర్తనగా గాక, సాత్విక ప్రాధాన్యం ఉండి నిర్వా్యజంగా అనుసరించే బాధ్యతగా ఉదాత్త స్థానానికి కొనిపోవడానికి అశోకుడు ప్రయత్నించాడ’ని రొమిల్లా థాపర్ అశోకుని పరిపాలనా విధానం గురించి చెప్పారు.
ఈనాడు భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక, ఆర్థిక విప్లవం అవసరం అని నరేంద్ర మోదీ సంఘ్‌పరివార్ శక్తులకు కూడా బోధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో వుంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా ఆయనఅంతర్గత లౌకిక వాదానికి కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది.
భారతదేశానికి దిగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతులు తగ్గుతున్నాయి. భారతదేశంలో సామాజిక ఆర్థిక ఉత్పత్తులు పెరగా లంటే ఈనాడు తప్పకుండా సామాజిక జీవన సామరస్యాన్ని,శాంతిని, కరుణను, కుల వివక్షేతరమైన ప్రజ్ఞను గుర్తించే కుల నిర్మూలనా భావం పాలకులకు అవసరం. బౌద్ధ సంస్కృతీ వికాసం అవసరం. అశోకుడి పాలనను పునర్వివేచించుకొని సమన్వయించు కోవడం అవసరం.
బౌద్ధాన్ని ఒక మతంగా కాక ఒక ధర్మంగా, ఒక నీతిగా పరి వ్యాప్తి చేయవలసిన అవసరం వుంది. సారనాథ్‌లో అశోకుడు నిలిపిన శిలాస్తంభ అగ్రభాగంలోని నాలుగు సింహాల శిల్పాన్ని భారత ప్రభుత్వం అధికార ముద్రగా స్వీకరించింది. కానీ ఈ దేశాన్ని బౌద్ధ భూమిగా ప్రకటించలేకపోయింది. అయితే ఇప్పుడు హిందూదేశంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుండడం గమ నార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు యుద్ధానికి బదులు శాంతి అవ సరం అని చెబుతున్న పాలకులందరూ ఆయుధ సంపత్తికే ఎక్కువ ధనం ఖర్చు బెట్టడం విడ్డూరం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంత ర్జాతీయ వేదికలపై చెబుతున్న మాటలను భారతదేశంలో కూడా నిరంతరంగా చెప్పడమే కాక, ఆచరణలోకి తీసుకురావడం వల్లఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో భారత రాజ్యాంగకర్త అంబేడ్కర్‌ను అవమానిస్తూ మాట్లాడటాన్ని మోదీ ఖండించలేదు. అది బాధాకరమైన విషయం. బుద్ధ–అశోకులంతటి వారు అంబేడ్కర్. భారతదేశంలో ఈనాడు రక్తపాతంలేని సమాజం ఏర్పడిందంటే ఆయనే కారణం.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఆర్థిక పరిస్థితులు దిగ జారడానికి కారణం బౌద్ధ జీవన విధానం ప్రపంచంలో లేకపోవ డమే! ప్రపంచమంతా ఆశాంతిగా ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి కారణం ప్రకృతినీ, మనిషి వ్యక్తిత్వాన్నీ కాపాడుకోలేక పోవడమే. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావనలు పెరిగి పర్యావరణవిధ్వంసం, యుద్ధకాంక్ష, దోపిడీలు పెరగడం వల్ల ప్రపంచంలోశాంతి అంతరిస్తూ ఉంది.
అంబేడ్కర్ రాజ్యాంగంలో బౌద్ధ ధమ్మంలోని అష్టాంగ సూత్రాలు, పంచశీల వంటి వాటి నుండే భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. నరేంద్ర మోదీ బౌద్ధంతో పాటు ప్రపంచానికి భారత రాజ్యాంగ ప్రశస్తిని చాటవలసిన అవసరం ఉంది. బుద్ధుణ్ణి, అశోకుణ్ణి, అంబేడ్కర్‌ని భారతదేశ పునర్మిర్మాణ కర్తలుగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క మోదీనే కాదు, ప్రతిపక్ష నాయకులు, ఆ యా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బౌద్ధ సంస్కృతి వికాసానికి పాటుపడాల్సిన అవసరం ఉంది.
ఏపీ సీఎం చంద్ర బాబుకి అమరావతిని బౌద్ధ సాంస్కృతిక, తాత్విక, ఆర్థికకేంద్రంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్ప వలసిన అవసరం ఉంది. చంద్రబాబు నోట బుద్ధుని పేరు గాని, అశో కుని పేరుగాని, అంబేడ్కర్ పేరుగాని రాకపోవడం శోచనీయం. ఈనాడు భారత రాజ్యాంగ సూత్రాల పునాదుల మీద బౌద్ధ జీవన పునరుజ్జీవనానికి ఆచరణాత్మకంగా పూనుకోవాల్సిన చారిత్రక సంద ర్భంలో మనమున్నాం. ఆ దిశగా నడుద్దాం.
- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
-డా‘‘ కత్తి పద్మారావు
Comments
Please login to add a commentAdd a comment